Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరోల పెళ్లిళ్లు.. ట్రెండ్ మారుతుందా?

టాలీవుడ్‌ లో ఒకప్పుడు పెళ్లి వేడుకలు అంటే సినీ పరిశ్రమ మొత్తం ఒకేచోట చేరినట్టే ఉండేది.

By:  M Prashanth   |   8 April 2026 4:23 PM IST
టాలీవుడ్ హీరోల పెళ్లిళ్లు.. ట్రెండ్ మారుతుందా?
X

టాలీవుడ్‌ లో ఒకప్పుడు పెళ్లి వేడుకలు అంటే సినీ పరిశ్రమ మొత్తం ఒకేచోట చేరినట్టే ఉండేది. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు.. ఎవ్వరినీ మినహాయించకుండా అందరికీ ఆహ్వానం అందేది. ఆ వేడుకలు ఒక రకంగా ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ ఈవెంట్స్ గా మారిపోయేవి. కానీ కాలం మారుతున్న కొద్దీ ఆ ట్రెండ్ కూడా క్రమంగా మారుతోంది.

ఇటీవలి కాలంలో యంగ్ హీరోలు తమ పెళ్లిళ్ల విషయంలో చాలా పరిమిత వర్గానికే ఇన్విటేషన్స్ ఇస్తున్నారని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గత ఆరు నెలల్లో పెళ్లి చేసుకున్న లేదా నిశ్చితార్థం చేసుకున్న పలువురు హీరోలు తమ వివాహ వేడుకలను చాలా ప్రైవేట్‌ గా నిర్వహించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారింది. వీరు పెళ్లికి మాత్రం అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితులకే ఆహ్వానం ఇచ్చారని తెలుస్తోంది.

అయితే అదే సమయంలో రిసెప్షన్ కార్యక్రమాలకు మాత్రం పెద్ద ఎత్తున సినీ ప్రముఖులను ఆహ్వానించడం గమనార్హం. అంటే పెళ్లి వేడుకను వ్యక్తిగతంగా, కుటుంబానికి మాత్రమే పరిమితం చేసి, తర్వాత జరిగే విందు కార్యక్రమాన్ని ఇండస్ట్రీతో పంచుకోవాలని ప్రస్తుతం జెనరేషన్ హీరోలు భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

ఆ విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో మిక్స్డ్ రెస్పాన్సులు వస్తున్నాయి. కొందరు ఆ విధానాన్ని సమర్థిస్తున్నారు. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం కాబట్టి దాన్ని సింపుల్‌ గా, క్లోజ్డ్ సర్కిల్‌ లో నిర్వహించడం సరైన నిర్ణయమేనని అంటున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన వేడుకలు ఎక్కువగా ప్రచారం, హంగామా, భద్రతా సమస్యలతో కూడుకుని ఉంటాయి. అందుకే ప్రైవసీ కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సహజమేనని వారి అభిప్రాయం.

మరోవైపు మరికొందరు మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ ఒక కుటుంబంలా భావించే సంప్రదాయం క్రమంగా తగ్గిపోతోందని, కొత్త తరం హీరోలు మరింత క్యాల్కులేటెడ్ గా మారుతున్నారని విమర్శిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎదగడానికి సహకరించిన పలువురు ప్రముఖులను పెళ్లి వంటి ముఖ్యమైన వేడుకలకు ఆహ్వానించకపోవడం సరైన పద్ధతి కాదని వారు అంటున్నారు.

ఇంకా కొందరి అభిప్రాయం ప్రకారం, సోషల్ మీడియా ప్రభావం కూడా మార్పుకు ఒక కారణం. పెళ్లి వేడుకలు లైవ్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోలతో వెంటనే వైరల్ అవుతున్న నేపథ్యంలో.. పర్సనల్ ప్రైవసీ కాపాడుకోవడానికి సెలబ్రిటీలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని భావిస్తున్నారు. మొత్తం మీద చూస్తే, టాలీవుడ్‌ లో పెళ్లి వేడుకల ట్రెండ్ క్రమంగా మారుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు పెద్ద ఎత్తున జరిగే వేడుకల నుంచి ఇప్పుడు క్లోజ్డ్, ప్రైవేట్ సెలబ్రేషన్స్ వైపు హీరోలు మొగ్గు చూపుతున్నారు. అయితే ఆ మార్పు ఎంతవరకు కొనసాగుతుంది? భవిష్యత్తులో మళ్లీ పాత సంప్రదాయాలు వస్తాయా? లేదా అన్నది చూడాల్సి ఉంది.