అంతర్జాతీయ బ్రాండ్ నిర్లక్ష్యం పై త్రిష అసంతృప్తి!
ఈ బ్రాండ్‌కు సంబంధించి తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని త్రిష బహిరంగంగా పంచుకోవడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
By: Srikanth Kontham | 4 July 2026 4:51 PM ISTప్రముఖ అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్ జారా పై స్టార్ హీరోయిన్ త్రిష తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్వాలిటీ -లగ్జరీకి కేరాఫ్ అడ్రస్‌గా భావించే ఇలాంటి పెద్ద సంస్థలు, వినియోగదారులకు అందించే సేవలలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం పట్ల సామాజిక మాధ్యమాల వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ బ్రాండ్‌కు సంబంధించి తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని త్రిష బహిరంగంగా పంచుకోవడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
త్రిష సోషల్ మీడియా ఖాతా ద్వారా జారా బ్రాండ్‌ను నేరుగా ట్యాగ్ చేసి ఆ సంస్థ దుస్తుల నాణ్యతపై తీవ్ర విమర్శలు చేశారు. తాను ఇటీవల ఆ బ్రాండ్ నుండి కొనుగోలు చేసిన కొత్త దుస్తులు దారుణమైన శారీరక దుర్వాసనతో ఉన్నాయని ఆరోపించారు. అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే? ఇలా జరగడం ఇది మొదటిసారి కాదని వరుసగా మూడోసారి కూడా తనకు అదే విధమైన అనుభవం ఎదురైందని త్రిష పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ అసలు దుస్తుల ప్యాకింగ్ -నాణ్యత పరిశీలన ఎలా చేస్తోందంటూ త్రిష ప్రశ్నించారు. కస్టమర్లు భారీగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేసే దుస్తుల విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు.
ఎవరో వాడేసి, చెమట వాసన వస్తున్న దుస్తులను .. సరిగ్గా మెయింటైన్ చేయని స్టాక్‌ను మళ్లీ ప్యాక్ చేసి కస్టమర్లకు పంపుతున్నారా? అనే అనుమానాన్ని కలిగించేలా పరిస్థితి ఉందని త్రిష మండిపడ్డారు. దీంతో ఈ వ్యవహారం నెట్టింట సంచలనంగా మారింది. నెటిజన్లు, ఫ్యాషన్ ప్రియులు త్రిష పోస్ట్‌కు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. తాము కూడా గతంలో జారా అవుట్‌లెట్లలో ఆర్డర్లలో ఇలాంటి నాణ్యతా లోపాలను గమనించామని వినియో గదారులు కామెంట్ల రూపంలో తమ అనుభవాలను పంచుకుని త్రిషకు మద్దతుగా నిలుస్తున్నారు.
సాధారణంగా పెద్ద సెలబ్రిటీలు బ్రాండ్లతో ఉండే వ్యాపార ఒప్పందాల వల్లనో లేదా వివాదాలెందుకని భావించో ఇలాంటి విషయాలపై బహిరంగంగా మాట్లాడటానికి వెనుకాడుతుంటారు. కానీ త్రిష ఏమాత్రం వెనకడుగు వేయ కుండా సాధారణ వినియోగదారురాలిగా తనకు జరిగిన అన్యాయాన్ని ..అసౌకర్యాన్ని ప్రశ్నించడం విశేషం. సెలబ్రిటీలు ఇలాంటి లొసుగులను ఎత్తి చూపినప్పుడైనా? అంతర్జాతీయ సంస్థలు తమ సేవలలో మార్పులు చేసుకోవాలని, కస్టమర్ల నమ్మకాన్ని కాపాడుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. త్రిష చేసిన ఈ పోస్ట్‌తో జారా బ్రాండ్ కస్టమర్ సర్వీస్ విభాగం ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
