ఫోటో దిగితే పెళ్లి చేసేస్తారా? పెళ్లి రూమర్లపై త్రిష అసహనం
త్రిష ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడంతో ఎప్పటికప్పుడు ఆమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలొస్తూనే ఉంటుండగా, ఈ మధ్య ఆ వార్తలు మరీ ఎక్కువయ్యాయి.
By: Sravani Lakshmi Srungarapu | 17 Nov 2025 1:13 PM ISTహీరోయిన్ త్రిష కృష్ణన్ కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. దాదాపు 20 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న త్రిష ఇప్పటికీ యంగ్ హీరోయిన్లతో సమానంగా పోటీ పడి, విభిన్న పాత్రలతో ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న త్రిష నాలుగు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.
త్రిష పెళ్లిపై కొన్నాళ్లుగా రూమర్లు
త్రిష ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడంతో ఎప్పటికప్పుడు ఆమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలొస్తూనే ఉంటుండగా, ఈ మధ్య ఆ వార్తలు మరీ ఎక్కువయ్యాయి. త్రిష ఓ స్టార్ హీరోతో ప్రేమలో ఉందని, త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతుందని అంతేకాకుండా త్రిష రాజకీయాల్లోకి కూడా వస్తుందని వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై త్రిష రియాక్ట్ అయ్యారు.
ఇలాంటివి చూస్తుంటే అసహ్యంగా ఉంది
తన పెళ్లి, రాజకీయ అరంగేట్రం గురించి వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని త్రిష క్లారిటీ ఇచ్చారు. ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలను వేరేలా భావించి, దానికి అవాస్తవ కథనాలను జోడించి ప్రచారం చేస్తున్నారని, నేను ఎవరితో ఫోటో దిగితే వారితో పెళ్లి జరిగినట్టేనా? ఇంకా ఎంతమందితో నా పెళ్లి చేస్తారంటూ అసహనం వ్యక్తం చేసిన త్రిష, ఇలాంటి వార్తలు చూసి తనకు అసహ్యమేస్తుందని, ఆధారాలు లేని వార్తల ప్రచారాన్ని వెంటనే ఆపాలని త్రిష హెచ్చరించారు.
పెళ్లి వార్తలపై స్వయంగా త్రిష క్లారిటీ ఇవ్వడంతో ఇప్పటికైనా ఈ రూమర్లు ఆగుతాయేమో చూడాలి. ఇక అమ్మడి కెరీర్ విషయానికొస్తే త్రిష చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. సుమారు రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
