గురూజీ @ 'అ' తో సాధించిందేంటి?
అప్పటికి గురూజీ డైరెక్టర్ కాలేదు. రైటర్ గా పనిచేస్తోన్న సమయం అది. ఆ సినిమా డైలాగులతో త్రివిక్రమ్ కి మంచి పేరొచ్చింది.
By: Srikanth Kontham | 12 Dec 2025 5:00 AM ISTస్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. `నువ్వే నువ్వే`తో డైరెక్టర్ గా పరిచయమైన గురూజీ కెరీర్ `గుంటూరు కారం` వరకూ దిగ్విజయంగా కొనసాగింది. దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. మాటల మాంత్రికుడిగా ఓ ఇమేజ్ ఆయనపై ఉంది. 23 ఏళ్ల కెరీర్ లో 12 చిత్రాలు తెరకెక్కించారు. అయితే `అ` అనే అక్షరం ఆయనకు ఓ సెంటిమెంట్ లా కలిసొచ్చింది. `అ` మొదటి అక్షరంతో మొదలైన టైటిల్స్ తో తెరకెక్కిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. రెండవ సినిమాగా `అతడు` తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
మహేష్ నుంచి బన్నీ వరకూ:
మహేష్ కి ఓ కొత్త ఇమేజ్ ని తెచ్చి పెట్టిన చిత్రమది. అటుపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా `అత్తారింటికి దారేది` తెరకెక్కించారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. మళ్లీ రెండు..మూడేళ్ల గ్యాప్ అనంతరం అదే పవన్ కళ్యాణ్ తో `అజ్ఞాతవాసి` చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయింది. `అత్తారింటికి దారేది` తర్వాత చేసిన చిత్రం కావడంతో బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్నారు. కానీ ఇద్దరి అంచనాలు తప్పాయి. అదే ఏడాది యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో `అరవింద సమేత వీరరాఘవ` తెరకెక్కించారు. ఈ సినిమా భారీ విజయం సాధించింది.
`అ` సెంటిమెంట్ తో మరోసారి:
ఎన్టీఆర్ మాస్ లోనే క్లాస్ ఇమేజ్ తెచ్చి పెట్టిన చిత్రమిది. రెండేళ్ల గ్యాప్ అనంతరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో `అలవైకుంఠపు రములో`అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. అలా `అ` అక్షరంతో గురూజీకి ఎంతో అనుబంధం ఏర్పడింది. మళ్లీ ఆరేళ్ల తర్వాత `అ` అక్షరం టైటిల్ తోనే మరో సినిమా మొదలు పెట్టారు. అదే `ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47`. ఇందులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్నాడు. గతంలో ఇద్దరి కాంబినేషన్ లో `మల్లీశ్వరి` రిలీజ్ అయింది.
పాన్ ఇండియా చిత్రం కూడా:
అప్పటికి గురూజీ డైరెక్టర్ కాలేదు. రైటర్ గా పనిచేస్తోన్న సమయం అది. ఆ సినిమా డైలాగులతో త్రివిక్రమ్ కి మంచి పేరొచ్చింది. ఇప్పుడు అదే హీరోని గురూజీ డైరెక్ట్ చేయడం విశేషం. ఈసారి కూడా `అ`సెంటిమెంట్ గట్టిగానే కలిసొస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా అనంతరం `అ` అక్షరం సెంటిమెంట్ తోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ మొదలు పెడతారని ఆశీద్దాం.
