4 ప్రతిపాదనలు.. ఫెడరేషన్ కు ఫిలిం ఛాంబర్ లేఖ
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కార్మికుల వేతనాల అంశం కొన్నాళ్లుగా హాట్ టాపిక్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 17 Aug 2025 12:37 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కార్మికుల వేతనాల అంశం కొన్నాళ్లుగా హాట్ టాపిక్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 30 శాతం పెంపు కోరుతూ ఫిలిం ఫెడరేషన్ ఇప్పటికే బంద్ కు పిలుపునిచ్చింది. ఫిలిం ఛాంబర్ కూడా షూటింగ్స్ జరపవద్దని ఆదేశించింది. దీంతో సినిమాలు, వెబ్ సిరీస్ ల చిత్రీకరణలు నిలిచిపోయాయి.
అయితే ఇప్పటికే వేతనాల పెంపు అంశంపై ఫిలిం ఫెడరేషన్ సభ్యులు, కార్మిక నాయకులతో నిర్మాతలు చర్చలు జరిపినా లాభం లేకుండా పోయింది. సమ్మె అంశం కొలిక్కి రాలేదు. దీంతో మెగాస్టార్ చిరంజీవి వద్దకు పంచాయతీ చేరింది. అదే సమయంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేడు కీలక నిర్ణయాలు తీసుకుంది.
అంతే కాదు.. నాలుగు ప్రధాన షరతులతో కూడిన లేఖను ఫిలిం ఫెడరేషన్ కు పంపింది. పర్సంటేజ్ విధానాన్ని కూడా అందులో వివరించింది. దీంతో ఛాంబర్ ప్రతిపాదనలపై సోమవారం ఫిలిం ఫెడరేషన్ కు చెందిన 24 యూనియన్లు సమావేశమవ్వనున్నాయి. ఛాంబర్ నిర్ణయాలు, ప్రతిపాదనలపై చర్చించనున్నాయి.
ఫిలిం ఛాంబర్ షరతులు విషయానికొస్తే.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.. అంటే 12 గంటల వర్క్ ను ఒక కాల్ షీట్ గా మాత్రమే పరిగణించాలని ఫిలిం ఛాంబర్ తెలిపింది. ప్రతి నెలలో రెండో ఆదివారంతోపాటు కార్మిక శాఖ ప్రకటించిన సెలవు దినాల్లో మాత్రమే రెట్టింపు వేతనం చెల్లించాలని చెప్పింది.
2022 జులై నెలలో ఇప్పటికే చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఫైటర్స్, డాన్సర్స్ కోసం నిర్ణయించిన రేషియోలను 2023 సెప్టెంబర్ నెల నుంచి అమలు చేయడం లేదని తెలిపింది. అందుకే దాన్ని తప్పనిసరిగా పాటించాలని చెప్పింది. ఆ ఒప్పందంలోని జనరల్ కండిషన్స్ క్లాజ్ 1 ప్రకారం, తమ మూవీ అవసరాలకు గాను నైపుణ్యం ఉన్న ఏ వ్యక్తినైనా సెలెక్ట్ చేసుకునే స్వేచ్ఛ నిర్మాతలకు ఉండాలని ప్రతిపాదించింది.
ఆ నాలుగు షరతులను అంగీకరిస్తే, కార్మికుల వేతనాలు పెంచడానికి నిర్మాతలు వెంటనే సిద్ధంగా ఉన్నారని ఫిలిం ఛాంబర్.. లేఖలో ఫిలిం ఫెడరేషన్ కు తెలిపింది. అయితే రోజుకు రూ. 2000 లేదా అంతకంటే తక్కువగా ఆర్జించే కార్మికులకు మొదటి ఏడాది 10 శాతం, తర్వాత రెండేళ్లకు అదనంగా 5 శాతం చొప్పున వేతనాలు పెంచడానికి నిర్మాతలు ఇప్పటికే ప్రతిపాదించారు.
రోజుకు రూ. 2000-రూ. 5000 మధ్య సంపాదించుకునే వారికి మూడు సంవత్సరాల పాటు ఏటా 5 శాతం చొప్పున వేతన పెంచుతామని చెప్పారు. కానీ తక్కువ బడ్జెట్ చిత్రాలకు మాత్రం వేతన పెంపు నిబంధనలు వర్తించవని తెలిపారు. ప్రస్తుత వేతనాలు అమల్లో ఉంటాయి. అయితే ఇప్పుడు ఫిలిం ఛాంబర్ నుంచి వచ్చిన లేఖపై ఫిలిం ఫెడరేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
