Begin typing your search above and press return to search.

కార్మికుల సమ్మె.. ఆ రెండింటి దగ్గరే ఆగిపోతుంది!

కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికులు తమ వేతనాలు పెంచాలన్న డిమాండ్ తో .. కొన్నిరోజులుగా షూటింగ్ లు బంద్ చేసి సమ్మె చేస్తున్నారు.

By:  M Prashanth   |   16 Aug 2025 1:30 AM IST
కార్మికుల సమ్మె.. ఆ రెండింటి దగ్గరే ఆగిపోతుంది!
X

కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికులు తమ వేతనాలు పెంచాలన్న డిమాండ్ తో .. కొన్నిరోజులుగా షూటింగ్ లు బంద్ చేసి సమ్మె చేస్తున్నారు. ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఇప్పటికే నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ.. అవి సఫలం కాలేదు. దీంతో ఈ సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. అందుకే తాజాగా ఇదే వ్యవహారంపై నిర్మాతలు సమావేశం అయ్యారు.

ఈ మీట్ కు నిర్మాత వివేక్ కూచిభొట్ల, రాధా మోహన్, మైత్రీ మూవీ మేకర్స్ చెర్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము కార్మికులకు వ్యతిరేకం కాదని, అది చెప్పడానికే మాట్లాడుతున్నట్లు తెలిపారు. అలాగే నిర్మాతలు ఇప్పటికే కార్మికుల ముందు ఉంచిన నాలుగు ప్రతిపాదనలను అంగీకరిస్తే వేతనాల పెంపుపై మాట్లాడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, దానిపై మాట్లాడేందుకు రెడీ అన్నారు.

అయితే ఈ నాలుగు ప్రతిపాదనల్లో గతంలోనే 2022లో రెండింటికి కార్మికులు ఒప్పుకున్నారని.. ఇంకో రెండింటి దగ్గరే అసలు సమస్య ఉందని అన్నారు. దీనిపైనే పలుమార్లు చర్చలు జరిగినట్లు చెప్పారు. టాలెంట్ ఉన్న వాళ్లను ఎవరినైనా సరే నియమించుకునే ఛాన్స్, డాన్సర్లు, ఫైటర్లు రేషియో లేకుండా చూడడం అనే రెండు ప్రతిపాదనలకు కార్మికులు ఒప్పుకున్నారు.

ఇక మరో రెండు ప్రతిపాదనలపైనే డైలమా కొనసాగుతోంది. అందులో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉన్న కాల్షీట్‌ తో పాటు.. ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా అమలు చేయాలి. అలాగే ఆదివారం డబుల్ కాల్షీట్ లేకుండా చూడటం (రెండో ఆదివారం, ప్రభుత్వం ప్రకటించిన హాలీడేలకు డబుల్ కాల్ షీట్) అనే ప్రతిపాదనలపై చర్చలు సాగుతున్నాయి.

అయితే మరోవైపు కార్మికులు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులు చూడాలని.. ఇకనైనా కాస్త అర్థం చేసుకుని నిర్మాతలకు సహకరించాలని ప్రొడ్యూసర్లు కోరారు. కాగా, ఈ అంశంపై ఇప్పటికే జరిగిన చర్చల్లో కార్మికులకు వేతన పెంపుపై నిర్మాతలు ఓకే చెప్పారు. కానీ, ఇది కొన్ని షరతులతో మాత్రమే అని స్పష్టం చేశారు. కానీ, నిర్మాతలు విధించిన షరతులకు ఒప్పుకొనేది లేదని ఫెడరేషన్‌ నాయకులు తేల్చి చెప్పారు.దీంతో సమ్మె కొనసాగుతోంది.