త్రిష హైస్పీడ్: చిరంజీవి, రజనీ, కమల్ తర్వాత ఇంకో ఐదుగురితో
అందుకే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎందరో కొత్త హీరోయిన్లు వస్తున్నా..అగ్ర దర్శకులు.. హీరోలందరూ 'సౌత్ క్వీన్' త్రిష వైపే మొగ్గు చూపుతున్నారు.
By: Sivaji Kontham | 11 May 2026 4:08 PM ISTదక్షిణ భారత సినీ చరిత్రలో ఒక నటి రెండు దశాబ్దాల పాటు అగ్రస్థానంలో కొనసాగడం అనేది అత్యంత అరుదైన విషయం. సాధారణంగా కథానాయికల కెరీర్ స్పాన్ హీరోలతో పోలిస్తే తక్కువగా ఉంటుందనే అపోహను త్రిష తన సెకండ్ ఇన్నింగ్స్‌తో పూర్తిగా చెరిపివేశారు. 96, పొన్నియిన్ సెల్వన్ వంటి చిత్రాలు ఈ భామ కెరీర్‌కు బలమైన పునాది వేయగా.. ప్రస్తుతం కేవలం పాటలకే పరిమితం కాకుండా కథను నడిపించే పవర్‌ఫుల్ పాత్రలతో త్రిష ఆకట్టుకుంటున్నారు. అందుకే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎందరో కొత్త హీరోయిన్లు వస్తున్నా..అగ్ర దర్శకులు.. హీరోలందరూ `సౌత్ క్వీన్` త్రిష వైపే మొగ్గు చూపుతున్నారు.
త్రిష ఖాతాలో ఉన్న టాప్ ప్రాజెక్టులలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్న `విశ్వంభర` అత్యంత కీలకమైనది. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ పునరావృతం అవుతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సోషియో-ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్రిష క్రేజ్‌ను టాలీవుడ్‌లో మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. సీనియర్ హీరోల సరసన ఈ అమ్మడు `ఏజ్‌లెస్` బ్యూటీగా అలరిస్తోంది. 40 ప్లస్ త్రిష స్క్రీన్ ప్రెజెన్స్ నేటికీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.
దక్షిణాది సినిమా దిగ్గజాలైన కమల్ హాసన్, రజనీకాంత్ చిత్రాలలోనూ త్రిష తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన `థగ్ లైఫ్`లో త్రిష కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ - కమల్ హాసన్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌లోనూ త్రిష పేరు ఖరారైనట్లు సమాచారం. ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య తనదైన నటనతో మెప్పించే అవకాశం రావడం త్రిష లైఫ్ లో అరుదైన ఘనత.
అజిత్ కుమార్ -మోహన్ లాల్ వంటి ఇతర అగ్ర హీరోల సరసన కూడా త్రిష జోరు కొనసాగిస్తోంది. ఇటు టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్లు సహా అటు మోహన్ లాల్ వంటి స్టార్లకు ఒక ప్రధాన ఆప్షన్ గా త్రిష కనిపిస్తోంది. నటనలో పరిణతితో పాటు గ్లామర్‌ను కాపాడుకోవడంలో త్రిష చూపిస్తున్న పట్టుదల అమోఘం.
ఇక రాజకీయాల్లో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి దళపతి విజయ్ ఒకవేళ `దళపతి 70` ప్రాజెక్ట్ చేపడితే అందులోనూ త్రిష హీరోయిన్‌గా నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన `లియో`' బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ జోడీకి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే త్రిష కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే విజయ్ సరసన నటించే అవకాశాలు తగ్గుతాయని కొందరు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా... ఒక దశాబ్దాన్ని మించి అగ్ర హీరోలందరినీ తన ఖాతాలో వేసుకున్న త్రిష ప్రయాణం నేటి తరం నటీమణులకు ఒక గొప్ప స్ఫూర్తి.
