'గాడ్ ఆఫ్ వార్' మీద ఫ్యాన్ వార్స్
అయితే రాజమౌళి అన్నట్లు త్రివిక్రమ్ తన జోన్ దాటి.. మాస్‌లోకి ఎంటరైతే ఔట్ పుట్ వేరే స్థాయిలో ఉంటుందని ఆయన అభిమానుల నమ్మకం.
By: Garuda Media | 6 Jan 2026 7:00 PM ISTతన కంటే చిన్న స్థాయి దర్శకులు, తన తర్వాత వచ్చిన వాళ్లు కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీ స్థాయి సినిమాలు రూపొందించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఇప్పటిదాకా తెలుగు సినిమాలకే పరిమితం అయిపోయాడు. ఆయన ఎక్కువగా తీస్తూ వచ్చింది ఫ్యామిలీ మూవీస్.. పైగా తెలుగు నేటివిటీతో ముడిపడ్డ వినోదం మీదే అవి నడుస్తాయి కాబట్టి త్రివిక్రమ్ ప్రతిభ తెలుగు వారికే పరిమితం అయింది. ఆయన సినిమాలను వేరే భాషల్లో రీమక్ చేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు.
అయితే రాజమౌళి అన్నట్లు త్రివిక్రమ్ తన జోన్ దాటి.. మాస్‌లోకి ఎంటరైతే ఔట్ పుట్ వేరే స్థాయిలో ఉంటుందని ఆయన అభిమానుల నమ్మకం. అదే సమయంలో తెలుగు సాహిత్యం, చరిత్ర, పురాణాల మీద గొప్ప పట్టున్న త్రివిక్రమ్.. పాన్ ఇండియా స్థాయి ఈవెంట్ ఫిలిమ్స్ చేయాలన్నది కూడా అభిమానులకు ఎప్పట్నుంచో ఉన్న కోరిక. ఎట్టకేలకు ఆయన సుబ్రహ్మణ్యస్వామి మీద సినిమా తీయాలని సంకల్పించారు. ఆయన్ని ‘గాడ్ ఆఫ్ వార్’ అంటారన్న సంగతి తెలిసిందే. ఆ కథ మీద త్రివిక్రమ్ కొన్నేళ్ల నుంచి పని చేస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే ఈ సినిమాను త్రివిక్రమ్ ఎవరితో తీస్తారనే విషయంలో ఎంతకీ ఒక క్లారిటీ రావట్లేదు. ముందేమో అల్లు అర్జున్‌తో ఈ సినిమా ఉంటుందన్నారు. ‘పుష్ప-2’ తర్వాత బన్నీ చేసే సినిమా ఇదే అన్నారు. కానీ కట్ చేస్తే.. అట్లీ సినిమాను మొదలుపెట్టాడు బన్నీ. దీంతో ఈ ప్రాజెక్టు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లిందన్నారు. తారక్ చేతిలో మురుగుడి పుస్తకం చూసి తనే ఈ సినిమా చేయబోతున్నారని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఇటీవల మళ్లీ బన్నీనే ఈ సినిమా చేయాలనుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అది కూడా పక్కా అని చెప్పలేని పరిస్థితి. బన్నీ, తారక్ ఫ్యాన్సేమో.. సోషల్ మీడియాలో ఈ సినిమా మా హీరో చేస్తున్నాడంటే మా హీరో చేస్తున్నాడంటూ వాదనలకు దిగుతున్నారు. ఈ వాదనలు కాస్తా పెద్ద గొడవలుగా మారుతున్నాయి.
ఇటీవలి ఇంటర్వ్యూలో బన్నీ వాసు ఏమో ‘గాడ్ ఆఫ్ వార్’ బన్నీనే చేస్తాడన్నట్లు మాట్లాడాడు. మరోవైపు నాగవంశీ ఏమో తారక్‌తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందనే సంకేతాలు ఇచ్చాడు. కానీ వాళ్లు పూర్తి స్పష్టత మాత్రం ఇవ్వలేదు. వీళ్ల వ్యాఖ్యలు ఫ్యాన్ వార్స్‌ను ఇంకా పెంచేలా ఉన్నాయి. ఐతే ఈ ప్రాజెక్టు గురించి త్రివిక్రమ్ వైపు నుంచి వీలైనంత త్వరగా ఏదో ఒక క్లారిటీ ఇచ్చి ఈ ఫ్యాన్ వార్స్‌కు తెరదించాల్సిన అవసరం కనిపిస్తోంది.
