బాక్సాఫీస్.. టాక్సిక్ ముందున్న అసలు టార్గెట్ ఇదే!
అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. హోమ్ గ్రౌండ్ కర్ణాటకలో యష్ క్రేజ్ కు తగ్గట్టే టికెట్ సేల్స్ గట్టిగా సాగుతున్నాయి.
By: M Prashanth | 22 Aug 2026 10:08 AM ISTయష్ థియేటర్లలో కనిపించి నాలుగేళ్లు దాటిపోయింది. అయినా ఇప్పటికీ ఆ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ లెక్కలే. ఆ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు టాక్సిక్ రిలీజ్ దగ్గరపడుతుండటంతో యష్ ముందున్న మొదటి సవాల్ కూడా ఆ పాత రికార్డును దాటడమే.
అప్పట్లో కేజీఎఫ్ 2కు ఉన్న హైప్ వేరు. మొదటి పార్ట్ ఇచ్చిన ఇంపాక్ట్ తో రాకీ భాయ్ కోసం నార్త్ నుంచి సౌత్ వరకు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అందుకే హిందీలోనే మొదటి రోజు 53 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. తెలుగు, కన్నడ మార్కెట్లలోనూ భారీ నంబర్లు పడ్డాయి. అలాంటి ఓపెనింగ్ మళ్లీ రావాలంటే టాక్సిక్ సినిమాకు ఏదో ఒకటీ రెండు ఏరియాలు సరిపోవు, అన్ని భాషల్లోనూ అదే స్థాయి ఇంపాక్ట్ చూపించాల్సి ఉంటుంది.
అయితే ఈసారి యష్ చేతిలో కేజీఎఫ్ లాంటి బ్రాండ్ లేదు. డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌తో మరో హై వోల్టేజ్ జోన్ లోకి వెళ్లాడు. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చాలా రా గా బోల్డ్ గా కనిపిస్తోంది. పైగా ఈ సినిమాకు A సర్టిఫికెట్ వచ్చింది. దీనివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ లో ఒక వర్గం దూరమయ్యే ఛాన్స్ ఉన్నా, యూత్ లో మాత్రం సినిమాపై మంచి క్రేజ్ కనిపిస్తోంది.
అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. హోమ్ గ్రౌండ్ కర్ణాటకలో యష్ క్రేజ్ కు తగ్గట్టే టికెట్ సేల్స్ గట్టిగా సాగుతున్నాయి. హిందీ మార్కెట్ లో కూడా బుకింగ్స్ స్పీడ్ గానే మూవ్ అవుతున్నాయి. కానీ కేజీఎఫ్ 2 మొదటి రోజే తెలుగులో 25 కోట్ల నెట్ రాబట్టింది. ఆ రేంజ్ ఓపెనింగ్ ను టాక్సిక్ ఇక్కడ రిపీట్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ విషయంలో టాక్సిక్ కు ఒక చిన్న అడ్వాంటేజ్ కూడా ఉంది. ఆగస్ట్ 26న సినిమా రిలీజ్ అవుతుండటం, ఆ రోజు హాలిడే కలిసి రావడంతో మొదటి రోజు థియేటర్లకు ఫుట్ ఫాల్స్ పెరిగే అవకాశం ఉంది. కాకపోతే కేజీఎఫ్ 2 పెట్టిన 160 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేయాలంటే చివరి రెండు రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ఊపందుకోవాలి. ముఖ్యంగా ఓవర్సీస్ నుంచి వచ్చే కలెక్షన్స్ ఈ లెక్కలను బాగా ప్రభావితం చేస్తాయి.
టాక్సిక్ సినిమా మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ తో మొదలైనా అది చాలా పెద్ద ఓపెనింగ్ కిందే లెక్క. కానీ యష్ ప్రస్తుత మార్కెట్ కు ఆ నంబర్ తోనే సరిపెట్టుకోలేం. నాలుగేళ్ల క్రితం తన సినిమానే సెట్ చేసిన 160 కోట్ల బెంచ్ మార్క్ ముందుంది. కేజీఎఫ్ సపోర్ట్ లేకుండా, పూర్తిగా ఒక కొత్త కథతో వచ్చి ఆ నంబర్ ను దాటేస్తే మాత్రం యష్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో దేశవ్యాప్తంగా మరోసారి గట్టిగా ప్రూవ్ అయినట్టే.
