బాక్సాఫీస్‌పై 'టాక్సిక్' దాడి: రాకింగ్ స్టార్ యశ్ అభిమానుల హంగామా!
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన అత్యంత భారీ అంచనాలున్న చిత్రం `టాక్సిక్` థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది.
By: Sivaji Kontham | 26 Aug 2026 7:33 AM ISTకన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన అత్యంత భారీ అంచనాలున్న చిత్రం `టాక్సిక్` థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల ఉత్సాహం అంబరాన్ని తాకుతోంది. ప్రపంచం రేపటి నుంచి మీదే! అంటూ యశ్ చేసిన ప్రకటనతో అభిమానుల్లో పండుగ వాతావరణం మొదలైంది. కెజిఎఫ్ సిరీస్ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఈ చిత్రం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ బుధవారం విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ముందస్తు బుకింగ్స్‌తో రికార్డులు సృష్టిస్తున్నారు. మైసూర్, మంద్య, హాసన్ వంటి ప్రాంతాలలో ఇప్పటికే సంబరాలు ఆకాశాన్నంటాయి. ఉదయం 4:30 ఏఎం- 6:00 ఏఎం వంటి తెల్లవారుజాము షోల కోసం అభిమానులు థియేటర్ల వద్ద భారీగా టికెట్లను బుక్ చేసుకుని తమ కథానాయకుడి రాకను ఘనంగా స్వాగతించేందుకు సిద్ధమయ్యారు.
ఈ సినిమా బాక్సాఫీస్ పొటెన్షియల్ గురించి అభిమానులు ఎంతో ధీమాతో ఉన్నారు. గతంలో వచ్చిన కెజిఎఫ్ రికార్డులను తిరగరాస్తూ `టాక్సిక్` ప్రపంచవ్యాప్తంగా రూ. 2000 కోట్ల కలెక్షన్ల మార్కును సునాయాసంగా చేరుకుంటుందని సోషల్ మీడియాలో జోరుగా కామెంట్లు చేస్తున్నారు. యశ్ మాస్ ఆరా - స్క్రీన్ ప్రెజెన్స్ ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తుందని నమ్ముతున్నారు.
అయితే ఈ వేడుకల నడుమ బాధ్యతాయుతమైన అభిమానులు -చిత్ర బృందం ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తిని చేస్తున్నారు. థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లలో సన్నివేశాలను రికార్డ్ చేయవద్దని.. సోషల్ మీడియాలో వీడియోలు లేదా క్లిప్‌లు పోస్ట్ చేసి స్పాయిలర్లను బహిర్గతం చేయవద్దని కోరుతున్నారు. ప్రతీ ఒక్కరు ఈ సినిమా థ్రిల్‌ను థియేటర్లలోనే నేరుగా అనుభవించేలా సహకరించాలని పిలుపునిచ్చారు.
మొత్తానికి, `టాక్సిక్` సినిమా విడుదలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఏళ్ల తరబడి పడ్డ శ్రమకు.. యూనిట్ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని మేకర్స్ ఆశిస్తున్నారు. యశ్ రాకింగ్ పవర్‌తో థియేటర్లు కలకలలాడబోతుండగా.. రేపటి నుంచి `టాక్సిక్` సామ్రాజ్యం ఎలా ఏలబోతోందో చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు.
