Begin typing your search above and press return to search.

కారులో ముద్దాడుతూ దొరికారు.. ప్రేమ‌జంట పెళ్లికి ముందు స్టోరి ఇంట్రెస్టింగ్!

జెండాయా తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని, త‌న‌తో ఉన్నప్పుడే తాను ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా ఫీల్ అవుతానని టామ్ మురిసిపోయారు.

By:  Sivaji Kontham   |   19 Jun 2026 4:00 AM IST
కారులో ముద్దాడుతూ దొరికారు.. ప్రేమ‌జంట పెళ్లికి ముందు స్టోరి ఇంట్రెస్టింగ్!
X

హాలీవుడ్ మోస్ట్ లవ్‌బుల్ కపుల్స్ టామ్ హాలండ్- జెండాయా ప్రేమాయణం ఎట్టకేలకు వివాహ బంధంతో శుభం కార్డు పలికింది. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ.. తామిద్దరూ ఏడాది క్రిత‌మే పెళ్లి చేసుకున్నామనే నిజాన్ని టామ్ హాలండ్ స్వయంగా ధృవీకరించడంతో ఈ వార్త ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వీరి వివాహం అత్యంత రహస్యంగా, సన్నిహితుల సమక్షంలో జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ జంట‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వెడ్డింగ్ ఫోటోల గురించి తన కుటుంబ సభ్యులకు ఏమైనా వివరణ ఇచ్చారా? అని అడగగా.. అలాంటి అవసరం రాలేద‌ని, పెళ్లికి వారందరూ హాజరయ్యారని ఎస్క్వైర్ ఇంటర్వ్యూలో టామ్ హాలండ్ అసలు విషయాన్ని బయటపెట్టారు. జెండాయా తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని, త‌న‌తో ఉన్నప్పుడే తాను ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా ఫీల్ అవుతానని టామ్ మురిసిపోయారు.

వీరిద్దరి ప్రేమ ప్రయాణం అస‌లు ఎలా మొద‌లైంది? అనేది తెలుసుకుంటే ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ఈ జోడీ ల‌వ్ `స్పైడర్-మ్యాన్: హోమ్‌కమింగ్` సినిమా సెట్స్‌పైనే అంకురించింది. ఆ ప్రాజెక్ట్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించి అది కాస్తా ప్రేమగా మారింది. 2021లో లాస్ ఏంజిల్స్‌లోని సిల్వర్ లేక్ పరిసరాల్లో ఒక కారులో ఇద్దరూ ముద్దు పెట్టుకుంటూ కెమెరాకు చిక్కడంతో వీరి ఆఫ్-స్క్రీన్ రొమాన్స్ ప్ర‌పంచానికి తెలిసింది. అదే ఏడాది జెండాయా పుట్టినరోజున ఇన్‌స్టాగ్రామ్‌లో టామ్ హాలండ్ ఆమె ఫోటోను షేర్ చేస్తూ.. నా ఎమ్ జె .. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. నిద్ర లేచాక నాకు కాల్ చేయి! అంటూ పెట్టిన క్యాప్షన్ అప్పట్లో ఇంటర్నెట్‌ను ఊపేసింది. ఆ తర్వాత 2025 గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల వేడుకలో జెండాయా చేతికి డైమండ్ రింగ్ కనిపించడంతో ఎంగేజ్‌మెంట్ రూమర్స్ వచ్చాయి. అయితే ``మీరు అసలు విషయాన్ని మిస్ అయ్యారు.. వారి పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది`` అని ఆమె స్టైలిస్ట్ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు.

