తొలి సినిమాతోనే విమర్శలు.. టాక్సిక్ టీజర్ బ్యూటీ షాకింగ్ నిర్ణయం!
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి హీరో యష్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన పాత్రను రివీల్ చేస్తూ విడుదల చేసిన టీజర్ ద్వారా భారీ పాపులారిటీ అందుకుంది బీట్రిజ్ టౌఫెన్ బాచ్.
By: M Prashanth | 14 Jan 2026 12:06 PM ISTటాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్.. ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా వస్తున్న చిత్రం ఇది.. నయనతార , హుమా ఖురేషి, కియారా అద్వానీ, తారా సుతారియా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ కే నారాయణ , యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ బ్యూటీ కీలక బీట్రిజ్ టౌఫెన్ బాచ్ పాత్ర పోషించారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి హీరో యష్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన పాత్రను రివీల్ చేస్తూ విడుదల చేసిన టీజర్ ద్వారా భారీ పాపులారిటీ అందుకుంది బీట్రిజ్ టౌఫెన్ బాచ్. ఇందులో కారులో హీరో యష్ తో చేసిన బోల్డ్ సన్నివేశం సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈమెపై అణుచిత వ్యాఖ్యలు చేస్తూ చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు సెన్సార్ చేయని ఈ టీజర్ కట్ పై కొనసాగుతున్న చర్చల మధ్య రాత్రికి రాత్రి సంచలనంగా మారిపోయిన ఈమెను ఇంస్టాగ్రామ్ ఖాతాలో కూడా చాలామంది విమర్శించారు.
అలా సోషల్ మీడియా వేదికగా తనపై పెరిగిపోతున్న వ్యతిరేకతకు విసిగిపోయిన ఈమె ఊహించని నిర్ణయం తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. విషయంలోకి వెళ్తే తనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తన ఇంస్టాగ్రామ్ ఖాతాను డీ యాక్టివేట్ చేసింది. ముఖ్యంగా నెటిజన్స్ నుండి అనవసరమైన శ్రద్ధ, విమర్శలు ఎదుర్కోవడంతో వాటిని నివారించడానికి ఇలా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఇది చూసిన కొంతమంది యష్ అభిమానులు.. పాపం తొలి ఇండియన్ మూవీతోనే ఈమె విమర్శలు ఎదుర్కొంటోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా టీజర్ లో చూపించిన అశ్లీలతపై ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసింది. ఈ టీజర్ లోని దృశ్యాలు మహిళల గౌరవానికి భంగం కలిగిస్తున్నాయని , కన్నడ సంస్కృతిని కించపరిచేలా ఉన్న ఈ టీజర్ ను వెంటనే తొలగించాలి అని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉషా మోహన్ డిమాండ్ చేశారు.
అటు దీనిపై స్పందించిన మహిళా కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. ఇక మరొకవైపు సామాజిక కార్యకర్త దినేష్ కళ్ళపల్లి కూడా అభ్యంతరకర దృశ్యాలపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన సెన్సార్ బోర్డు ఈ టీజర్ ను నేరుగా యూట్యూబ్లో విడుదల చేశారు. దీని అధికార పరిధికి వెలుపలు ఉన్న దేనికైనా సరే సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసే నిబంధన లేదు అని బోర్డ్ స్పష్టం చేసింది.
