Begin typing your search above and press return to search.

ఇదంతా అత‌డి న‌మ్మ‌కం వ‌ల్లే: ట్రిప్తి దిమ్రీ

యానిమ‌ల్ విడుద‌ల‌య్యాక అనూహ్యంగా ట్రిప్తి `నేష‌న‌ల్ క్ర‌ష్` అనే టైటిల్ ని కూడా సొంతం చేసుకుంది. సందీప్ వంగా ఆ రోజు త‌న‌ను న‌మ్మి జోయా అనే పాత్ర‌ను ఆఫ‌ర్ చేయ‌క‌పోతే ఏం జ‌రిగేదో ట్రిప్తి ఊహించుకుంటోంది.

By:  Sivaji Kontham   |   28 Sept 2025 8:00 PM IST
ఇదంతా అత‌డి న‌మ్మ‌కం వ‌ల్లే: ట్రిప్తి దిమ్రీ
X

త‌న కెరీర్‌ గేమ్ ఛేంజింగ్ హిట్‌ని అందించిన ద‌ర్శ‌కుడిని ఏ న‌టీమ‌ణి అయినా మ‌ర్చిపోగ‌ల‌రా? ఇప్పుడు ట్రిప్తి దిమ్రీ కూడా అందుకు మిన‌హాయింపు కాదు. ఈ బ్యూటీ న‌టి అయ్యాక‌, వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తోంది. కానీ ఆశించిన గుర్తింపు ద‌క్క‌లేదు. లైలా మ‌జ్ను, ఖాళా, బుల్బుల్ లాంటి చిత్రాల్లో న‌టించింది. కానీ ఆ సినిమాలను ఎవరూ ప‌ట్టించుకోలేదు. ఆ స‌మ‌యంలో ట్రిప్తి అస్స‌లు ఊహించ‌లేదు. త‌న లైఫ్ గేమ్ ఛేంజింగ్ సినిమాని ఒక తెలుగు ద‌ర్శ‌కుడు అందిస్తాడ‌ని.. అది కూడా ర‌ణ‌బీర్ క‌పూర్ లాంటి పెద్ద హీరో సినిమాలో న‌టించే అవ‌కాశం.

ఒకే ఒక్క `యానిమ‌ల్` చిత్రం ట్రిప్తి దిమ్రీ ద‌శను మ‌లుపు తిప్పేసింది. యానిమ‌ల్‌లో చేసింది చిన్న పాత్ర‌లోనే అయినా అది త‌న కెరీర్ గేమ్ ఛేంజ‌ర్ గా మారింది. ఈ సినిమా విడుద‌లైన త‌ర్వాత ట్రిప్తి దిమ్రీ ఎవ‌రు? అంటూ గూగుల్ లో ఆరాలు తీసారు. మీడియా విస్త్ర‌తంగా త‌న గురించి ప్ర‌చారం చేసింది. అంతేకాదు ట్రిప్తి దిమ్రీ న‌టించిన గ‌త చిత్రాలు లైలా మ‌జ్ను, ఖ‌ళా , బుల్బుల్ లను కూడా ప్ర‌జ‌లు చూడ‌టానికి ప్ర‌య‌త్నించారు. జీవితం 360 డిగ్రీల మ‌లుపు తీసుకుంద‌ని చెప్పింది ట్రిప్తి.

యానిమ‌ల్ విడుద‌ల‌య్యాక అనూహ్యంగా ట్రిప్తి `నేష‌న‌ల్ క్ర‌ష్` అనే టైటిల్ ని కూడా సొంతం చేసుకుంది. సందీప్ వంగా ఆ రోజు త‌న‌ను న‌మ్మి జోయా అనే పాత్ర‌ను ఆఫ‌ర్ చేయ‌క‌పోతే ఏం జ‌రిగేదో ట్రిప్తి ఊహించుకుంటోంది. అందుకే వీలున్న ప్ర‌తిసారీ సందీప్ ని త‌ల‌చుకుంటోంది. తన జీవితాన్ని మార్చేసిన సినిమాగా యానిమల్‌కు క్రెడిట్ ద‌క్కుతుంద‌ని ట్రిప్తి చెప్పారు.

ఫిలింఫేర్‌తో ఇంట‌ర్వ్యూలో ట్రిప్తి మాట్లాడుతూ..``యానిమల్ ఒక వ‌రం. లైలా మజ్ను సమయంలో నాకు ల‌భిస్తుందని భావించిన గుర్తింపు, వాస్తవానికి యానిమల్‌తో వచ్చింది. ఇది చాలా చిన్న పాత్ర కాబట్టి గుర్తింపు వ‌స్తుందా? అని అనుకున్నాను.. కానీ దర్శకుడు సందీప్ వంగా సర్ నాపై నమ్మకం ఉంచారు. ఈ సినిమా నాకు చాలా మంచి అవ‌కాశ‌మ‌ని అన్నారు. ఆయన చెప్పినదంతా సరిగ్గా జరిగింది. ఇది గొప్ప ఆశీర్వాదం.. నా న‌ట‌న‌కు ప్రేమ కురిసింది. యానిమల్ కారణంగా ప్రజలు తిరిగి నా గ‌త చిత్రాలు బుల్బుల్, ఖాలా, లైలా మజ్ను చూడటం నాకు సంతోషాన్నిస్తోంది`` అని అన్నారు.

సెట్‌లో భ‌య‌ప‌డ‌తారా? అన్న ప్ర‌శ్న‌కు ట్రిప్తి స‌మాధానం ఇచ్చింది. ``నేను ప్ర‌తి సినిమాకి భ‌య‌ప‌డ‌తాను.. మొద‌టి ఐదు రోజులు ఈ భ‌యం. ఎదుటి వ్య‌క్తిని నేను అర్థం చేసుకున్నానా లేదా? అంటూ భ‌య‌ప‌డుతుంటాను. కొద్దిరోజులు అల‌వాట‌య్యాక ఆస్వాధించ‌డం మొద‌ల‌వుతుంది. న‌టిగా స్వీయ‌ విమ‌ర్శ‌ స‌హజం. అది ప్రక్రియ‌లో భాగం`` అని తెలిపింది.

కెరీర్ విష‌యానికి వ‌స్తే.. ట్రిప్తీ త‌దుప‌రి ప్రభాస్‌తో `స్పిరిట్`లో న‌టిస్తుంది. భూల్ భూలయ్యా 3 సహనటి మాధురీ దీక్షిత్‌తో `మా బెహెన్‌` అనే చిత్రానికి సంతకం చేసింది. సందీప్ వంగా `యానిమల్ పార్క్`లోను న‌టించాల్సి ఉంది.