Begin typing your search above and press return to search.

ఫ్యాన్సీ కథల వైపు కుర్ర హీరోల మొగ్గు!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. గతంలో యంగ్ హీరోలు అంటే లవ్ స్టోరీలు, మాస్ మసాలా యాక్షన్ సినిమాలకే పరిమితం అయ్యేవారు.

By:  Srikanth Kontham   |   8 May 2026 5:00 PM IST
ఫ్యాన్సీ కథల వైపు కుర్ర హీరోల మొగ్గు!
X

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. గతంలో యంగ్ హీరోలు అంటే లవ్ స్టోరీలు, మాస్ మసాలా యాక్షన్ సినిమాలకే పరిమితం అయ్యేవారు. కానీ మారుతోన్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా టాలీవుడ్ కుర్ర హీరోలు రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌ను పక్కన బెడుతున్నారు. ఫాంటసీ, పీరియాడిక్ డ్రామాలు , స్పిరిచువల్ అంశాలతో కూడిన కథల వైపు ఎక్కువ‌గా మొగ్గు చూపుతున్నారు. బాక్సాఫీస్ వద్ద వినోదం మాత్రమే కాదు. ప్రేక్ష కుడికి ఓ కొత్త అనుభూతిని ఇచ్చే ప్రయత్నంలో ఈ ప్రయోగాలు కనిపిస్తున్నాయన్న‌ది కాద‌న‌లేని నిజం.

ఈ మార్పుకు ప్రధాన కారణం `కార్తికేయ 2`, `హనుమాన్` వంటి చిత్రాలు సాధించిన సంచలన విజయాలేన‌ని చెప్పొచ్చు . నిఖిల్ నటించిన `కార్తికేయ 2` భారతీయ పురాణాలను, అడ్వెంచర్‌ను జోడించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన `హనుమాన్` చిత్రం చిన్న సినిమాగా వచ్చి జాతీయ స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ విజయాలు యంగ్ హీరోల్లో బ‌ల‌మైన‌ నమ్మకాన్ని నింపాయి. పురాణాలు, ఆధ్యాత్మికత కలగలిసిన కథలకు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని ఈ చిత్రాలు నిరూపించాయి.

కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాకుండా పీరియాడిక్ డ్రామాలకు కూడా మంచి డిమాండ్ ఉంది. గత కాలపు నేపథ్యం, అప్పటి జీవనశైలిని ప్రతిబింబించే కథలు ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రప్పిస్తున్నాయి. నాని నటించిన `శ్యామ్ సింగరాయ్` , దుల్కర్ సల్మాన్ `సీతారామం` వంటి చిత్రాలు పీరియాడిక్ డ్రామాలుగా వచ్చి పెద్ద హిట్ అయ్యాయి. దీంతో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, అడివి శేష్ వంటి యంగ్ హీరోలు కూడా తదుపరి చిత్రాల్లో ఏదో ఒక వైవిధ్యమైన నేపథ్యం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. సాంకేతికత పెరగడం కూడా హీరోలు ఇలాంటి ఫ్యాంటసీ కథలను ఎంచుకోవడానికి మ‌రో కారణంగా చెప్పొచ్చు.

విజువల్ ఎఫెక్ట్స్ , గ్రాఫిక్స్ అందుబాటులోకి రావడంతో ఊహాజనిత ప్రపంచాలను తెరపై ఆవిష్కరించడం సులభతరమైంది. సూపర్ హీరో కథలు, పునర్జన్మలు లేదా టైమ్ ట్రావెల్ కు సంబంధించిన అంశాలను యంగ్ హీరోలు ధైర్యంగా ఎంచుకుంటున్నారు. కేవ‌లం ఫైట్లు, డ్యాన్సులు ఉంటే సరిపోదని కథలో లార్జర్ దన్ లైఫ్ ఎలిమెంట్ ఉండాలని భావిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను చూస్తే పాన్-ఇండియా అప్పీల్ ఉన్న కథలకే ప్రాధాన్యత పెరిగింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు స్థానిక ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకోగలవు.

కానీ ఫ్యాంటసీ , స్పిరిచువల్ కథలకు దేశవ్యాప్త గుర్తింపు పొందే అవకాశం ఉంది. అందుకే యువ హీరోలు కెరీర్ రిస్క్‌లో పడినా సరే భారీ బడ్జెట్ చిత్రాలకు సై అంటున్నారు. టాలీవుడ్ యంగ్ హీరోల కొత్త ఆలోచ‌న‌లు పరిశ్రమకు కొత్త ఊపిరి పోస్తోంది. పాతకాలపు మూస ధోరణిని వీడి సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తూ చేస్తోన్న‌ ప్రయత్నాలు ప్రశంసనీయం. ప్రేక్షకులు కూడా రొటీన్ సినిమాల కంటే కొత్తదనం ఉన్న కథలనే ఆదరిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే తెలుగు సినిమా స్థాయి గ్లోబల్ మ్యాప్‌లో మరింత ఎత్తుకు ఎదగడం ఖాయం. యంగ్ హీరోల సాహసోపేతమైన నిర్ణయాలే భవిష్యత్తు టాలీవుడ్ విజయాలకు పునాది కానున్నాయి.