'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్: పంచ్‌లు లేకుండా త్రివిక్రమ్ క్యూట్ స్పీచ్
తాను బయట జరిగే ఈవెంట్లలో ఎక్కువగా మాట్లాడకపోవడానికి గల ఆసక్తికరమైన కారణాన్ని త్రివిక్రమ్ ఈ సందర్భంగా వెల్లడించారు.
By: Sivaji Kontham | 23 Oct 2026 9:18 PM ISTటాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటేనే భారీ పంచ్ డైలాగులు, గంభీరమైన సాహిత్యం, ఆకట్టుకునే ఆవేశపూరిత ఉపన్యాసాలు గుర్తొస్తుంటాయి. అయితే తాజాగా జరిగిన `ఆదర్శ కుటుంబం` ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాత్రం ఆయన తన రెగ్యులర్ శైలికి భిన్నంగా ఎంతో ప్రశాంతంగా, డీసెంట్‌గా మాట్లాడుతులూ ఒక క్యూట్ స్పీచ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. భారీ డైలాగులు లేదా అలవాటైన పంచ్‌లు ఏవీ లేకుండానే, మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థుల హృదయాలను గెలుచుకునేలా ఎంతో హుందాగా ఆయన మాట్లాడిన తీరు ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తాను బయట జరిగే ఈవెంట్లలో ఎక్కువగా మాట్లాడకపోవడానికి గల ఆసక్తికరమైన కారణాన్ని త్రివిక్రమ్ ఈ సందర్భంగా వెల్లడించారు. తాను చెప్పాలనుకున్న ప్రతీ విషయాన్ని, భావాన్ని ఇప్పటికే తన సినిమాల్లో డైలాగ్స్ రూపంలో రాస్తూనే ఉంటానని సరదాగా చెప్పారు. అందువల్ల పదే పదే వేదికలపై సుదీర్ఘంగా మాట్లాడి ప్రేక్షకుల విలువైన సమయాన్ని వృథా చేయకూడదనే ఉద్దేశంతోనే తాను తక్కువగా మాట్లాడతానని వివరించడం ఆయన ముక్కుసూటితనానికి, వినయానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ వేడుకలో తనదైన శైలి సరదా సమయస్ఫూర్తిని కూడా త్రివిక్రమ్ ప్రదర్శించారు. వేదికపై ఉన్న ఈవెంట్ నిర్వాహకులు డా. ప్రీతి రెడ్డి (మల్లారెడ్డి కోడలు), భద్ర దంపతులకు వారి 17వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ నవ్వులు పూయించారు. వీలుంటే వారి ప్రతి పెళ్లి రోజుకూ తామే ఒక సినిమా తీసి విడుదల చేస్తామని, అలా వారి ప్రత్యేకమైన సాయంత్రంలో కొంత సమయాన్ని తాము దొంగిలించి గడుపుతామని వ్యాఖ్యానించడం అందరినీ అలరించింది. అంతేకాకుండా చదువుల ఒత్తిడిలో ఉండే సైన్స్, మ్యాథ్స్ విద్యార్థుల కష్టాన్ని తాను అర్థం చేసుకోగలనని, ఇలాంటి ఫంక్షన్లు వారికి మంచి ఆటవిడుపుగా నిలుస్తాయని ఆకాంక్షించారు.
ఇక సినిమా విషయానికి వస్తే, `ఆదర్శ కుటుంబం` ఏ జానర్ చిత్రమో స్పష్టం చేస్తూ ప్రేక్షక లోకంలో ఆసక్తిని పెంచారు. ఇది ఒక సాధారణ రొమాంటిక్ కామెడీ చిత్రం కాదని.. కథలో అనేక సరికొత్త కోణాలు ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని క్రైమ్ కామెడీ లేదా బ్లాక్ కామెడీ జోనర్‌లో తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. విక్టరీ వెంకటేశ్ కి, అలాగే తనకు కూడా ఈ తరహా జోనర్ ఒక కొత్త ప్రయత్నమని చెబుతూ, ఈ క్రైమ్ కామెడీ డ్రామా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు.
ఈ చిత్రానికి అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు త్రివిక్రమ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని ప్రశంసించారు. ప్రచార వేదికపై ఎక్కడా ఆడంబరం లేకుండా ఎంతో క్లాసిక్ అండ్ క్యూట్ స్పీచ్‌తో అలరించిన త్రివిక్రమ్ అక్టోబర్ 30న థియేటర్లలో కలుద్దామంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
