స్టార్ హీరోలకు భారీ షాక్‌లు ఊహించే ఉండరు!
అలాగే వర్సటైల్ యాక్టర్ కార్తీ నటించిన స్పై థ్రిల్లర్ సీక్వెల్ `సర్దార్ 2` కూడా ఊహించని దెబ్బతింది.
By: Srikanth Kontham | 19 Sept 2026 8:18 AM ISTపరిశ్రమలో విజయానికి స్థిరమైన ఫార్ములా ఉండదని మరోసారి ప్రూవ్ అయింది. ఎంతటి స్టార్ పవర్ ఉన్నా? ఎంత భారీ బడ్జెట్ పెట్టినా? కథలో బలం లేకపోతే ప్రేక్షకులు తిరస్కరిస్తారని బాక్సాఫీస్ ఫలితాలు నిరూపించాయి. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన కొందరు అగ్ర హీరోల చిత్రాలు అనూహ్యంగా ప్లాప్ గా మిగిలి, ఇటు చిత్ర పరిశ్రమ వర్గాలను, అటు అభిమానులను తీవ్ర నిరాశపరిచాయి.
`కేజీఎఫ్` సిరీస్‌తో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యష్ నటించిన `టాక్సిక్` చిత్రం భారీ షాక్ అని చెప్పొచ్చు. `కేజీఎఫ్ 2` తర్వాత సుదీర్ఘ విరామం తీసుకుని గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో యష్ చేసిన పాన్-ఇండియా ప్రాజెక్ట్‌పై ఎల్లలు లేని అంచనాలు నెలకొన్నాయి. మేకింగ్ పరంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కినా? సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ కాని సంక్లిష్టమైన కథనం .. డల్ ప్లాట్ తో సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది.
అలాగే వర్సటైల్ యాక్టర్ కార్తీ నటించిన స్పై థ్రిల్లర్ సీక్వెల్ `సర్దార్ 2` కూడా ఊహించని దెబ్బతింది. మొదటి భాగం `సర్దార్` సాధించిన సంచలన విజయం ఆధారంగా సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ స్క్రీన్‌ప్లేలో బిగువు లోపించడం, మొదటి భాగంలో ఉన్నంత ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడంతో ప్రేక్షకులు సినిమాను ఆదరించలేకపోయారు. సీక్వెల్ బ్రాండ్ నేమ్ ఒక్కటే సినిమాను కాపాడలేదని `సర్దార్ 2` ఫలితం నిరూపించింది.
కోలీవుడ్ మాస్ యాక్షన్ హీరో విశాల్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం `మకుటం` పరిస్థితి కూడా వీటికి భిన్నంగా లేదు. హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. పాతకాలపు కథాంశం, లాజిక్‌కు దూరంగా ఉన్న యాక్షన్ సీన్లు ప్రేక్షకులకు విసుగు తెప్పించాయి. భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో విశాల్ కెరీర్‌కు మరో పెద్ద షాక్ తగిలినట్లయింది.
ఈ సినిమాల వైఫల్యాలు చిత్ర పరిశ్రమకు స్పష్టమైన హెచ్చరికను ఇచ్చాయి. స్టార్ డమ్, భారీ యాక్షన్ సీక్వెన్సెస్.. పాన్-ఇండియా అనే ప్రచార హంగులతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేమని ఈ పరిణామాలు తేల్చిచెప్పాయి. కథలో బలం, కథనంలో వినూత్నత, భావోద్వేగాలు ఉన్నప్పుడు మాత్రమే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
ఏదేమైనా టాక్సిక్, సర్దార్ 2, మకుటం ప్లాప్‌లు స్టార్ హీరోలకు, దర్శకులకు పెద్ద పాఠం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇకపై ప్రాజెక్టులను ఎంచుకునేటప్పుడు హంగుల కంటే కథా బలానికే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. మరి ఊహించని షాక్‌ల నుంచి కోలుకుని స్టార్ హీరోలు తమ తదుపరి చిత్రాలతో ఎలా కంబ్యాక్ ఇస్తారో చూడాలి.
