మళ్లీ వార్తల్లో త్రిష... ఈసారి స్పెషల్!
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమిళనాడుకు త్రిష కాబోయే అమ్మ అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
By: Ramesh Palla | 12 May 2026 1:42 PM ISTతమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ స్టార్ విజయ్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఊహించని రేంజ్‌లో సీట్లను దక్కించుకోవడంతో ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇటీవలే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి హీరోయిన్ త్రిష వార్తల్లో నిలుస్తున్నారు. విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వబోతున్నాడనే వార్తలు వచ్చిన వెంటనే త్రిష పేరు మరింత ప్రచారం జరిగింది. విజయ్, త్రిష వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు జోరుగా వినిపించాయి. ఏకంగా త్రిష, విజయ్ ప్రస్తుతం సహజీవనం సాగిస్తున్నారనే వార్తలు వచ్చాయి. రాజకీయంగా విజయ్‌ను దెబ్బ తీసేందుకు త్రిష పేరును సైతం కొందరు రాజకీయ నాయకులు తీసుకు వచ్చారు. దాంతో త్రిష పేరు గత కొన్ని నెలలుగా ప్రముఖంగా చర్చనీయాంశం అవుతుంది.
సీఎం విజయ్ ప్రేయసి త్రిష...
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమిళనాడుకు త్రిష కాబోయే అమ్మ అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ రెండు చోట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన విషయం తెల్సిందే. ఒక చోట విజయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నాడు. ఆ స్థానంలో త్రిష పోటీ చేస్తుందనే వార్తలు వచ్చాయి. అంతే కాకుండా త్రిష ను తన మంత్రి వర్గంలోకి తీసుకుని, ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు ఇస్తాడనే వార్తలు కూడా వచ్చాయి. దాంతో త్రిష సినిమాలకు గుడ్ బై చెబుతుందా అనే చర్చ జరిగింది. కానీ త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పబోవడం లేదని తేలిపోయింది. ఇన్నాళ్లు రాజకీయ వార్తలతో త్రిష వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఒక సినిమాకు సంబంధించిన వార్తతో త్రిష వార్తల్లో నిలవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ మూవీ...
1979 తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ లు కలిసి నటించబోతున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తున్న నేపథ్యంలో ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా కోసం త్రిష ను దర్శకుడు నెల్సన్ సంప్రదించాడనే వార్తలు వస్తున్నాయి. త్రిష సైతం కథను విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తమిళ సినీ వర్గాల వారు అంటున్నారు. త్రిష ఈ సినిమాలో హీరోయిన్‌గా కాకుండా కథ లో అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇద్దరు హీరోలకు త్రిష జోడీగా కనిపించబోవడం లేదని, కానీ సినిమాలో ఆమె పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుందని మాత్రం అంటున్నారు. ఈ మధ్య కాలంలో త్రిష చేయని పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తమిళనాట ఈ వార్తలు ప్రస్తుతం జోరుగా వినిపిస్తున్నాయి.
నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో...
రజనీకాంత్, కమల్ హాసన్‌ల మూవీని మొదట లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్లాన్ చేశారు. కానీ లోకేష్ కనగరాజ్ వరుస సినిమాలతో నిరాశ పరిచిన నేపథ్యంలో ఆయనను దర్శకత్వ బాధ్యతల నుంచి తొలగించారని తెలుస్తోంది. ఆ తర్వాత మరో ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపించాయి. చివరకు రజనీకాంత్ తో జైలర్ సినిమాను తీసి సూపర్ హిట్ కొట్టి, ఇప్పుడు జైలర్ 2 ను చేస్తున్న దర్శకుడు నెల్సన్ దిలీప్ కు ఈ భారీ మల్టీస్టారర్ సినిమా నిర్మాణ బాధ్యతను అప్పగించారని తెలుస్తోంది. ఈ సినిమాకు కమల్ హాసన్ ఒక నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి మంచి స్పందన వచ్చింది. వచ్చే ఏడాది ఈ బిగ్గెస్ట్ భారీ మల్టీ స్టారర్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. షూటింగ్ ప్రారంభం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో త్రిష స్పెషల్ రోల్ అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగాయి.
