హీరో రైటర్స్..టాలీవుడ్ నయా ట్రెండ్!
టాలీవుడ్‌లో ప్రస్తుతం నయా ట్రెండ్ నడుస్తోంది. ఇంతకు ముందు ఒక సినిమా పట్టాలెక్కుతోందంటే దానికి కర్త, కర్మ, క్రియ ఓన్లీ డైరెక్టరే. అతనికితోడు ప్రొడ్యూసర్ ఓ చెయ్యి వేసేవాడు.
By: Tupaki Entertainment Desk | 19 Jan 2026 6:00 AM ISTటాలీవుడ్‌లో ప్రస్తుతం నయా ట్రెండ్ నడుస్తోంది. ఇంతకు ముందు ఒక సినిమా పట్టాలెక్కుతోందంటే దానికి కర్త, కర్మ, క్రియ ఓన్లీ డైరెక్టరే. అతనికితోడు ప్రొడ్యూసర్ ఓ చెయ్యి వేసేవాడు. మంచి కథ, దానికి తగ్గ డైలాగ్స్, హీరో ఎలివేషన్ సీన్స్ ..ఇలా ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండు మారింది. డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్స్ పని కూడా హీరోలు భుజానికెత్తుకుంటున్నారు. స్టోరీలు రాసేస్తున్నారు. డైలాగ్స్, స్క్రీన్‌ప్లే వాట్ నాట్ ఎవ్రీ థింగ్ అండర్ కంట్రోల్ అనే స్థాయిలో సినిమాకు అన్నీ తామై పని చేస్తున్నారు.
అలా చేసిని సినిమాలు సక్సెస్ అవుతుండటంతో ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఈ ట్రెండ్ కొత్త పుంతలు తొక్కుతూ మిగతా స్టార్లలో ఆలోచన రేకెత్తిస్తోంది. ఈ ట్రెండ్‌కు అప్పట్లో స్వర్గీయ ఎన్టీరామారావు, సూపర్ స్టార్ కృష్ణ నాంది పలికి ఎన్నో సూపర్ హిట్‌లని తమ ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత డా. రాజశేఖర్ (అంగరక్షకుడు) తప్ప మరో హీరో ట్రై చేయలేదు. కానీ ఇప్పుడు మన యంగ్ హీరోలు ఇదే ఫార్ములాని పాటిస్తూ సూపర్ హిట్‌లని సొంతం చేసుకుంటున్నారు. తమ మార్కెట్‌ని పెంచుకుంటున్నారు.
నేటీ తరం యంగ్ హీరోల్లో అడివి శేష్, మాస్ కా దాస్ విశ్వక్‌సేన్, సిద్దూ జొన్నలగడ్డ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రీసెంట్‌గా వీరి జాబితాలోకి నవీన్ పొలిశెట్టి కూడా చేరాడు. ఈ యంగ్ బ్యాచ్‌లో ముందు ఈ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది మాత్రం అడివి శేష్. కర్మ, కిస్ సినిమాలతో హీరోగానే కాకుండా డైరెక్టర్‌గా, రైటర్‌గా త్రిపాత్రాభినయం చేసి తనలోని టాలెంట్‌ని చూపించాడు. అయితే తొలి హిట్‌ని మాత్రం `క్షణం`తో దక్కించుకున్నాడు. గూఢచారి, మేజర్ సినిమాలతో బ్లాక్ బస్టర్లని దక్కించుకున్నాడు. ప్రస్తుతం `డెకాయిట్`, `గూఢచారి 2` సినిమాల్లో నటిస్తూనే రైటర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.
తన తరువాత అదే పంథాని ఫాలో అవుతున్న హీరో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్. `ఫలక్‌నుమాదాస్` మూవీతో హీరోగా, రైటర్‌గా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా సక్సెస్ సాధించాడు. ఆ తరువాత `దాస్ కా ధమ్కీ` వంటి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు స్టోరీ, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. ఈ మూవీసక్సెస్ కావడంతో ప్రస్తుతం తనే డైరెక్ట్ చేస్తూ `కల్డ్` మూవీ చేస్తున్నాడు. ఇక స్టార్ బాయ్ సిద్దూ జొన్నగడ్డ కూడా ఇదే దారిలో పయనిస్తున్నాడు. క్రిష్ణ అండ్ హిస్ లీలా, మన వింత గాధ వినుమా సినిమాలకు రైటర్‌గా కూడా తన ప్రతాపం చూపించాడు. కానీ సక్సెస్ అందుకుంది మాత్రం `డీజే టిల్లు`తోనే. టిల్లు స్క్వేర్‌కు కూడా రైటర్ అవతారమెత్తిన సిద్దూ..త్వరలో తెరపైకి రానున్న `టిల్లు క్యూబ్` కు కూడా పెన్ను పట్టబోతున్నాడు.
వీరి దారిలోనే ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా నడవాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. `ఆంధ్రా కింగ్ తాలూకా` మూవీకి లిరిక్ రైటర్‌గా అవతారం ఎత్తిన రామ్ ఈ మూవీలోని హీరో క్యారెక్టరైజేషన్‌కు సంబంధించిన మార్పులు కూడా చెప్పాడట. తన తదుపరి సినిమాల విషయంలోనూ రైటర్‌గా తను ఇన్‌వాల్వ్ అయ్యే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్. ఇప్పుడు వీరి జాబితాలోకి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా చేరాడు. ఈ సంక్రాంతికి విడుదలైన `అనగనగా ఒక రాజు` మూవీకి స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించి అందరిని ఆశ్చర్యపరిచాడు. జనవరి 14న విడుదలై ఈ మూవీ హిట్ టాక్‌ని సొంతం చేసుకుని విజయవంతంగా రన్నవుతోంది. ఇలా యంగ్ హీరోలు హిట్టు బొమ్మ కోసం తామే రైటర్లుగా అవతారం ఎత్త హిట్‌లు కొడుతుండటంతో రానున్న రోజుల్లో ఈ ట్రెండ్ మరింతగా విస్తరించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ ప్రముఖుల్లో వినిపిస్తోంది.
