Begin typing your search above and press return to search.

ప్లాప్ ల భ‌యంతోనే సెల‌క్టివ్ గా!

సినిమా పరిశ్రమలో స్టార్ వారసుడిగా అడుగుపెట్టడం ఎంత సులువో? ఆ ఇమేజ్‌ను కాపాడుకుంటూ సుదీర్ఘ కాలం నిలదొక్కుకోవడం అంతకంటే కష్టం.

By:  Srikanth Kontham   |   28 May 2026 8:15 AM IST
ప్లాప్ ల భ‌యంతోనే సెల‌క్టివ్ గా!
X

సినిమా పరిశ్రమలో స్టార్ వారసుడిగా అడుగుపెట్టడం ఎంత సులువో? ఆ ఇమేజ్‌ను కాపాడుకుంటూ సుదీర్ఘ కాలం నిలదొక్కుకోవడం అంతకంటే కష్టం. ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్ర కుమారుడిగా వెండితెరకు పరిచయమైన తుషార్ కపూర్ ఇండస్ట్రీలో 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. 2001లో రిలీజ్ అయిన `ముఝే కుచ్ కహనా హై` చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించిన తుషార్ పాతికేళ్ల కాలంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తనకంటూ త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపును ద‌క్కించుకున్నారు. ఈ సిల్వర్ జూబ్లీ మైలురాయిని అందుకున్న సందర్భంగా తుషార్ కపూర్ కెరీర్ గురించి ఓ ఆసక్తికరమైన నిజాన్ని పంచుకున్నారు.

పరిశ్రమలో పాతికేళ్ల ప్రయాణంలో చాలా తక్కువ సినిమాలు చేయడం వెనుక ఉన్న అసలు కారణాన్ని బయటపెట్టారు. వరుసగా పరాజయాలు వస్తే కెరీర్ ప్రమాదంలో పడుతుందనే భయం ఉండేదని అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోకుండా కథల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉన్నాన‌ని వెల్లడించారు. సంఖ్యా పరంగా ఎక్కువ సినిమాలు చేసి చేతులు కాల్చుకోవడం కంటే? తక్కువ చిత్రాలైనా ప్రేక్షకులకు గుర్తిండిపోయే పాత్రలు చేయడం మిన్నగా భావించాన‌న్నారు. ఈ వ్యూహమే ఆయనకు కామెడీ జోనర్‌లో తిరుగులేని ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది.

దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందించిన `గోల్‌మాల్` సిరీస్‌లో మూగవాడైన లక్కీ` పాత్రలో తుషార్ పండించిన హాస్యం బాలీవుడ్ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోయింది. మాటలు లేకపోయినా హావభావా లతోనే ప్రేక్షకులను అమితంగా నవ్వించారు.

ఒక వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు తండ్రి స్థాయి స్టార్‌డమ్‌ను అందుకోవాలనే ఒత్తిడి సహజంగానే ఉంటుంది. అయితే తుషార్ కపూర్ తండ్రి జితేంద్ర శైలిని అనుకరించే ప్రయత్నం ఏనాడు చేయ‌లేదు. తన పరిమితులను .. బలాలను తెలుసుకుని ముందుకు సాగారు. నెపోటిజం , ట్రేడ్ వర్గాల నుండి వచ్చే అంచనాల ఒత్తిడిని అధిగమిస్తూ కమర్షియల్ హంగుల కంటే వైవిధ్యమైన పాత్రలకే మొగ్గు చూపారు. కాలక్రమేణా నటుడిగానే కాకుండా నిర్మాణ రంగంలోకి కూడా తుషార్ అడుగుపెట్టారు.

అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన `లక్ష్మి` చిత్రానికి నిర్మాతగా వ్యవహరించి మంచి విజయాన్ని అందుకున్నారు. వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఒంటరి తండ్రిగా బాధ్యతలను స్వీకరించి సమాజంలో ఆదర్శంగా నిలిచారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మలచుకుంటూ కెరీర్‌ను ముందుకు నడిపిస్తున్నారు. సినిమా రంగంలో నిరంతరం లైమ్‌లైట్‌లో ఉండటం కంటే? గౌరవప్రదమైన స్థానాన్ని కాపాడుకోవడం ముఖ్యమని తుషార్ కపూర్ నిరూపించారు. తాత్కాలిక స్టార్‌డమ్ కోసం పరిగెత్తకుండా సుదీర్ఘ కాలం మనుగడ సాగించడం కోసం అనుసరించిన సెలెక్టివ్ ఫార్ములా నేటి తరం యువ నటులకు అద్భుతమైన గైడ్‌లా ఉపయోగపడుతుంది.