కెరీర్ ఎండ్ అనేదే లేదని నిరూపించిన టాప్ 5 హీరోయిన్లు!
సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ కాలపరిమితి (సెల్ఫ్ లైఫ్) చాలా తక్కువగా ఉండేది. పెళ్లైనా లేదా ముప్పై ఏళ్లు దాటినా అవకాశాలు తగ్గిపోయేవి.
By: Sivaji Kontham | 1 July 2026 9:00 AM ISTసినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ కాలపరిమితి (సెల్ఫ్ లైఫ్) చాలా తక్కువగా ఉండేది. పెళ్లైనా లేదా ముప్పై ఏళ్లు దాటినా అవకాశాలు తగ్గిపోయేవి. కానీ ఆ పాత చింతకాయ ఆలోచనలకు కాలం చెల్లిందని నిరూపిస్తూ.. రెండు దశాబ్దాలుగా వయసుతో పని లేకుండా వెండితెరను ఏల్తున్నారు మన స్టార్ హీరోయిన్లు.
గ్లామర్‌ను కాపాడుకుంటూనే, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ... మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటీటీ ప్రాజెక్ట్‌లు, వెబ్ సిరీస్‌లతో నేటికీ `మోస్ట్ వాంటెడ్` స్టార్స్‌గా నిలిచిన టాప్ 5 సీనియర్ హీరోయిన్ల సక్సెస్ మంత్రం గురించి తెలుసుకోవాలనుకుంటే..!
నయనతార (లేడీ సూపర్ స్టార్)
రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో అప్రతిహతంగా దూసుకుపోతోంది నయనతార. గ్లామర్ పాత్రల నుంచి `కనెక్ట్`, `అన్నపూర్ణి` వంటి నాయికా ప్రధాన (కంటెంట్ డ్రివెన్) చిత్రాల వైపు మారిన తీరు అద్భుతం. బాలీవుడ్‌లో `జవాన్` చిత్రంతో ఆరంగేట్రం చేయగా, ఇది వందల కోట్ల వసూళ్లను సాధించింది. పెళ్లై పిల్లలున్నా తన స్టార్డమ్‌కు ఎలాంటి డోకా లేదని నిరూపించింది. సోషల్ మీడియాలో నయన్‌కున్న బ్రాండ్ వాల్యూ, సొంత వ్యాపారాలు ఎప్పటికీ టాప్‌లోనే ఉంచుతున్నాయి.
త్రిష (ఎవర్ గ్రీన్ బ్యూటీ)
`పొన్నియిన్ సెల్వన్` చిత్రంలో కుందవై పాత్రతో త్రిష రీ-ఎంట్రీ ఇచ్చిన తీరు ఒక సంచలనం. కెరీర్ ప్రారంభించి 20 ఏళ్లు దాటినా.. నేటికీ చిరంజీవి (విశ్వంభర), విజయ్ వంటి అగ్ర హీరోల సరసన మెయిన్ లీడ్ రోల్స్ చేస్తూ మోస్ట్ బిజీ హీరోయిన్‌గా మారింది. మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా 'బృందా' వంటి వెబ్ సిరీస్‌లతో ఓటీటీలోనూ తన ముద్ర వేసింది. వయసు కేవలం అంకె మాత్రమేనని త్రిష నిరూపిస్తోంది.
తమన్నా భాటియా (మిల్కీ బ్యూటీ)
తమన్నా కెరీర్ గ్రాఫ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద పాఠం. కమర్షియల్ సినిమాల్లో కేవలం గ్లామర్ డాళ్‌గా మాత్రమే మిగిలిపోకుండా `జీ కర్దా`, `ఆఖరి సచ్` వంటి బోల్డ్ కంటెంట్ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్‌లతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను షేక్ చేసింది. `కావాలా` పాటతో సోషల్ మీడియాలో సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా బ్రాండ్ ఇమేజ్‌ను కమర్షియల్ సక్సెస్‌గా మార్చడంలో తమన్నా రూటే వేరు.
కాజల్ అగర్వాల్ (చందమామ)
వివాహం జరిగి ఒక కుమారునికి జన్మనిచ్చిన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతోంది. `భగవంత్ కేసరి`, `ఇండియన్ 2` వంటి భారీ చిత్రాల్లో నటించింది. నటనకు ప్రాధాన్యమున్న లేడీ ఓరియెంటెడ్ కథలను ఓకే చేస్తోంది. సాంప్రదాయ మార్కెట్‌తో పాటు డిజిటల్ స్పేస్‌లోనూ తన క్రేజ్‌ను కాపాడుకుంటూ నవతరం హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. కాజల్ నటించిన సామాజిక సందేశ సినిమా విడుదలకు రానుంది.
ప్రియమణి (వర్సటైల్ యాక్ట్రెస్)
నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ప్రియమణి కెరీర్ ప్రస్తుతం పీక్స్‌లో ఉందనే చెప్పాలి. `ది ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్‌తో పాన్-ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ అటు బాలీవుడ్ (జవాన్, మైదాన్), ఇటు టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. గ్లామర్ కంటే కూడా అద్భుతమైన నటన.. మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఓటీటీ కంటెంట్‌ను ఎంచుకోవడమే ప్రియమణిని నేటికీ రేసులో ముందుంచింది.
సమంత రూత్ ప్రభు: దాదాపు 16 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకుని రెండు దశాబ్దాల మైలురాయి వైపు దూసుకుపోతోంది. హెల్త్ ఛాలెంజెస్ ఎదుర్కొన్నా `ఫ్యామిలీ మ్యాన్ 2`, `సిటాడెల్: హనీ బన్నీ` వంటి ఇంటర్నేషనల్ లెవెల్ సిరీస్‌లతో తన గ్లోబల్ బ్రాండ్ వాల్యూని నిరూపించుకుంది. ఇటీవల నిర్మాతగా మా ఇంటి బంగారం చిత్రంతోను మంచి విజయం అందుకుంది.
జ్యోతిక: పెళ్లి తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్నా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో కేవలం నాయికా ప్రధాన చిత్రాలు (36 వయదినిలే, రాక్షసి) చేసారు. `షైతాన్` అనే ప్రయోగాత్మక చిత్రంలోను జ్యోతిక నటించారు.
