Begin typing your search above and press return to search.

పారితోషికంలో గౌర‌వంలో మారుతున్న హీరోయిన్ల రేంజ్

భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకులు వంద‌ల కోట్ల పారితోషికాల‌తో పాటు లాభాల్లో వాటాలు అందుకుంటూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.

By:  Sivaji Kontham   |   4 Aug 2026 1:00 AM IST
పారితోషికంలో గౌర‌వంలో మారుతున్న హీరోయిన్ల రేంజ్
X

భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకులు వంద‌ల కోట్ల పారితోషికాల‌తో పాటు లాభాల్లో వాటాలు అందుకుంటూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. అయితే హీరోతో సమానంగా స్క్రీన్ స్పేస్ పంచుకునే కథానాయికల పారితోషికాల విష‌యంలో భారీ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అసమానతపై దీపికా పదుకొణే, కత్రినా కైఫ్, ఆలియా భట్, కరీనా కపూర్, నయనతార వంటి సీనియర్ తారలు పలు సందర్భాల్లో తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ విజయానికి తాము అందించే సహకారం తక్కువేమీ కాదని నిలదీసినా మేల్ డామినేష‌న్ ఉన్న మార్కెట్ లో ఈ అంతరం కొనసాగుతూనే ఉంది.

ఈ పరిస్థితులు ఉన్నా.. తమ సొంత క్రేజ్ .. అంతర్జాతీయ గుర్తింపుతో కోట్లాది రూపాయల పారితోషికాలు అందుకుంటున్న క‌థానాయిక‌లు నేడు భార‌త‌దేశంలో ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న‌ ప్రతిష్టాత్మక చిత్రానికి గాను ప్రియాంక చోప్రా ఏకంగా రూ. 30 కోట్ల వరకు అందుకోనున్నట్లు వార్తలు రావడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. హాలీవుడ్‌లో సంపాదించిన పాపులారిటీ వల్లనే పీసీకి ఈ స్థాయిలో ఆఫర్ లభించినట్లు తెలుస్తోంది. ఇక `కల్కి 2898 ఏడి` చిత్రం కోసం దీపికా పదుకొణే రూ. 18 కోట్లు అందుకోగా, `స్త్రీ 2`తో బ్లాక్‌బస్టర్ కొట్టిన శ్రద్ధా కపూర్ తన రేటును రూ. 10 నుంచి 15 కోట్లకు పెంచేసిందని సమాచారం.

గతంలో `తను వెడ్స్ మను`, `క్వీన్` వంటి సినిమాలతో టాప్ ఫామ్‌లో ఉన్నప్పుడు కంగనా రనౌత్ రూ. 15 నుంచి 30 కోట్ల వరకు అందుకునేదని.. కానీ ఇటీవలి కాలంలో వరుస పరాజయాల వల్ల ఆమె మార్కెట్ విలువ కొంత మేర తగ్గిందని సమాచారం. మరోవైపు..అగ్ర క‌థానాయిక‌ ఆలియా భట్ రూ. 15 నుంచి 25 కోట్ల మధ్య పారితోషికం డిమాండ్ చేస్తూ బాలీవుడ్‌ను శాసిస్తోంది. ఒకప్పుడు కథానాయికలు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యేవారు, కానీ నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

ప్రస్తుతం హాలీవుడ్ హీరోయిన్ల తరహాలోనే ఇండియన్ కథానాయికలు కూడా ప్రాణాలకు తెగించి భారీ యాక్షన్ సన్నివేశాలు, రిస్కీ స్టంట్స్ చేయడానికి ముందుకొస్తున్నారు. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణే, ఆలియా భట్ వంటి తారలు యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంటూ రూ. 15 కోట్లకు పైగా రెమ్యునరేషన్ క్లబ్‌లో ముందు వరుసలో నిలిచారు. సౌత్ విషయానికి వస్తే నయనతార , సమంత తమదైన స్టంట్స్‌తో `సౌత్ క్వీన్స్`గా ప్రేక్షకుల హృదయాలను ఏలుతూ భారీ పారితోషికాలను రాబడుతున్నారు.

ఇక కియారా అద్వానీ, పూజా హెగ్డే వంటి భామలు కూడా తమ రేంజ్‌ను రూ. 6 కోట్ల రేంజుకు మించేలా ముందుకు తీసుకెళ్లేందుకు కష్టపడుతున్నారు. అయితే చిత్ర పరిశ్రమలో పారితోషికాలనేవి అధికారికంగా ప్రకటించేవి కావు. ఇవేవీ స్థిరంగా కూడా ఉండవు. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ప్రతిసారీ ఈ లెక్కలు మారిపోతుంటాయి. నటి సాధించే సక్సెస్ రేటు, రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణను బట్టే మార్కెట్ విలువ నిర్ధారిస్తారు.

మ‌న దేశంలో క‌థానాయిక‌ల ప‌రంగా టాప్ -5 రెమ్యున‌రేష‌న్ల వివ‌రాల్లోకి వెళితే.. ప్రియాంక చోప్రా రూ. 20 - 30 కోట్లు, దీపికా పదుకొణే రూ. 15 - 30 కోట్లు, ఆలియా భట్ రూ. 10 - 20 కోట్లు, కత్రినా కైఫ్ రూ. 15 - 20 కోట్లు, కంగనా రనౌత్ రూ. 10 - 25 కోట్లు, కరీనా కపూర్ రూ. 8 - 18 కోట్లు, శ్రద్ధా కపూర్ రూ. 10 - 15 కోట్లు, నయనతార రూ. 6 - 10 కోట్లు అందుకుంటున్నారు.