Begin typing your search above and press return to search.

త్రోబ్యాక్ : బిజినెస్‌మేన్‌తో త్రిష పెళ్లి క్యాన్సిల్ వెన‌క కార‌ణం?

దక్షిణాది చిత్ర పరిశ్రమలో దశాబ్ద కాలానికి పైగా అగ్ర కథానాయికగా రాణిస్తున్న త్రిష కృష్ణన్ వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

By:  Sivaji Kontham   |   7 May 2026 10:00 PM IST
త్రోబ్యాక్ : బిజినెస్‌మేన్‌తో త్రిష పెళ్లి క్యాన్సిల్ వెన‌క కార‌ణం?
X

దక్షిణాది చిత్ర పరిశ్రమలో దశాబ్ద కాలానికి పైగా అగ్ర కథానాయికగా రాణిస్తున్న త్రిష కృష్ణన్ వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా 2015లో చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌తో నిశ్చితార్థం జరిగిన కొద్ది నెలలకే పెళ్లి రద్దు కావడం అప్పట్లో ఒక సంచలనం. ఇటీవల నటుడు విజయ్‌తో త్రిషకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు మళ్ళీ త‌న‌ పాత సంబంధాల గురించి.. నాడు నిశ్చితార్థం ఎందుకు విఫలమైందనే విషయాల గురించి ఆసక్తిగా చర్చిస్తున్నారు. త్రిష త్రోబ్యాక్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన విష‌యాల‌ను కూడా వైర‌ల్ చేస్తున్నారు. టీవీకే అధినేత ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టనున్న వేళ త్రిష గురించిన ప్ర‌తి వార్తా ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఇది కూడా అందులో ఒక భాగం.

అప్ప‌ట్లో అక‌స్మాత్తుగా వ‌రుణ్ మ‌ణియ‌న్ తో త్రిష తన వివాహాన్ని రద్దు చేసుకోవడానికి ప్రధాన కారణం .. న‌ట‌నా రంగాన్ని వీడ‌లేక‌నే. వృత్తి పట్ల ఉన్న మక్కువ ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని త్రిష అప్ప‌ట్లోనే వెల్ల‌డించారు. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పి ఇంటికే పరిమితం కావాలని వరుణ్ కోరడం త‌న‌కు ఏమాత్రం నచ్చలేదు. నటన అనేది కేవలం తన వృత్తి మాత్రమే కాదు.. అది తన జీవితంలో ఒక భాగమని నమ్మే త్రిష సినిమాల కోసం తన నిశ్చితార్థానికే `ఫుల్ స్టాప్` పెట్టాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రేమ కోసం తన ఆత్మగౌరవాన్ని.. ఇష్టమైన కెరీర్‌ను వదులుకోవడానికి త‌ను సిద్ధంగా లేరని ఈ నిర్ణయంతో స్పష్టమైంది.

నటన పై త్రిషకున్న నిబద్ధత సామాన్యమైనది కాదు. తన చివరి శ్వాస వరకు చిత్ర పరిశ్రమలోనే కొనసాగుతానని, కేవలం గర్భం దాల్చిన సమయంలో తప్ప మరెప్పుడూ విరామం తీసుకోనని త్రిష చాలా ధైర్యంగా ప్రకటించారు. ఒకవేళ భవిష్యత్తులో కథానాయిక పాత్రలు రాకపోయినా.. తన ఇమేజ్‌కు తగిన ఇతర పాత్రలు చేస్తూనే ఉంటానని.. కానీ సినిమా రంగాన్ని మాత్రం వీడనని గతంలోనే క్లారిటీ ఇచ్చారు. ఈ స్థాయి స్పష్టత ..వృత్తి పై ఉన్న ప్రేమే త్రిష‌ను నేటికీ అగ్రస్థానంలో నిలబెట్టింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కేవలం త్రిష వ్యక్తిగత విషయం మాత్రమే కాదు.. అది `ప్రేమ వర్సెస్ కెరీర్` అనే పెద్ద చర్చకు దారితీసింది. ఎదుటి వ్యక్తి కోసం మన కలలను కుంచించుకోవాల్సిన అవసరం లేదని త్రిష నిర్ణయం నేటి తరం మహిళలకు ఒక గొప్ప పాఠంగా నిలిచింది. పెళ్లి రద్దు చేసుకున్న ఏళ్ల తర్వాత కూడా త్రిష ఇప్పటికీ అగ్ర నటిగా రాణిస్తుండటం చూస్తుంటే త‌ను తీసుకున్న నిర్ణయం సరైనదే అని నిరూపిస్తోంది. విజయ్‌తో ఉన్న అనుబంధంపై వస్తున్న పుకార్ల గురించి మౌనంగా ఉన్నా.. తన గుర్తింపును కాపాడుకోవడంలో చూపిన ధైర్యం నెటిజ‌నుల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది.

పెళ్లి క్యాన్సిల‌య్యాక అగ్ర నటిగా విజ‌యాలు:

వరుణ్ మనియన్‌తో నిశ్చితార్థం రద్దయిన తర్వాత త్రిష తన కెరీర్‌పై మరింత పట్టుదలతో దృష్టి సారించి వెండితెరపై అద్భుతమైన విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా 2018లో వచ్చిన 96 చిత్రం ఆమె కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. అందులో జానూ పాత్రతో మ్యాజిక్ క్రియేట్ చేసి విమర్శకుల ప్రశంసలతో పాటు ప‌లు అవార్డులను అందుకున్నారు. ఆ తర్వాత మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్ (1 & 2)` లో కుందవై పాత్రలో రాజసం ఒలికించి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందారు. విజయ్‌తో కలిసి నటించిన `లియో` కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడంతో పెళ్లి రద్దు నిర్ణయం తర్వాత త‌న‌ కెరీర్ గ్రాఫ్ ఎక్క‌డా త‌గ్గ‌లేద‌ని ప్రూవైంది.

ప్రస్తుతం త్రిష తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత చిరంజీవి-త్రిష కాంబినేషన్ రిపీటవుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో త్రిష పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతోందని సమాచారం. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచగా త్రిష తన అద్భుత నటనతో మరోసారి తెలుగు ప్రేక్షకుల మనసు గెలవడానికి సిద్ధమవుతున్నారు.