'టాక్సిక్' ఈవెంట్‌లో ప్రమాదం: ప్రసంగం ఆపేసి భద్రతను సమీక్షించిన యష్
విద్యార్థులు కొందరు ఈ సౌండ్ బాక్సులపైకి ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలు కావడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది.
By: Sivaji Kontham | 23 Aug 2026 3:15 PM ISTకన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్` చిత్ర ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన ప్రోమో ఈవెంట్‌లో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో హాజరైన విద్యార్థులను ఉద్దేశించి యష్ వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ సౌండ్ బాక్స్ సెటప్ గుంపులోకి కూలిపోయింది. విద్యార్థులు కొందరు ఈ సౌండ్ బాక్సులపైకి ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలు కావడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది.
ప్రమాదాన్ని వెంటనే గమనించిన హీరో యష్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపివేశారు. వేదికపై నుంచే మైకు ద్వారా స్పందిస్తూ, ``వాళ్ళు బానే ఉన్నారా? దయచేసి ఒకసారి వెళ్లి చూడండి`` అని నిర్వాహకులను , సెక్యూరిటీ టీమ్‌ను ఆదేశించారు. పరిస్థితి సద్దుమణిగే వరకు వేదికపైనే నిరీక్షించిన ఆయన.. అభిమానుల క్షేమానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు గాయపడిన ఇద్దరు విద్యార్థులను ప్రాథమిక చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అంతేకాకుండా.. ఈవెంట్‌లో భద్రతా సమస్యలను గమనించిన యష్.. నటుడిని క్లోజప్‌గా చూడటం కోసం అక్కడ ఉన్న ఎత్తైన నిర్మాణాలు - కటౌట్లపైకి ఎక్కిన విద్యార్థులను చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదకరమైన ప్రదేశాల్లోకి ఎక్కిన వారిని వెంటనే కిందకు దిగాల్సిందిగా కోరారు. ``అందరూ సురక్షితంగా ఉన్నారా? ప్రతి ఒక్కరూ బానే ఉన్నారా?`` అని సభలో ఉన్న జన సమూహాన్ని పదే పదే అడిగి తెలుసుకున్న తర్వాతే ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు.
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ పాన్-ఇండియా చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇందులో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా , రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ - మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ `A` సర్టిఫికేట్ మంజూరు చేయగా..నిడివి 3 గంటల 12 నిమిషాలుగా నిర్ణయించారు.
ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం , ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాపై ప్రమాద వార్త కొంత కలవరం రేపినా గాయపడిన విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆగస్టు 26న థియేటర్లలో విడుదల కానున్న `టాక్సిక్` కోసం సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
