వివాదం : ఒకే రోజు ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు...!
సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు టైటిల్ వివాదాలు, కథ వివాదాలు చూస్తూ ఉంటాం.
By: Ramesh Palla | 16 Sept 2026 11:47 AM ISTసినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు టైటిల్ వివాదాలు, కథ వివాదాలు చూస్తూ ఉంటాం. ఒకరి కథను మరొకరు కాపీ చేస్తున్నారంటూ కొన్ని సార్లు వివాదం జరుగుతూ ఉండగా, కొన్ని సార్లు తాము రిజిస్ట్రర్ చేయించిన టైటిల్‌ను మరో నిర్మాత, దర్శకుడు వాడుతున్నాడు అంటూ ఒక నిర్మాత వాదించడం జరుగుతూ ఉంటుంది. కథ, టైటిల్ కాపీ రైట్ ఇష్యూలు చాలానే చూశాం. అయితే ఇప్పుడు ఇద్దరు ఫిల్మ్ మేకర్స్ ఒకే టైటిల్, ఒకే కథతో గందరగోళం క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల హనుమాన్ అంశ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు విశాల్ చతుర్వేది తన కొత్త సినిమాను ప్రకటించాడు. హనుమాన్ అంశ్ మాదిరిగానే మరోసారి బయోపిక్‌తో వస్తాను అంటూ ఇంతకు ముందు చెప్పాడు. అన్నట్లుగానే తులసీదాస్ జీవిత చరిత్రను తీసుకుని సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు.
సూపర్ హిట్ హనుమాన్ అంశ్ మూవీ దర్శకుడు...
ఒకవైపు హనుమాన్ అంశ్ సినిమా సందడి దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో విశాల్ చతుర్వేది కొత్త సినిమాను ప్రకటించడం వల్ల కచ్చితంగా బజ్ క్రియేట్ అవుతుందని అనుకున్నాడు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తాను చాలా కాలంగా తులసీదాస్ జీవిత చరిత్ర కథతో సినిమాను చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశాడు. అంతే కాకుండా ఒక పోస్టర్‌ను సైతం విడుదల చేశాడు. తులసీదాస్ చిన్నప్పటి పేరు అయిన రామ్‌బోలా ను తమ సినిమా టైటిల్ అంటూ విశాల్ చతుర్వేది అధికారికంగా ప్రకటించాడు. పోస్టర్ సైతం రావడంతో సోషల్ మీడియాలో సందడి మొదలు అయింది. హనుమాన్ అంశ్ దర్శకుడి తర్వాత సినిమా రామ్‌బోలా అంటూ వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతలోనే మరో ఫిల్మ్ మేకర్ అదే టైటిల్‌తో అదే తులసీదాస్ జీవిత చరిత్రతో సినిమాను ప్రకటించాడు.
రామ్‌బోలా మూవీ అనౌన్స్...
చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో 'రామ్‌బోలా' టైటిల్‌తో సినిమా అనౌన్స్‌మెంట్ రావడం అందరికీ షాక్ ఇచ్చింది. దర్శకుడు చంద్ర ప్రకాష్ మీడియా ముందుకు వచ్చి తాను చాలా కాలం క్రితమే తులసీదాస్ జీవిత చరిత్రతో సినిమాను తీసేందుకు రిజిస్ట్రర్ చేయించాను. టైటిల్ సైతం రామ్ బోలా ను ఖరారు చేసుకున్నాను. గతంలోనే తాను ప్రకటన చేసినప్పటికీ ఇప్పుడు కొత్తగా రామ్‌బోలా టైటిల్‌తో సినిమాను ఎలా ప్రకటిస్తారు అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఈ విషయమై ఫిల్మ్ రైటర్స్ అసోషియేషన్ కి వెళ్లి తేల్చుకుంటాను అన్నట్లుగా ఆయన చెబుతున్నాడు. రైటర్స్ అసోషియేషన్ తేల్చలేకుంటే కోర్ట్ కు సైతం వెళ్లేందుకు సిద్ధః అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. రామ్‌బోలా టైటిల్ వివాదంపై జాతీయ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నారు. చంద్రప్రకాష్ ద్వివేది సినిమాను ప్రకటించి చాలా కాలం అయింది. ఆయన దాన్ని వదిలేసినట్లే అన్నారు. కానీ ఇప్పుడు విశాల్ మొదలు పెట్టబోతున్నట్లు తెలిసి ఆయన మళ్లీ ఇప్పుడు హడావిడి చేస్తున్నాడని కొందరు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.
చంద్రప్రకాష్ ద్వివేది వర్సెస్ విశాల్ చతుర్వేది...
మరోవైపు ఇప్పటికే చంద్ర ప్రకాష్ ద్వివేది మొదలు పెట్టిన ప్రాజెక్ట్‌ను ఎలా విశాల్ చతుర్వేది మొదలు పెడతాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఎలాగూ హనుమాన్ అంశ్ సినిమాతో మంచి పేరు వచ్చింది. కనుక తాను ఇప్పుడు ఏం చేసినా అందరి మద్దతు తనకే ఉంటుందని ఆయన భావిస్తున్నాడా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. విశాల్ చతుర్వేది ఈ విషయమై ఎలా స్పందిస్తాడు అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వివాదాన్ని ముందుకు తీసుకు వెళ్లి, రామ్ బోలా సినిమాను విశాల్ ముందుకు తీసుకు వెళ్తాడా లేదంటే వివాదం వద్దు అనుకుని సినిమాను క్యాన్సల్ చేసుకుంటాడా అని అంతా ఆసక్తిగా ఆయన వైపు చూస్తున్నారు. ఈ విషయమై దర్శకుడు చంద్ర ప్రకాష్ ద్వివేదితో హనుమాన్ అంశ్ దర్శకుడు విశాల్ చతుర్వేది చర్చలు జరిపి రాజీ కుదుర్చుకుంటే బాగుంటుందని అంటున్నారు. గొప్ప రచయిత అయిన తులసీదాస్ గురించి విశాల్ చతుర్వేది వంటి దర్శకుడు సినిమా తీస్తే అది తప్పకుండా బాగుంటుందని కొందరు అంటున్నారు. అందుకే రామ్‌బోలా సినిమాను విశాల్ చతుర్వేది తీయాలనే అభిప్రాయంను ఎక్కువ శాతం మంది వ్యక్తం చేస్తున్నారు.
