Begin typing your search above and press return to search.

త్రివిక్ర‌మ్.. మ‌రోసారి 'అ'దే సెంటిమెంట్

అదే టైటిల్ సెంటిమెంట్. గ‌త కొంత‌కాలంగా త్రివిక్ర‌మ్ తాను తీసే సినిమాలకు అ అక్ష‌రంతో మొద‌ల‌య్యే టైటిల్స్‌నే ఎక్కువ‌గా పెడుతూ వ‌స్తున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   10 Dec 2025 5:00 PM IST
త్రివిక్ర‌మ్.. మ‌రోసారి అదే సెంటిమెంట్
X

పైకి చెప్ప‌క‌పోయినా ఇండ‌స్ట్రీలో ఎన్నో సెంటిమెంట్స్ ను ఫాలో అవుతూ ఉంటారు. అందులో స్టార్ డైరెక్ట‌ర్ల నుంచి స్టార్ హీరోల వ‌ర‌కు అంద‌రూ ఉంటారు. వారిలో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కూడా ఒక‌రు. అత‌నికి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. అదే టైటిల్ సెంటిమెంట్. గ‌త కొంత‌కాలంగా త్రివిక్ర‌మ్ తాను తీసే సినిమాలకు అ అక్ష‌రంతో మొద‌ల‌య్యే టైటిల్స్‌నే ఎక్కువ‌గా పెడుతూ వ‌స్తున్నారు.

వెంకీ హీరోగా ఆద‌ర్శ కుటుంబం

అందులో భాగంగానే ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ నుంచి ఐదారు సినిమాలు రాగా ఇప్పుడు మ‌రోసారి ఆ సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు మాట‌ల మాంత్రికుడు. విక్ట‌రీ వెంక‌టేష్ తో మొద‌టిసారి త్రివిక్ర‌మ్ చేస్తున్న సినిమాకు కూడా ఆ సెంటిమెంట్ తోనే ఆద‌ర్శ కుటుంబం.. ఏకే47 అనే టైటిల్ ను పెట్టారు. టైటిల్ చూస్తుంటేనే ఎంతో తెలుగుద‌నం ఉట్టిప‌డుతుంది.

ఇప్ప‌టికే ప‌లుసార్లు సెంటిమెంట్ ను రిపీట్ చేసిన త్రివిక్ర‌మ్

దానికి ఏకే47 అనే ట్యాగ్ లైన్ ను పెట్ట‌డంతో ఏదో క్రైమ్ ట‌చ్ ఇస్తారేమో అని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే త్రివిక్ర‌మ్ ఇప్ప‌టికే అ అక్ష‌రంతో అత‌డు, అత్తారింటికి దారేది, అ..ఆ, అజ్ఞాత‌వాసి, అర‌వింద స‌మేత వీరరాఘ‌వ‌, అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలు చేశారు. వాటిలో ఒక్క అజ్ఞాత‌వాసి త‌ప్పించి మిగిలిన‌వన్నీ మంచి హిట్లుగా నిలిచిన సినిమాలే.

టైటిల్ తో అంచ‌నాల్ని పెంచేసిన త్రివిక్ర‌మ్

ఇప్పుడు మ‌రోసారి త్రివిక్ర‌మ్ ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతుండ‌టంతో ఈ సినిమా క‌చ్ఛితంగా హిట్ట‌వ‌డం ఖాయ‌మని అంద‌రూ భావిస్తున్నారు. గ‌తంలో త్రివిక్ర‌మ్ రైట‌ర్ గా ఉన్న‌ప్పుడు వెంక‌టేష్ తో క‌లిసి ప‌లు సినిమాలు చేయ‌గా అవ‌న్నీ మంచి హిట్లుగా నిలిచాయి. అలాంటి వారిద్ద‌రి కాంబినేష‌న్ లో త్రివిక్ర‌మ్ డైరెక్ట‌ర్ గా మొద‌టిసారి వెంకీతో చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై మొద‌టి నుంచి మంచి అంచ‌నాలున్నాయి. దానికి తోడు టైటిల్ కూడా బావుండ‌టంతో సినిమాపై అంచ‌నాలు ఇంకాస్త పెరిగే అవ‌కాశాలున్నాయి. కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా న‌టించ‌నుండ‌గా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందించ‌నున్నార‌ని స‌మాచారం. హారికా హాసినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో రూపొందుతున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.