డైరెక్టర్ల కోసం హీరోల మధ్య పోటీ!
దశాబ్దాలుగా టాలీవుడ్‌లో ఒకే రకమైన సమీకరణం కనిపిస్తుంది. ఒక క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయాలంటే ?ఏ హీరో డేట్లు దొరుకుతాయా అని దర్శక,నిర్మాతలు ఎదురు చూడటం సహజం.
By: Srikanth Kontham | 2 July 2026 10:00 PM ISTదశాబ్దాలుగా టాలీవుడ్‌లో ఒకే రకమైన సమీకరణం కనిపిస్తుంది. ఒక క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయాలంటే ?ఏ హీరో డేట్లు దొరుకుతాయా అని దర్శక,నిర్మాతలు ఎదురు చూడటం సహజం. స్టార్ హీరోల కాల్ షీట్ల కోసం పడిగాపులు కాయడం.. వారి ఇమేజ్‌కి తగ్గట్టుగా కథలను మార్చుకోవడం అప్పట్లో ఆచారంగా ఉండేది. కానీ ఇప్పుడు పవర్‌సెంటర్స్ మారుతున్నాయి. కంటెంట్ ఈజ్ కింగ్ అనే నినాదం బలపడటంతో హీరోల కంటే అగ్ర దర్శకుల చుట్టూ ఇండస్ట్రీ గిరగిర తిరుగుతోంది. రాబోయే రోజుల్లో డైరెక్టర్ల కోసం హీరోలు పోటీ పడే రోజులు ఎంతో దూరంలో లేవు.
ప్రస్తుతం పాన్-ఇండియా మార్కెట్‌లో సినిమా విజయం అనేది ఆ చిత్రంలోని హీరో ఇమేజ్ కంటే, దాని వెనుక ఉన్న దర్శకుడి విజన్ పైనే ఆధారపడి ఉంటుంది. ఎస్.ఎస్. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ వంటి దర్శకులు తమకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. వీరు సినిమా తీస్తే గ్యారెంటీగా వందల కోట్ల వసూళ్లు వస్తాయనే నమ్మకం ప్రేక్షకుల్లో, పంపిణీదారుల్లో ఏర్పడింది. ఈనేపథ్యంలో ఒక భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించి పాన్-ఇండియా మార్కెట్‌ను విస్తరించుకోవాలని ఆశించే హీరోలందరూ ఇప్పుడు ఈ దర్శకుల డేట్ల కోసం క్యూ కడుతున్నారు.
హీరోల మధ్య ఈ పోటీ పెరగడానికి ప్రధాన కారణం మార్కెట్ విజిబిలిటీ. ఒక స్టార్ హీరో ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ అగ్ర దర్శకుడితో సినిమా చేస్తే ఆ క్రేజ్ దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది. అందుకే అగ్ర హీరోలంతా దర్శ కులను కలవడానికి.. వారి తదుపరి ప్రాజెక్టులో అవకాశం దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో హీరోల గ్రీన్ సిగ్నల్ కోసం దర్శకులు వేచి చూసేవారు. కానీ ఇప్పుడు ఆ దర్శకుల షెడ్యూల్స్ ఖాళీ ఎప్పుడు అవుతాయా? అని హీరోలు వేచి చూసే పరిస్థితి వచ్చేస్తుంది. ఇది నిజంగా టాలీవుడ్ చరిత్రలో అద్భుతమైన మార్పు.
ముఖ్యంగా సుకుమార్, రాజమౌళి వంటి దర్శకులు కేవలం సినిమాను తెరకెక్కించడం లేదు. వారు ఒక సినిమాటిక్ యూనివర్స్ ను సృష్టిస్తున్నారు. ప్రశాంత్ నీల్ `కెజిఎఫ్` వంటి చిత్రాలతో యాక్షన్ జానర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లగా, సందీప్ రెడ్డి వంగ తనదైన మేకింగ్ స్టైల్‌తో యూత్‌ను పిచ్చెక్కిస్తున్నారు. ఇలాంటి దర్శకులతో పనిచేస్తే కెరీర్ గ్రాఫ్ ఆటోమేటిక్‌గా పెరిగిపోతుందని హీరోలు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఇగోలను పక్కనపెట్టి, దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చి డైరెక్టర్స్ హీరోలుగా మారడానికి సిద్ధమవుతున్నారు.
ఈ పరిస్థితి వల్ల ఇండస్ట్రీలో కొత్త క్రమశిక్షణ కూడా అలవాటుగా మారుతుంది. దర్శకులు తమ విజన్ పట్ల స్పష్టంగా ఉండటం.. దానికి తగ్గట్టుగా హీరోలు తమని తాము మార్చుకోవడం వల్ల నాణ్యమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి అవకాశం ఉంది . ఏ దర్శకుడు ఏ హీరోతో సినిమా చేస్తారు? అనే దానిపైనే ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో బెట్టింగ్ జరుగుతోంది. హీరోల తారాగణం ఎంత గొప్పగా ఉన్నా? దర్శకుడి విజన్ లేనిదే సినిమా ముందుకు వెళ్లని పరిస్థితి నెలకొంది. ఇది తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
డైరెక్టర్ల కోసం హీరోలు పోటీ పడే కొత్త వాతావరణం సినీ పరిశ్రమకు మంచిదే. ఇది కేవలం హీరోల క్రేజ్ మీద కాకుండా క్రియేటివిటీకి, మేకింగ్‌కు దక్కుతున్న గౌరవం. మొత్తానికి టాలీవుడ్ లో హీరోయిజం కంటే డైరెక్టోరియల్ విజన్ కి ప్రాముఖ్యత పెరుగుతుందన్నది కాదనలేని నిజం. ఇదే తెలుగు సినిమా గ్లోబల్ సక్సెస్ కి అసలైన రహస్యం.
