Begin typing your search above and press return to search.

త్రివిక్ర‌మ్ (X) సునీల్: బెస్ట్ ఫ్రెండ్స్ పంజాగుట్ట రూమ్ జ్ఞాప‌కాలు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ల కెరీర్లు వికసించిన వైనం మనకు తెలుసు.. కానీ ఆ వెలుగుల‌ వెనుక ఉన్న స్నేహ బంధాలు, కష్ట సమయాల జ్ఞాపకాలు ఎంతో అరుదుగా బయటకు వస్తుంటాయి.

By:  Sivaji Kontham   |   19 Oct 2026 8:08 PM IST
త్రివిక్ర‌మ్ (X) సునీల్: బెస్ట్ ఫ్రెండ్స్ పంజాగుట్ట రూమ్ జ్ఞాప‌కాలు
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ల కెరీర్లు వికసించిన వైనం మనకు తెలుసు.. కానీ ఆ వెలుగుల‌ వెనుక ఉన్న స్నేహ బంధాలు, కష్ట సమయాల జ్ఞాపకాలు ఎంతో అరుదుగా బయటకు వస్తుంటాయి. ప్రముఖ నటుడు జగపతి బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జీ తెలుగు టాక్ షో `జయమ్ము నిశ్చయమ్మురా - సీజన్ 2` సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను, వారి ప్రయాణంలో ఎదురైన అనుభవాలను ఆవిష్కరిస్తూ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదల కాగా.. అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హాస్య నటుడు సునీల్, అలాగే సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ సందడి చేశారు.





ఈ ఎపిసోడ్‌లో ప్రధానంగా ఆకట్టుకున్న అంశం త్రివిక్రమ్, సునీల్‌ల మధ్య ఉన్న దశాబ్దాల కాలం నాటి అనుబంధం. ఇండస్ట్రీలో అవకాశాల కోసం అడుగులు వేస్తున్న తొలినాళ్లలో.. వారు పంజాగుట్టలోని ఒక చిన్న ఫ్లాట్‌లో కలిసి గడిపిన రోజులను ఎంతో భావోద్వేగంతో, నవ్వులతో గుర్తుచేసుకున్నారు. ఆకలి రోజులు, నెరవేరాల్సిన ఆశయాలు, కలల ప్రయాణం మధ్య వారిద్దరూ పంచుకున్న ఆనాటి పంజాగుట్ట రూమ్ జ్ఞాపకాలు వారి ఆత్మీయ స్నేహానికి అద్దం పడుతున్నాయి.





ఈ క్రమంలోనే త్రివిక్రమ్ వివాహం గురించి జగపతి బాబు ప్రశ్నించినప్పుడు.. సునీల్ తనదైన శైలిలో స్పందిస్తూ అది `అరేంజ్ ప్ల‌స్ ల‌వ్ మ్యారేజ్` అని వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వుల పువ్వులు పూశాయి. ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ.. సరదాగా పంచ్‌లు విసురుకుంటూ సాగిన వీరి ముచ్చట్లు సాధారణ సెలబ్రిటీ ఇంటర్వ్యూలకు భిన్నంగా స్నేహితుల మధ్య సహజంగా సాగే సంభాషణల్లా ఆకట్టుకున్నాయి.





అనంతరం ఈ సంభాషణలోకి ఎస్.ఎస్. తమన్ రాకతో వాతావరణం మరింత ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్ సినిమాల్లో ఉండే మొదటి పాటకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి భారీ అంచనాలు ఉంటాయో.. వాటిని తట్టుకుని క్రేజీ ట్యూన్ అందించడం వెనుక ఎంత ఒత్తిడి ఉంటుందో తమన్ వెల్లడించారు. దర్శకుడి సృజనాత్మక ఆలోచనలకు తగ్గట్టుగా, అందరి నోళ్లలో నానే హిట్‌ సాంగ్‌ను అందించే క్రమంలో సంగీత దర్శకుడిగా తాను ఎదుర్కొనే సవాళ్లను తమన్ ఆత్మీయంగా పంచుకున్నారు.

మొత్తంగా పాత జ్ఞాపకాల మధురిమలు, సినీ పరిశ్రమలోని క్రియేష‌న్‌లో సవాళ్లు, స్వచ్ఛమైన హాస్యం మేళవించిన ఈ ప్రత్యేక ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది. తెలుగు సినీ సంస్కృతికి తగ్గట్టుగా ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ `జయమ్ము నిశ్చయమ్మురా - సీజన్ 2` ఎపిసోడ్ ఈ శుక్రవారం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా.. ఈ ఆదివారం రాత్రి 7:30 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం కానుంది.