ఆయన రాకతో తుంబాడ్2 రేంజే మారిందిగా!
భారతీయ సినీ చరిత్రలో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన హార్రర్ ఫాంటసీ సినిమా తుంబాడ్ కు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 4 Oct 2025 3:06 PM ISTభారతీయ సినీ చరిత్రలో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన హార్రర్ ఫాంటసీ సినిమా తుంబాడ్ కు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. జానపద, మైథాలజీ, ఫాంటసీ, హార్రర్ అంశాల కలబోతగా ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కిన తుంబాడ్ ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా విమర్శకులను కూడా మెప్పించింది. 2018లో రిలీజైన ఈ సినిమా మొదట్లో బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది. కానీ తర్వాత నెమ్మదిగా ఆడియన్స్ నుంచి ఆదరణ పొందింది.
మొదట్లో ఫ్లాపుగా నిలిచిన తుంబాడ్
రాహి అనిల్ బార్వే, ఆనంద్ గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సోహుమ్ షా ప్రధాన పాత్రలో నటించడంతో పాటూ స్వయంగా అతనే తుంబాడ్ ను నిర్మించారు. 2018లో బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిన తుంబాడ్, 2024లో రీ రిలీజైనప్పుడు అదిరిపోయే కలెక్షన్లను అందుకుని రికార్డు సృష్టించింది. తుంబాడ్ కు వచ్చిన రెస్పాన్స్ ను చూసిన మేకర్స్ దానికి సీక్వెల్ ను తీయనున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేయగా, తుంబాడ్2 పై ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.
తుంబాడ్ కోసం పెన్ స్టూడియోస్ తో కలిసి..
తుంబాడ్2 కోసం సోహుమ్ షా, పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడాతో చేతులు కలిపారు. గంగూబాయి కతియావాడి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన పెన్ స్టూడియోస్ తో సోహుమ్ షా చేతులు కలపడంతో తుంబాడ్2 మరింత భారీ స్కేల్ తో రూపొందనుందని తెలుస్తోంది. ఈ మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్ లో ఫాంటసీ హార్రర్ ఎలిమెంట్స్ ను మరింత లోతుగా చూపించనున్నామని మేకర్స్ చెప్తున్నారు.
ఐదు నిమిషాల్లోనే డీల్ క్లోజ్
పెన్ స్టూడియోస్ తో కలవడం వల్ల తుంబాడ్2 స్థాయి మరింత పెరిగిందని చెప్తున్న సోహుమ్ షా, తాను చాలా ఏళ్లుగా జయంతిలాల్ గడా వర్క్ ను చూస్తున్నానని, తుంబాడ్2 గురించి డిస్కస్ చేయడానికి ఆయన్ని కలిసినప్పుడు కేవలం ఐదు నిమిషాల్లోనే ఆయన ఈ డీల్ ను క్లోజ్ చేశారని, తుంబాడ్ సినిమాను ఆయనెంతో ప్రశంసించారని, ఆయన ప్రేమ, ప్రశంసలు తుంబాడ్ కు మరింత విలువను పెంచాయని అన్నారు. ఇదిలా ఉంటే తుంబాడ్ సినిమాకు దర్శకత్వం వహించిన అనిల్ బార్వే, ఆనంద్ గాంధీ కాకుండా ఈ సీక్వెల్ కు ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వం వహించనున్నారు. ఆదేశ్ ప్రసాద్ తుంబాడ్ మూవీకి కో డైరెక్టర్ గా వర్క్ చేశారు.
