Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్‌లో ఈ మార్పు ఏంటి.. ఈసారి ఆ పరిస్థితులకు నో!

వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆదర్శ కుటుంబం. ఈ సినిమా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   28 Oct 2026 7:07 PM IST
త్రివిక్రమ్‌లో ఈ మార్పు ఏంటి.. ఈసారి ఆ పరిస్థితులకు నో!
X

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన రాసే డైలాగ్స్, కథను చెప్పే విధానం, కుటుంబ భావోద్వేగాలను తెరపై చూపించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే త్రివిక్రమ్ సినిమాల విషయంలో అప్పుడప్పుడు కథల గురించి కొన్ని చర్చలు కూడా జరుగుతుంటాయి. ముఖ్యంగా ఆయన కొన్ని సినిమాలు పాత సినిమాల కథలను పోలి ఉన్నాయనే అభిప్రాయాలు గతంలో వినిపించాయి. ఇప్పుడు మాత్రం త్రివిక్రమ్ ఒక రచయితకు ఇచ్చిన క్రెడిట్ ఆసక్తికరంగా మారింది.

వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆదర్శ కుటుంబం. ఈ సినిమా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఈ సినిమా కథకు ప్రత్యేకమైన సలహాలు అందించిన రచయిత, దర్శకుడు కన్నన్ డీఎస్‌ను.. ఆయన ప్రత్యేకంగా అభినందించారు. దీంతో త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించి ఏం చేశారు..ఆయన పాత్ర ఎంతవరకు ఉంది..అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

గతంలో త్రివిక్రమ్ సినిమాల విషయంలో కొన్ని కాంట్రవర్సీలు జరిగాయి. ముఖ్యంగా ఆయన దర్శకత్వంలో వచ్చిన అ ఆ సినిమా కథ పాత సినిమా మీనాను పోలి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలా కథ తీసుకోవడం తప్పుకాక పోయిన రచయితకు ప్రదీప్ ఇవ్వటం చాలా ముఖ్యం అని అప్పట్లో కామెంట్లు పెట్టారు.

ఇప్పుడు ఆదర్శ కుటుంబం' సినిమా విషయంలో మాత్రం త్రివిక్రమ్ కన్నన్ డీఎస్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించడం ఆసక్తిని పెంచింది. ఒక కథకు మరో రచయిత అందించిన సహకారాన్ని గుర్తించి, వేదికపై ఆయనను ప్రశంసించడం మంచి పరిణామంగా చూడవచ్చు. మరోవైపు త్రివిక్రమ్ సినిమాలంటే ప్రేక్షకులు ఆయన మార్క్ డైలాగ్స్‌ను ప్రత్యేకంగా ఆశిస్తారు. అందుకే 'ఆదర్శ కుటుంబం'లో కూడా ఆయన శైలిలో ఉండే మాటలు ఉంటాయా.. అన్న ఆసక్తి నెలకొంది.

వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్, బ్రహ్మాజీ, సత్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 30న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.