టామ్, జెండాయాల మధ్య ఉన్న అపారమైన అనురాగం, ఒకరికొకరు ఇచ్చుకునే మద్దతు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో జెండాయా తీవ్రమైన సోషల్ యాంగ్జైటీ (ఆందోళన).. కంగారు వల్ల తన కాలును కదిలిస్తుంటే, పక్కనే ఉన్న టామ్ హాలండ్ త‌న‌ను శాంతపర్చడానికి చాలా సున్నితంగా త‌న‌ ఒడిపై చేయి వేసిన తీరు కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. అలాగే ఒక సందర్భంలో కెమెరాలు, అభిమానులు జెండాయాను చుట్టుముట్టి ఇబ్బంది పెడుతుంటే.. టామ్ హాలండ్ త‌న చుట్టూ ర‌క్ష‌ణ క‌వ‌చంలా రక్షిస్తూ క్షేమంగా పక్కకు తీసుకువెళ్లారు. జెండాయా కూడా టామ్ పుట్టినరోజున ``నన్ను అత్యంత సంతోషంగా ఉంచే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు`` అంటూ పెట్టిన పోస్ట్ వీరి మధ్య ఉన్న గాఢమైన బంధాన్ని చాటిచెప్పింది.

వృత్తిపరంగా చూసుకుంటే జెండాయా ప్రస్తుతం హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న యువ నటీమణులలో ఒకరిగా నిలిచారు. ప్రాజెక్ట్ స్థాయిని బట్టి త‌న రెమ్యునరేషన్ మారుతుంటుంది. ఇటీవల జెండ‌యా నటించి, స్వయంగా నిర్మించిన టెన్నిస్ డ్రామా చిత్రం `ఛాలెంజర్స్` కోసం ఏకంగా 10 మిలియన్ డాల‌ర్ల (95 కోట్లు) పారితోషికాన్ని అందుకున్నారు. కెరీర్ ప్రారంభంలో `డ్యూన్`, `స్పైడర్-మ్యాన్` ఫ్రాంచైజీల కోసం తక్కువ బేస్ శాలరీ తీసుకున్నా.. ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ బోనస్‌లతో కలిపి త‌న‌ పారితోషికం మిలియన్ల డాలర్లకు చేరుకుంది. నటిగానే కాకుండా ప్రొడ్యూసర్‌గానూ తన మల్టీ-టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు.

ఇక జెండాయా ప్రియసఖుడు టామ్ హాలండ్ హాలీవుడ్‌లోనే అత్యంత క్రేజ్ ఉన్న స్టార్‌గా అవతరించారు. ప్రస్తుతం అత‌డు ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ 20 మిలియన్ డాల‌ర్ల (సుమారు 200 కోట్లు) నుండి 25 మిలియన్ డాల‌ర్ల‌ వరకు పలుకుతోంది. ముఖ్యంగా స్పైడర్-మ్యాన్ వంటి బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ చిత్రాలకు ఆయన ఈ రేంజ్‌లో డిమాండ్ చేస్తున్నారు. ఎంసియులో రెండున్న‌ర ల‌క్ష‌ల డాల‌ర్ల‌తో టామ్ కెరీర్ ప్రారంభం కాగా, ఆ త‌ర్వాత హోమ్‌కమింగ్` కు ఐదు ల‌క్ష‌ల‌ డాల‌ర్ల పారితోషికం అందుకున్నాడు. అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, ఎండ్‌గేమ్ చిత్రాలకు ఒక్కో దానికి 3 మిలియన్ డాల‌ర్లు, `స్పైడర్-మ్యాన్: నో వే హోమ్` చిత్రానికి ఏకంగా 10 మిలియన్ డాల‌ర్ల‌ బేస్ శాలరీ అందుకునే స్థాయికి ఎదిగారు. రానున్న `స్పైడర్-మ్యాన్` చిత్రాలకు ఏకంగా 20 నుంచి 25 మిలియన్ డాల‌ర్ల‌ భారీ పారితోషికాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నారు. రంగుల ప్ర‌పంచంలో మేల్ డామినేష‌న్ ఉన్న చోట జెండ‌యా లాంటి ఒక వ‌ర్ధ‌మాన న‌టి అసాధార‌ణ ప్ర‌తిభ‌తో ఎదుగుతూ, ఇప్పుడు ప్ర‌పంచంలోనే ఫేమ‌స్ ఆర్టిస్టు అయిన త‌న కొలీగ్ ని పెళ్లాడ‌టం ప్ర‌ధానంగా అభిమానుల్లో చ‌ర్చ‌గా మారింది.