Begin typing your search above and press return to search.

CM ఫ్రెండ్ త్రిష‌కు ప్ర‌త్య‌ర్థి నాయ‌కుడు 12కోట్ల ఆఫ‌ర్..నిజ‌మెంత‌?

ఈ ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళితే.. ఉదయనిధి స్టాలిన్ రాజకీయాల్లో బిజీగా మారిన తర్వాత నటనకు స్వస్తి చెప్పినా.. మంచి కంటెంట్‌తో కూడిన భారీ చిత్రాలను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు.

By:  Sivaji Kontham   |   16 May 2026 1:26 PM IST
CM ఫ్రెండ్ త్రిష‌కు ప్ర‌త్య‌ర్థి నాయ‌కుడు 12కోట్ల ఆఫ‌ర్..నిజ‌మెంత‌?
X

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా దూసుకుపోతున్న త్రిష కృష్ణన్ ప్రస్తుతం ఒక భారీ సంచలనానికి కేంద్రబిందువుగా మారింది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, దళపతి జోసెఫ్ విజయ్‌కు అత్యంత ఆప్తురాలిగా పేరున్న త్రిషకు, ఆయన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి, డీఎంకే నేత- ప్రముఖ నిర్మాత ఉదయనిధి స్టాలిన్ ఏకంగా రూ. 12 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చారనే వార్త కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ దావానలంలా వ్యాపించింది. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. ఈ రూ. 12 కోట్ల డీల్ ఇటు సినిమా పరంగా.. అటు రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది.

మీడియా కథనాల ప్రకారం.. ఉదయనిధి స్టాలిన్ తన సొంత నిర్మాణ సంస్థ `రెడ్ జైంట్ మూవీస్` బ్యానర్‌పై నిర్మించబోయే ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ కోసం త్రిషను సంప్రదించారు. సాధారణంగా త్రిష తీసుకునే పారితోషికం కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం తమిళ రాజకీయాలలో విజయ్ - ఉదయనిధి స్టాలిన్ మధ్య తీవ్రమైన రాజకీయ వైరం నడుస్తోంది. దీనికి తోడు విజయ్, త్రిషల మధ్య గత కొంతకాలంగా డేటింగ్ పుకార్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సీఎం విజయ్ పక్కన ఉండే నాయికకు ప్రతిపక్ష నేత ఇంతటి భారీ ఆఫర్ ఇవ్వడం వెనుక కేవలం సినిమా మాత్రమే కాకుండా బలమైన రాజకీయ వ్యూహం కూడా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళితే.. ఉదయనిధి స్టాలిన్ రాజకీయాల్లో బిజీగా మారిన తర్వాత నటనకు స్వస్తి చెప్పినా.. మంచి కంటెంట్‌తో కూడిన భారీ చిత్రాలను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ ఉన్న త్రిష అయితేనే ఈ కథకు పూర్తి న్యాయం జరుగుతుందని భావించి త‌న‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్‌ను త్రిష నిర్మొహమాటంగా తిరస్కరించినట్లు చిత్ర పరిశ్రమలో గట్టిగా ప్రచారం సాగుతోంది. ఈ భారీ ప్రాజెక్టును ఒప్పుకుంటే అది పొలిటికల్ సర్కిల్స్‌లో తప్పుడు సంకేతాలు పంపుతుందని, ముఖ్యంగా సీఎం విజయ్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సాధారణంగా సినిమా ఆఫర్ల వెనుక పారితోషికాలు, డేట్లు మాత్రమే లెక్క చూసుకుంటారు. కానీ తమిళనాడులో సినిమా, రాజకీయం ఎప్పుడూ పెనవేసుకుని ఉంటాయి. గతంలో ఉదయనిధి స్టాలిన్ నిర్మాణంలో విజయ్- త్రిష కలిసి `కురువి` వంటి హిట్ సినిమాలో నటించినా.. ప్రస్తుత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక డీఎంకే వర్సెస్ టీవీకే మధ్య యుద్ధం ముదిరింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో త్రిష ఆఫర్‌ను తిరస్కరించడం ద్వారా తాను ఎటువైపు ఉన్నాననే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేసిందని త‌న‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనా.. ఈ రూ. 12 కోట్ల ఆఫర్ .. దాని తిరస్కరణకు సంబంధించి అటు త్రిష వైపు నుండి కానీ.. ఇటు ఉదయనిధి స్టాలిన్ టీమ్ నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ సోషల్ మీడియాలో .. ప్రాంతీయ వార్తా ఛానళ్లలో మాత్రం ఈ `పొలిటికల్ కమ్ సినిమాటిక్` డ్రామాపై చర్చ తారాస్థాయికి చేరింది. కేవలం ఒక సినిమా ఆఫర్ చుట్టూ ఇంతటి పొలిటికల్ వైబ్స్ క్రియేట్ అవ్వడం ఒక్క కోలీవుడ్‌కే సాధ్యమని విమర్శకులు విశ్లేషిస్తున్నారు. ఈ పుకార్లపై మునుముందు రోజుల్లో త్రిష ఎలా స్పందిస్తుందో చూడాలి.