కమల్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన ఆరేళ్ల బాలిక
ఇటీవల ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డు వేడుక రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా జరిగింది. అవార్డు ప్రధానోత్సవం సందర్భంగా అందరి దృష్టిని ఆరు సంవత్సరాల బాలిక త్రిషా తోసర్ ఆకర్షించింది.
By: Ramesh Palla | 29 Sept 2025 3:45 PM ISTఇటీవల ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డు వేడుక రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా జరిగింది. అవార్డు ప్రధానోత్సవం సందర్భంగా అందరి దృష్టిని ఆరు సంవత్సరాల బాలిక త్రిషా తోసర్ ఆకర్షించింది. నాల్ 2 అనే మరాఠీ సినిమాలో నటించిన త్రిషా తోసర్‌కి జాతీయ అవార్డ్ దక్కింది. అతి చిన్న వయసులో జాతీయ అవార్డ్‌ను అందుకున్న ఘనత ఇప్పటి వరకు యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ పేరు మీద ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్‌ను త్రిషా తోసర్ దక్కించుకుంది. కమల్ హాసన్ చిన్న వయసులోనే జాతీయ అవార్డు అందుకున్నాడు అంటూ ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు అంతకంటే చిన్న అమ్మాయి అయిన త్రిషా ఆ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవడం వల్ల దేశం మొత్తం ఆ పాప వైపు చూస్తూ ఉంది. త్రిషా తోవర్ గురించి కమల్ హాసన్ కూడా స్పందించడంతో మరింతగా వార్తల్లో నిలిచింది.
త్రిషా తోవర్‌కి జాతీయ అవార్డ్
జాతీయ అవార్డ్ అందుకోవడం పట్ల త్రిషా తోవర్ స్పందిస్తూ... ఇంత గొప్ప గౌరవం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికీ నేను ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత మంది నాపై అభిమానంను కనబర్చుతున్నారు అర్థం చేసుకోలేక పోతున్నాను. కానీ నా తల్లి నువ్వు మంచి పని చేశావు అని చెప్పడం వల్ల చాలా సంతోషంగా ఉందని, నేను సాధించిన ఈ అవార్డు నా తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా మొత్తం మహారాష్ట్ర గర్విస్తుందని తెలిసి సంతోషంగా ఉన్నాను. నాకు ఈ అవార్డు రావడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి థాంక్స్. నన్ను ఈ సినిమాలో నటింపజేసినందుకు, ఆ పాత్రను నాకు ఇచ్చినందుకు దర్శకుడు సుధాకర్ యక్కంటి గారికి కృతజ్ఞతలు తెలియజేసింది. ముద్దు ముద్దుగా త్రిషా తోసర్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కమల్ హాసన్ ప్రశంసలు
త్రిషా తోసర్ గురించి కమల్ హాసన్ మాట్లాడుతూ... చిన్న వయసులోనే పెద్ద గౌరవం, గుర్తింపు దక్కించుకున్నందుకు అభినందనలు తెలియజేశాడు, తాను అప్పట్లో సాధించిన రికార్డ్‌ను ఇప్పుడు త్రిషా తోసర్ బ్రేక్ చేయడం సంతోషంగా ఉంది. ఆమెకు నా పూర్తి మద్దతు, ఆశీర్వాదం ఉంటుందని పేర్కొన్నాడు. అంతే కాకుండా త్రిష ముందు ముందు మరిన్ని మంచి సినిమాలు, గొప్ప పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను అంటూ కమల్ శుభాకాంక్షలు తెలియజేశాడు. సోషల్ మీడియాలో త్రిష తోసర్ కి పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు. చిన్న వయసులోనే జాతీయ అవార్డ్ దక్కించుకున్న త్రిష ఎంతో మందికి ఆదర్శం అని, అమ్మాయిలు ఏమైనా సాధిస్తారు అనేందుకు ఇది ప్రత్యక్ష సాక్ష్యం అంటూ నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. నెట్టింట ఆమెకు దక్కుతున్న అభిమానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
నాల్ 2 తో జాతీయ స్థాయి గుర్తింపు
2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాల్ 2 సినిమాకు సుధాకర్ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహించాడు. అత్పత్ ప్రొడక్షన్, జీ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మించాయి. 66వ జాతీయ చలన చిత్ర విజేతల జాబితాలో ఈ సినిమాకు చోటు దక్కింది. 2018లో వచ్చిన నాల్ సినిమాకు సీక్వెల్‌గా నాల్ 2 సినిమా రూపొందింది. ఒక విభిన్నమైన ఫ్యామిలీ కథతో ఈ సినిమాను దర్శకుడు చక్కగా చిత్రీకరించాడు. కమర్షియల్‌గా ఈ సినిమా ఎక్కువ మందికి చేరలేదు. కానీ ఇప్పుడు జాతీయ అవార్డును దక్కించుకోవడంతో సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది. పిల్లల సినిమాగా పేరు సొంతం చేసుకోవడంతో పాటు చిన్నారి త్రిషా కి జాతీయ స్థాయి ఉత్తమ బాల నటి అవార్డ్ రావడంతో సినిమా గురించి మరింతగా చర్చ జరుగుతోంది.
