యంగ్ హీరోలు సక్సెస్ ట్రాక్ ఎక్కేదెప్పుడు?
టాలీవుడ్ లోని యంగ్ హీరోలు కేవలం హీరోల్లానే కాకుండా వేరే హీరోలు నటించే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లానూ నటించి ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 17 Dec 2025 5:00 AM ISTటాలీవుడ్ లోని యంగ్ హీరోలు కేవలం హీరోల్లానే కాకుండా వేరే హీరోలు నటించే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లానూ నటించి ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పలు టాలెంటెడ్ హీరోలు ఈ యాంగిల్ లో ప్రయత్నాలు చేసి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే వారంతా ఎంత టాలెంట్ కనబరుస్తున్నప్పటికీ వారికి మాత్రం చెప్పుకోదగ్గ సక్సెస్ అందడం లేదు.
యాక్టింగ్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న సత్యదేవ్
వారిలో సత్యదేవ్ మొదటి వరుసలో ఉంటారు. చిన్న క్యారెక్టర్ తో టాలీవుడ్ లో జర్నీని మొదలుపెట్టిన సత్యదేవ్ ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మి మూవీతో లైమ్ లైట్ లోకి వచ్చారు. హీరోగా సత్యదేవ్ ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బ్లఫ్ మాస్టర్, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య లాంటి సినిమాలైతే సత్య కెరీర్ కు ఎంతో ఊపందించాయి. మధ్యలో చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ లో విలన్ గా నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన లక్ ను పరీక్షించుకుంటూనే మరోవైపు హీరోగా కూడా ప్రయత్నాలు చేస్తూ కెరీర్ లో ముందుకెళ్లాలని చూస్తున్న సత్యదేవ్ ఇప్పుడు రావు బహదూర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
అఖండ2 లో విలన్ గా మెప్పించిన ఆది పినిశెట్టి
ఇక ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. రవి రాజా పినిశెట్టి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది, ఆ తర్వాత తన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొన్నా మధ్య రంగస్థలం సినిమాలో హీరోకి అన్న పాత్రలో నటించి మెప్పించిన ఆది, ఇప్పుడు డ్రైవ్ అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ2 లో విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆదికి అఖండ2 తర్వాత మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.
అవకాశాలున్నాయి కానీ..
అందాల రాక్షసి మూవీతో ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర ఆ తర్వాత హీరోగా కొన్ని ప్రయత్నాలైతే చేశారు కానీ అవేవీ పెద్దగా కలిసిరాలేదు. అయితే సక్సెస్ తో సంబంధం లేకుండా నవీన్ వెంటవెంటనే సినిమాలనైతే లైన్ లో పెడుతున్నారు కానీ వాటితో స్టార్‌డమ్ ను మాత్రం అందుకోలేకపోతున్నారు. నవీన్ కు టాలెంట్, అందం అన్నీ ఉన్నప్పటికీ అతనికి లైఫ్ లో సక్సెస్ మాత్రం ఇంకా చేరువవడం లేదు.
వీరు మాత్రమే కాకుండా ఈ లిస్ట్ లో కార్తికేయ కూడా ఉన్నారు. ఆరెక్స్ 100 మూవీతో హీరోగా సక్సెస్ ను అందుకున్న కార్తికేయ ప్రస్తుతం ఓ వైపు హీరోగా మరోవైపు విలన్ గా పాత్రలు చేస్తూ తన కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్నారు. ఎలాంటి క్యారెక్టర్ లోనైనా కార్తికేయ ఇట్టే ఇమిడిపోయి ఆడియన్స్ ను ఎంగేజ్ చేయగలరు. అందుకే కార్తికేయకు అవకాశాల పరంగా ఎలాంటి లోటు లేదు కానీ అతనికి కూడా ఓ సాలిడ్ హిట్ పడితేనే సక్సెస్ ట్రాక్ ఎక్కగలరు. వీరు కాకుండా సందీప్ కిషన్ కూడా ఇలానే ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతర హీరోల సినిమాల్లో నటిస్తూ తన మార్కెట్ ను పెంచుకుంటున్నారు. మరి వీరందరికీ సరైన సక్సెస్ దక్కి ఎప్పుడు లైమ్ లైట్ లోకి వస్తారో చూడాలి.
