Begin typing your search above and press return to search.

టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్: వివాదాల దారి మళ్లింపు వ్యూహాలు నిజంగా ఫలిస్తాయా?

ఈ రకమైన టాపిక్ డైవర్షన్ ద్వారా అసలు సమస్య తీవ్రతను త‌గ్గించొచ్చ‌ని భావించడం వెనుక వ్యూహాత్మక ప్రణాళికలు దాగి ఉంటాయనే ఆరోప‌ణ‌లున్నాయి.

By:  Srikanth Kontham   |   4 Sept 2026 11:00 PM IST
టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్: వివాదాల దారి మళ్లింపు వ్యూహాలు నిజంగా ఫలిస్తాయా?
X

రాజకీయ రంగంలోనైనా? సినీ గ్లామర్ ప్రపంచంలోనైనా? సంచలన వివాదాలు, విమర్శలు ఎదురైనప్పుడు ప్రజా దృష్టిని మళ్లించడం అనేది కీలకమైన వ్యూహంగా మారుతోంది. ఏదైనా ప్రతికూల అంశం లేదా వివాదం తీవ్రమైన చర్చకు దారితీసినప్పుడు దానికి సమాధానం చెప్పడం కంటే? అంతకంటే పెద్ద వార్తను లేదా కొత్త అంశాన్ని తెరపైకి తేవడం పరిపాటైంది. ఈ రకమైన టాపిక్ డైవర్షన్ ద్వారా అసలు సమస్య తీవ్రతను త‌గ్గించొచ్చ‌ని భావించడం వెనుక వ్యూహాత్మక ప్రణాళికలు దాగి ఉంటాయనే ఆరోప‌ణ‌లున్నాయి.

రాజకీయాల్లో నాయకులు .. ప్రభుత్వాలు చిక్కుల్లో పడినప్పుడు ఏదో ఒక సంచలన ప్రకటన చేయడం ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడం లేదా సున్నితమైన భావోద్వేగ అంశాలను ముందుకు తీసుకురావడం చూస్తుంటాం. సినిమా రంగంలో అయితే ఒక సినిమా వివాదంలో చిక్కుకున్నప్పుడు లేదా నటీనటుల వ్యక్తిగత విషయాలు నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పుడు ఆకస్మికంగా కొత్త ప్రాజెక్ట్ ప్రకటనలు చేయడం లేదా మరొక గాసిప్‌ను వ్యాప్తి చేయడం వంటివి జరుగుతుంటాయి. దీనివల్ల మీడియా - సోషల్ మీడియా దృష్టి తక్ష‌ణ‌మే కొత్త అంశం వైపు మళ్లుతుంది.

అయితే ఈ తరహా దారి మళ్లింపు వ్యూహాలు ఎంత వరకు సఫలమవుతాయనే దానిపై విభిన్న కోణాలున్నాయి. స్వల్పకాలికంగా చూస్తే ఈ వ్యూహం కొంతవరకు పనిచేస్తుందనేది వాస్తవం. నిరంతరం కొత్త వార్తల కోసం చూసే మీడియా -సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తక్షణమే కొత్తగా వచ్చిన సంచలన అంశాన్ని పట్టుకుని చర్చలు మొదలుపెడతాయి. దీంతో అసలు వివాదం కొన్ని రోజుల పాటు వెనక్కి వెళ్లిపోవడం లేదా ప్రజల మైండ్‌స్పేస్ నుండి కొంత దూరమవ్వడం జరుగుతుంది.

కానీ సుదీర్ఘకాలికంగా ఆలోచిస్తే డిజిటల్ యుగంలో సమాచార లభ్యత , ప్రజల అవగాహన స్థాయి పెరిగాయి. పాత వార్తలను లేదా వివాదాలను సులభంగా మరిచిపోయే రోజులు కావివి. సోషల్ మీడియా విశ్లేషణలు, నెటిజన్ల పరిశీలన ధోరణి కారణంగా విషయాన్ని దాచడానికి మరొక అంశాన్ని తెచ్చారని ప్రజలు వేగంగా గ్రహించగలుగుతున్నారు. దీనివల్ల అసలు అంశం పరిష్కారం కాకపోగా బాధ్యత నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే ప్రతికూల అభిప్రాయం మరింత బలపడుతుంది.

సినిమా ప్రేక్షకులైనా? రాజకీయ ఓటర్లైనా? నేడు విషయాలను విశ్లేషించడంలో పరిణతి చూపిస్తున్నారు. తాత్కా లికంగా దృష్టి మారినా? మూల సమస్యపై స్పష్టత రానంతవరకు ఆయా వ్యక్తులు లేదా సంస్థల న‌మ్మ‌కం దెబ్బతింటుంది. పదే పదే ఇవే తరహా డైవర్షన్ పద్ధతులను ఉపయోగిస్తే? ఆయా రాజకీయ నాయకులు లేదా సినీ తారలు చెప్పే కొత్త వార్తలపై కూడా ప్రజల్లో అనుమానాలు మొదలవుతాయి. దీంతో వారి అసలు విశ్వసనీయతే ముప్పులో పడుతుంది.

వివాదాల నుంచి దృష్టి మళ్లించడం అనేది తాత్కాలికంగా ఉద్రేకాలను తగ్గించే షార్ట్‌కట్ మాత్రమే తప్ప శాశ్వత పరిష్కారం కాదు. నేటి అవగాహన ఉన్న సమాజంలో అసలు సమస్యను ఎదుర్కొని, పారదర్శకంగా వివరణ ఇవ్వడమే అత్యుత్తమ మార్గం. దారి మళ్లింపు వ్యూహాలు కొంతకాలం పాటు చర్చను మార్చగలిగినా? ప్రజల మనస్సులో మెదిలే ప్రశ్నలకు సరైన సమాధానం లభించనంత వరకు అసలు వివాదపు నీడలు తొలగిపోవన్న‌ది ప‌చ్చి వాస్త‌వం.