ఇప్పటికీ టాప్ -5 లో వాళ్లే!
సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అందుబాటులో ఉన్నా? ఒక సినిమాను ఆవిష్కరించే క్రమంలో ఏమాత్రం రాజీపడని కొందరు దర్శకులు సమయ పరిమితులను పక్కన పెడుతుంటారు.
By: Srikanth Kontham | 3 Oct 2026 8:15 AM ISTసాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అందుబాటులో ఉన్నా? ఒక సినిమాను ఆవిష్కరించే క్రమంలో ఏమాత్రం రాజీపడని కొందరు దర్శకులు సమయ పరిమితులను పక్కన పెడుతుంటారు. సినిమా సెట్స్‌పైకి వెళ్లి ప్రొడక్షన్ పూర్తి చేసుకుని థియేటర్లలోకి రావడానికి ఏళ్ల తరబడి సమయం తీసుకునే ప్రతిభావంతులైన దర్శకుల జాబితా తీస్తే.. నేటికీ టాప్-5 స్థానాల్లో ప్రముఖ అగ్ర దర్శకులే నిలుస్తున్నారు. కాలంతో సంబంధం లేకుండా క్వాలిటీయే ప్రామాణికంగా ముందుకు సాగుతున్న ఆ టాప్-5 ట్రెండ్ సెట్టర్ల ప్రయాణం ప్రత్యేకమైనది.
ఈ ప్రతిష్టాత్మక జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన పేరు దర్శకధీరుడు రాజమౌళి. ఒకప్పుడు ఏడాదికి ఒక సినిమా పూర్తి చేసిన జక్కన్న `బాహుబలి` సిరీస్ నుంచి శైలిని పూర్తిగా మార్చుకున్నారు. ప్రతి సన్నివేశాన్ని పర్ఫెక్షన్ కోసం చెక్కడమే కాక భారీ ప్రీ-ప్రొడక్షన్, పోస్ట్-ప్రొడక్షన్ వీఎఫ్ఎక్స్ పనుల కోసం సంవత్సరాల సమయాన్ని కేటాయిస్తారు. `బాహుబలి` రెండు భాగాలు, `ఆర్ఆర్ఆర్` అలాగే ప్రస్తుతం తెరకెక్కుతున్న `వారణాసి` వరకు ఆయన ఒక్కో ప్రాజెక్ట్‌కి 3 నుంచి 4 ఏళ్ల పాటు అంకితమవుతున్నారు.
భారీ సెట్లకు మారుపేరైన తమిళ అగ్ర దర్శకుడు శంకర్ కూడా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంటారు. `భారతీయుడు`, `అపరిచితుడు`, `శివాజీ`, `రోబో` చిత్రాల నుంచి మొన్నటి `ఇండియన్ 2`, `గేమ్ ఛేంజర్` వరకు ఆయన సినిమా ప్రొడక్షన్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింగే. గ్రాఫిక్స్, లొకేషన్లు, నటీనటుల రూపురేఖల విషయంలో శంకర్ పట్టుబట్టే విధానం వల్ల ఆయన ప్రాజెక్ట్‌లు విడుదల కావడానికి రెండేళ్లకు పైగానే సమయం పడుతుంది.
ఇక మూడు దశాబ్దాలుగా భారతీయ సినిమాను శాసిస్తున్న ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ది ప్రత్యేక శైలి. కథలోని భావోద్వేగాలను, పాత్రల అంతర్మథనాన్ని తెరపైకి తీసుకురావడంలో ఆయన చూపించే శ్రద్ధ అసాధారణమైనది. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్` సిరీస్‌తో పాటు కమల్ హాసన్‌తో తెరకెక్కించిన చిత్రాల నిర్మాణం కూడా సుదీర్ఘ కాలం సాగింది. నటీనటుల డేట్స్, చిత్రీకరణలో రాజీ పడని తత్వం వల్ల మణిరత్నం సినిమా అంటేనే సుదీర్ఘ ప్రయాణమనే ముద్ర పడింది.
మోడ్రన్ కమర్షియల్ సినిమా మేకింగ్‌లో సరికొత్త సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ కూడా టాప్-5 లో ముఖ్యులు. `కె.జి.యఫ్` సిరీస్ చిత్రాలతో పాన్-ఇండియా రేంజ్‌లో రికార్డులు తిరగరాసిన నీల్ ప్రాజెక్ట్ ప్లానింగ్‌లో ఎంతో సమయాన్ని వెచ్చిస్తారు. ప్రభాస్‌తో తెరకెక్కించిన `సలార్` ప్రాజెక్ట్ సైతం రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్, డార్క్ థీమ్ ఎలివేషన్లలో అత్యున్నత నాణ్యత కోసం ఆయన తీసుకునే సమయం ప్రేక్షకులకు థియేటర్లలో అద్భుతమైన అనుభవాన్ని ఇస్తోంది.
విలక్షణమైన టేకింగ్, బోల్డ్ కంటెంట్‌తో సంచలనం సృష్టించే సందీప్ రెడ్డి వంగా కూడా క్వాలిటీ విషయంలో అస్సలు రాజీపడరు. `అర్జున్ రెడ్డి`, `కబీర్ సింగ్`, `యానిమల్` చిత్రాల విజయం తర్వాత ఆయన ప్రాజెక్ట్‌లపై అంచనాలు ఆకాశన్నంటుతన్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌తో చేస్తున్న `స్పిరిట్` ప్రీ-ప్రొడక్షన్‌కే సుదీర్ఘ సమయం కేటాయించిన సందీప్ పక్కా స్క్రిప్ట్ డిజైనింగ్ , ఎడిటింగ్ కోసం ఏళ్ల తరబడి శ్రమిస్తారు. ఇలా రాజమౌళి, శంకర్, మణిరత్నం, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా తమ ప్రతీ చిత్రంతో సమయాన్ని మించి క్వాలిటీ కంటెంట్‌ను అందిస్తూ నేటికీ టాప్-5 లోనే కొనసాగుతున్నారు.
