Begin typing your search above and press return to search.

టాప్ 2 ప్లేస్ లో నాగార్జున.. ఈసారీ రెస్పాండ్ అవుతారా?

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్స్ నెట్ వర్త్ పై రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

By:  M Prashanth   |   6 Jan 2026 11:00 PM IST
టాప్ 2 ప్లేస్ లో నాగార్జున.. ఈసారీ రెస్పాండ్ అవుతారా?
X

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్స్ నెట్ వర్త్ పై రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2025 వరకు హీరోల ఆస్తుల అంచనాలను ఓ జాతీయ మీడియా సంస్థ విడుదల చేయగా.. అందులో టాలీవుడ్‌ కు చెందిన పలువురు సీనియర్ నటులు టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషంగా మారింది.

ముఖ్యంగా అక్కినేని నాగార్జున పేరు రెండో స్థానంలో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఆ రిపోర్ట్ ప్రకారం, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ దేశంలోనే అత్యధిక సంపద కలిగిన నటుడిగా మొదటి స్థానంలో నిలిచారు. ఆయన నికర ఆస్తుల విలువ సుమారు రూ.12,931 కోట్లుగా అంచనా.

షారుక్ తర్వాతి స్థానంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఉన్నారు. నాగార్జున మొత్తం సంపద దాదాపు రూ.5000 కోట్లుగా ఆ రిపోర్ట్ పేర్కొంది. అనేక మంది బాలీవుడ్ హీరోలు ఉండగా, నాగార్జున రెండో స్థానంలో ఉండటం గమనార్హం. మూడో స్థానంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఆయన సంపద సుమారు రూ.3225 కోట్లుగా అంచనా.

ఆ తర్వాత హృతిక్ రోషన్ (రూ.3100 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ.2250 కోట్లు), ఆమిర్ ఖాన్ (రూ.1860 కోట్లు) వరుసగా ఉన్నారు. ఏడో స్థానంలో మన మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. ఆయన నికర ఆస్తులు సుమారు రూ.1750 కోట్లుగా నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత స్థానాల్లో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు.

అయితే టాప్ 10లో ఇద్దరు సీనియర్ తెలుగు నటులు, ఒక యంగ్ హీరో ఉండటం టాలీవుడ్ స్థాయిని మరోసారి చాటి చెప్పిందని అభిమానులు అంటున్నారు. అదే సమయంలో ఇలాంటి నెట్ వర్త్ అంచనాలపై గతంలో నాగార్జున స్వయంగా స్పందించిన సందర్భాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

ఫోర్బ్స్ వంటి సంస్థలు ఇంతకుముందు విడుదల చేసిన సంపద జాబితాలపై నాగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సెలబ్రిటీల ఆస్తులపై వచ్చే లెక్కలు పూర్తిగా నిజమైనవి కావని, చాలా అంశాలు బయటకు రాకపోవడం వల్ల ఇవి కేవలం అంచనాలుగానే ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ లెక్కలు తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని అప్పట్లో అన్నారు.

ఇప్పుడు అదే నాగార్జున దేశంలో రెండవ అత్యంత ధనవంతుడైన నటుడిగా నిలవడం ఆసక్తికరంగా మారింది. కొందరు ఆ గణాంకాలు నిజమే కావచ్చని భావిస్తుంటే, మరికొందరు ఇవి ఊహాగానాలేనని అంటున్నారు. యాక్టింగ్ తో పాటు వ్యాపారాలు, నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులే నాగార్జున సంపదకు కారణమని చెబుతున్నారు. మరి ఇప్పుడు కూడా నాగ్ రెస్పాండ్ అవుతారేమో చూడాలి.