Begin typing your search above and press return to search.

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

కానీ దీన్ని త్రివిక్రమ్ కెరీర్‌లో పెద్ద సంక్షోభంగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఇంతకంటే క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడిన అనుభవం ఆయనకు ఉంది.

By:  M Prashanth   |   4 Nov 2026 1:45 PM IST
అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..
X

త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు 'ఆదర్శ కుటుంబం' ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇచ్చేలా కనిపించడం లేదు. వెంకటేష్‌తో చేసిన ఈ సినిమా విడుదల తర్వాత మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ వీకెండ్‌లో వసూళ్లు వచ్చినప్పటికీ ఆ తర్వాత డ్రాప్ కనిపించింది. అయితే కొందరు ఎలా ఉండే త్రివిక్రమ్.. ఎలా అయిపోయారు అనేలా. మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ దీన్ని త్రివిక్రమ్ కెరీర్‌లో పెద్ద సంక్షోభంగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఇంతకంటే క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడిన అనుభవం ఆయనకు ఉంది.

2018లో వచ్చిన 'అజ్ఞాతవాసి' త్రివిక్రమ్ కెరీర్‌లో భారీ పరాజయం. పవన్ కల్యాణ్‌తో అప్పటికే రెండు విజయాలు అందుకోవడంతో మూడో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. కానీ ఫలితం పూర్తిగా తలకిందులైంది. ఆ సమయంలో వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు త్రివిక్రమ్ గతంలో చెప్పారు. ఒకవైపు సినిమా పరాజయం, మరోవైపు కాపీ ఆరోపణలు వ్యక్తిగత సమస్యలతో ఆ దశ ఆయనకు చాలా కష్టంగా గడిచింది.

అక్కడి నుంచి త్రివిక్రమ్ తీసుకున్న నిర్ణయమే వేరు. ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత'లో తనకు అలవాటైన కామెడీని తగ్గించి సీరియస్ కథను ఎంచుకున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఆ ప్రయోగం మంచి విజయాన్ని అందించింది. తర్వాత అల్లు అర్జున్‌తో 'అల వైకుంఠపురములో' తీసి తన కెరీర్‌లోనే భారీ కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు.

ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం'తోనూ త్రివిక్రమ్ మరో ప్రయత్నం చేశారు. వెంకటేష్‌ సినిమాలకు గతంలో రచయితగా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ దర్శకుడిగా మాత్రం ఇదే తొలి సినిమా. పైగా ఈసారి రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాకుండా క్రైమ్, యాక్షన్ అంశాలను మిక్స్ చేశారు. కానీ ప్రమోషన్ నుంచే ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' తరహా వినోదాన్ని ఆశించిన ప్రేక్షకులకు భిన్నమైన సినిమా ఎదురైంది.

అయితే రెండు సినిమాల పరిస్థితులను ఒకేలా పోల్చడం కూడా కరెక్ట్ కాదు. 'అజ్ఞాతవాసి' భారీ బడ్జెట్‌తో వచ్చి భారీ నష్టాలను మిగిల్చింది. 'ఆదర్శ కుటుంబం' మాత్రం మొదటి వీకెండ్ లో చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది. పూర్తి థియేట్రికల్ రన్ ముగియకముందే దాన్ని అదే స్థాయి పరాజయంగా పరిగణించలేం. అంతేకాకుండా అప్పట్లో పవన్ కల్యాణ్ స్టార్‌డమ్‌పై ఉన్న అంచనాలకు, ఇప్పుడు వెంకటేష్‌తో ఉన్న కాంబినేషన్‌పై ఏర్పడిన అంచనాలకు మధ్య తేడా ఉంది.

ఇక త్రివిక్రమ్ తదుపరి సినిమా ఎన్టీఆర్‌తో ఖరారైన సంగతి తెలిసిందే. కుమారస్వామి కథకు సంబంధించిన హింట్‌ను దర్శకుడు స్వయంగా ఇచ్చారు. స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని కూడా వెల్లడించారు. ఇప్పటివరకు ఫ్యామిలీ, యాక్షన్ కథలతో మెప్పించిన త్రివిక్రమ్‌కు పౌరాణిక నేపథ్యంతో భారీ సినిమా చేయడం కొత్త సవాల్. ప్రస్తుతం ఎన్టీఆర్ 'డ్రాగన్'తో బిజీగా ఉండగా, ఆ సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లేలా సన్నాహాలు జరుగుతున్నాయి.