Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్‌ - తమన్‌... ఎవరు ఎవరికి హ్యాండ్‌ ఇచ్చారు?

ఈ సినిమా ఇటీవలే పట్టాలెక్కిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

By:  Ramesh Palla   |   16 Oct 2025 3:00 PM IST
త్రివిక్రమ్‌ - తమన్‌... ఎవరు ఎవరికి హ్యాండ్‌ ఇచ్చారు?
X

టాలీవుడ్‌లో చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న రెండు కాంబోలు ఎట్టకేలకు సెట్‌ అయ్యాయి. అందులో మొదటిది మహేష్‌ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో సినిమా అనే విషయం తెల్సిందే. బాహుబలికి ముందు నుంచే వీరి కాంబోలో మూవీ గురించి చర్చలు జరిగాయి. నిర్మాత నుంచి వీరిద్దరూ అడ్వాన్స్ తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మహేష్‌బాబు, రాజమౌళి కాంబో మూవీ షూటింగ్‌ ప్రారంభం కావడం మాత్రమే కాకుండా వచ్చే ఏడాదిలో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే రాజమౌళి నుంచి ఇప్పటి వరకు ఆ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఇక మరో లాంగ్‌ వెయిటింగ్‌ కాంబో మూవీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మూవీ. ఈ సినిమా ఇటీవలే పట్టాలెక్కిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో

త్రివిక్రమ్‌ కెరీర్‌ ఆరంభంలో వెంకటేష్ సినిమాలకు రచయితగా చేశారు. ఆ సమయంలోనే వీరిద్దరి కాంబోలో మూవీ అనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. త్రివిక్రమ్‌ మార్కెట్‌ అమాంతం పెరగడంతో పాటు, యంగ్‌ స్టార్‌ హీరోలు వరుసగా త్రివిక్రమ్‌తో సినిమాల కోసం క్యూ కట్టిన నేపథ్యంలో వెంకటేష్ తో మూవీ ఆలస్యం అయింది. ఎప్పుడు తీసినా వెంకటేష్‌ గారితో ఒక మంచి సినిమా చేస్తాను అంటూ త్రివిక్రమ్‌ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే వెంకటేష్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా, తన మార్క్‌ను మిస్ కాకుండా త్రివిక్రమ్‌ సినిమాను తీయడం మొదలు పెట్టాడు. అయితే ఈ సినిమాకు సంగీతాన్ని తమన్‌తో కాకుండా హర్షవర్ధన్‌ రామేశ్వర్‌తో చేయించడం చర్చనీయాంశం అవుతుంది. దేవిశ్రీ నుంచి తమన్‌కు మారిన త్రివిక్రమ్‌ ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్‌ను సైతం సైడ్‌ చేయడం వెనుక ఉద్దేశం ఏంటని అంతా ప్రశ్నిస్తున్నారు.

వెంకటేష్ మూవీకి హర్షవర్ధన్‌ మ్యూజిక్‌

వెంకటేష్‌తో త్రివిక్రమ్‌ రూపొందిస్తున్న సినిమా మ్యూజికల్‌గా ప్రాధాన్యత కలిగి ఉంటుందట. అయిదు లేదా ఆరు పాటలు ఉండటంతో పాటు, బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలోనూ కాస్త ఎక్కువ శ్రద్ద మ్యూజిక్‌ డైరెక్టర్ పెట్టాల్సిన అవసరం ఉంటుందట. అందుకే ఈ సినిమాకు తమన్‌ ను కాకుండా హర్షవర్ధన్‌ను ఎంపిక చేశాడని పుకార్లు వస్తున్నాయి. తమన్‌ చేతిలో లెక్కకు మించిన సినిమాలు ఎప్పుడూ ఉంటాయి. ఆయన ప్రతి సినిమాకు సమయం కేటాయిస్తాడు. కానీ ఆయన ఏ సినిమాకు ఎక్కువ సమయం కేటాయించడు అనే విమర్శలు ఉన్నాయి. అందుకే తమన్‌ చేతిలో కంటే ఈ సినిమాను హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ చేతిలో పెడితే బాగుంటుంది అనే అభిప్రాయానికి త్రివిక్రమ్‌ వచ్చాడని, అందుకే ఈ మార్పు అంటూ కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మొత్తానికి తమన్‌ చేతిలోకి వెంకటేష్ మూవీ రాకపోవడం చర్చనీయాంశం అయింది.

తమన్‌ బిజీ బిజీగా ఉండటం వల్లేనా..?

త్రివిక్రమ్‌కి తమన్‌తో మంచి బాండింగ్‌ క్రియేట్‌ అయింది. ఇద్దరి కాంబోకి మంచి విజయాలు దక్కిన విషయం తెల్సిందే. ముఖ్యంగా అల వైకుంఠపురంలో సినిమా ఏ స్థాయి మ్యూజికల్‌ హిట్‌గా నిలిచిందో తెలిసిందే. అలాంటి కాంబో ఇప్పుడు బ్రేక్‌ కావడం ఖచ్చితంగా అభిమానులకు కాస్త ఆవేదన కలిగించే విషయం అనడంలో సందేహం లేదు. ఇంతకు వెంకటేష్‌ సినిమాకి తమన్‌ దూరం కావడానికి స్వయంకృతమా లేదంటే కావాలని త్రివిక్రమ్‌ తప్పించాడా అనేది కాలమే సమాధానం చెప్పాలి. ఇద్దరిలో ఎవరు ఎవరికి హ్యాండ్‌ ఇచ్చినా ప్రేక్షకులు ఒక మంచి కాంబోను మిస్ అవుతున్నారు అనేది మాత్రం వాస్తవం. ఈ మిస్సింగ్‌ ఈ సినిమాకే పరిమితం కావాలని, భవిష్యత్తులో వీరిద్దరు మళ్లీ సినిమాలు చేయాలని, త్రివిక్రమ్‌ మాటలకు తమన్‌ మ్యూజిక్‌ జత కలవాలని అంతా కోరుకుంటున్నారు. మరి అది సాధ్యమేనా చూడాలి.