టాప్ స్టోరి: సోషల్ మీడియా వక్రీకరణల నుంచి సెలబ్రిటీల ఆత్మరక్షణ ఎలా?
సోషల్ మీడియాలో వచ్చే వార్తల నిజానిజాలను నిర్ధారించడంలో డిజిటల్ మాధ్యమాలకే కాదు.. పాఠకులకు కూడా సమానమైన బాధ్యత ఉంది.
By: Sivaji Kontham | 12 April 2026 9:48 AM ISTనేటి డిజిటల్ యుగంలో సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను యథేచ్ఛగా షేర్ చేయడం `కత్తి మీద సాము`లా మారింది. గంటల తరబడి సాగే ఇంటర్వ్యూలలోని సారాంశాన్ని పక్కన పెట్టి... కేవలం వ్యూస్ కోసం వివాదాస్పదంగా అనిపించే పది సెకన్ల క్లిప్‌లను వైరల్ చేయడం ఒక ప్రమాదకరమైన ధోరణిగా మారింది. దీని నుండి రక్షణ పొందేందుకు సెలబ్రిటీలు ఇప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మాట్లాడేటప్పుడే తమ మాటలు ఏ సందర్భంలో చెబుతున్నారో స్పష్టంగా వివరించడం .. థర్డ్ పార్టీ వేదికల కంటే తమ సొంత యూట్యూబ్ లేదా సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా నేరుగా అభిమానులతో సంభాషించడం వంటి వ్యూహాలను అనుసరిస్తున్నారు. దీనివల్ల ఎడిటింగ్ నియంత్రణ వారి చేతుల్లోనే ఉండి.. వక్రీకరణలకు అవకాశం తగ్గుతుంది. ఏ సందర్భంలో ఆ వివాదాస్పద వ్యాఖ్య చేసారు! అన్నది పరిశీలించే అవకాశం చాలా ముఖ్యం.
అయితే ఈ వక్రీకరణల భయం సెలబ్రిటీలలో `సెల్ఫ్-సెన్సార్‌షిప్`కు అవకాశం కల్పిస్తోంది. తమ మాటలు ఎక్కడ వివాదాస్పదమై కెరీర్‌ను దెబ్బతీస్తాయోనన్న భయంతో చాలామంది సామాజిక అంశాలపై మాట్లాడటమే మానేస్తున్నారు. ఇది సమాజంలో జరగాల్సిన ఆరోగ్యకరమైన చర్చలను అడ్డుకోవడమే కాకుండా.. సెలబ్రిటీలు కేవలం యాంత్రికమైన.. సురక్షితమైన సమాధానాలకే పరిమితమయ్యేలా చేస్తోంది. విపరీతమైన ట్రోలింగ్ సంస్కృతి మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా సెలబ్రిటీల నిజాయితీ గల అభిప్రాయాలు.. వారి అసలైన వ్యక్తిత్వం ప్రజలకు చేరడం కష్టతరమవుతోంది.
ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఒక సమర్థవంతమైన డిజిటల్ పీఆర్ బృందం ఉండటం నేడు అత్యవసరమని కూడా విశ్లేషిస్తున్నారు. ఏదైనా వ్యాఖ్య తప్పుగా వైరల్ అయిన వెంటనే పూర్తి వీడియోను విడుదల చేసి డ్యామేజ్ కంట్రోల్ చేయడం.. షార్ట్ రీల్స్ కంటే లోతైన చర్చలు ఉండే పాడ్‌కాస్ట్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. సోషల్ మీడియా వక్రీకరణలు సాంకేతికతకు ఉన్న ఒక చీకటి కోణమే అయినా మౌనంగా ఉండటం కంటే నోరా ఫతేహి వంటి నటీమణులు చేసినట్లుగా ధైర్యంగా వచ్చి వివరణ ఇవ్వడం ద్వారానే ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోగలరు. నోరా తరహాలోనే చాలా మంది స్టార్లు ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. చివరికి ఒక ఆరోగ్యకరమైన సోషల్ మీడియా వాతావరణం ఏర్పడాలంటే అటు సెలబ్రిటీల స్పష్టత.. ఇటు వినియోగదారుల విజ్ఞత రెండూ అవసరమేనని గమనించాలి.
సోషల్ మీడియాలో వచ్చే వార్తల నిజానిజాలను నిర్ధారించడంలో డిజిటల్ మాధ్యమాలకే కాదు.. పాఠకులకు కూడా సమానమైన బాధ్యత ఉంది. టెక్ కంపెనీలు ఫ్యాక్ట్-చెక్ అల్గారిథమ్స్.. ఏఐ టూల్స్ తో ఫేక్ సమాచారాన్ని నియంత్రించగలిగినా ప్రతిరోజూ అప్‌లోడ్ అయ్యే కోట్ల కొద్దీ పోస్టులను వంద శాతం వడపోయడం అసాధ్యం. ఇక్కడే పాఠకుల విజ్ఞత కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం ఆకర్షణీయమైన హెడ్ లైన్స్ లేదా వైరల్ వీడియోలను చూసి గుడ్డిగా నమ్మకుండా.. ఆ సమాచారం మూలాన్ని పరిశీలించడం ప్రతి పౌరుడి బాధ్యత. కానీ యూత్ కి అంత ఓపిక ఉండకపోవడంతో వారంతా కామెంట్లతో ఇష్టానుసారం విరుచుకుపడుతున్నారు. అలా కాకుండా ఆ సమాచారం సరైనదా కాదా? అనేది నిర్ధారించుకునే పరిణతిని యువతరం ప్రదర్శించాల్సి ఉంటుంది.
అబద్ధాలే నిజాలుగా..
సమాచారాన్ని విశ్లేషించే శక్తి లేకపోవడం వల్ల అబద్ధాలు నిజాల కంటే వేగంగా వ్యాపిస్తాయి. పాఠకులు ఒక వార్తను ఇతరులకు షేర్ చేసే ముందు అది నిజమేనా అని ఒక క్షణం ఆలోచిస్తే.. తప్పుడు ప్రచారాల గొలుసును తెంచవచ్చు. టెక్ సంస్థలు సరైన సాంకేతిక వేదికను అందిస్తే.. అందులో ఏది మంచో ఏది చెడో నిర్ణయించే ఫిల్టర్ లాగా వినియోగదారులు వ్యవహరించాలి. అప్పుడే సోషల్ మీడియాలో ఆరోగ్యకరమైన, నమ్మదగిన సమాచార వ్యవస్థ ఏర్పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
