మరోసారి త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు
వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్ తో పోలీసులు త్రిష ఇంటికి చేరుకుని, ఇంటి పరిసరాలు మొత్తాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించారు.
By: Sravani Lakshmi Srungarapu | 10 Nov 2025 7:39 PM ISTతమిళనాడు రాజధాని చెన్నైలో ప్రముఖులను, సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకుని వారిని ఆగంతకులు బెదిరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య చెన్నైలో ఈ బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. అయితే ఇప్పుడు ఓ సెలబ్రిటీకి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. ఆమె మరెవరో కాదు, ప్రముఖ హీరోయిన్ త్రిష కృష్ణన్. తాజాగా త్రిష ఇంటికి బాంబు బెదిరింపు రావడం అందరినీ ఆందోళనకు గురి చేసింది.
త్రిష ఇంటికి బాంబు బెదిరింపు..
చెన్నైలోని ఆల్వార్‌పేట్ లో ఉన్న త్రిష ఇట్లో ఓ పరికరం అమర్చబడిందని ఓ గుర్తు తెలియని వ్యక్తి డీజీపీ ఆఫీస్ కు ఈ మెయిల్ ద్వారా సమాచారాన్ని పంపాడు. బాంబు బెదిరింపు అనగానే ఎవరికైనా భయం సహజం. ఈ నేపథ్యంలోనే త్రిష ఫ్యాన్స్ మరియు ఇరుగుపొరుగు వారితో పాటూ స్థానిక మీడియా కూడా ఈ విషయంలో కాస్త ఆందోళన చెందింది. అయితే ఈ మెయిల్ తో రాగానే పోలీసులు అప్రమత్తమయ్యారు.
సోదాలు చేసి ఏమీ లేదని తేల్చిన పోలీసులు
వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్ తో పోలీసులు త్రిష ఇంటికి చేరుకుని, ఇంటి పరిసరాలు మొత్తాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని గంటల పాటూ సోదాలు జరిపిన తర్వాత అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ దొరక్కపోవడంతో ఇది ఆకతాయిల పనేనని పోలీసులు నిర్థారించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
త్రిషకు ఇదేమీ కొత్తకాదు
అయితే త్రిషకు ఇలాంటి బెదిరింపులు రావడం మొదటి సారేమీ కాదు. గతంలో కూడా ఆమెకు బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు రావడం నాలుగోసారి. అయితే తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేసి, ఆ మెయిన్ పంపిన ఆగంతుకుడిని గుర్తించేందుకు ప్రయత్నించడంతో పాటూ.. ఫోన్ ట్రయల్స్, సీసీ టీవీ ఫుటేజ్, ఈమెయిల్స్ పై దర్యాప్తు చేస్తున్నారు. ఒకే నటికి నాలుగు సార్లు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు త్రిష భద్రతను ఇప్పుడు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు.
