థియేటర్ల రంగంపై మరో వివాదం.. టాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎగ్జిబిషన్ (థియేటర్ల) రంగం చుట్టూ ఉన్న సమస్యలు ఇప్పుడు ఒక్కొక్కటిగా పెద్ద పంచాయితీలుగా మారుతున్నాయి.
By: Sivaji Kontham | 30 Jun 2026 5:00 AM ISTతెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎగ్జిబిషన్ (థియేటర్ల) రంగం చుట్టూ ఉన్న సమస్యలు ఇప్పుడు ఒక్కొక్కటిగా పెద్ద పంచాయితీలుగా మారుతున్నాయి. ఇటీవలే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడకు సంబంధించి అద్దె (రెంటల్) విధానం స్థానంలో కలెక్షన్ల ఆధారంగా `పర్సంటేజీ` విధానాన్ని అమలు చేయాలంటూ థియేటర్ల యజమానులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమస్య తీవ్రమవ్వడంతో ఇండస్ట్రీ పెద్దలైన మెగాస్టార్ చిరంజీవి వంటి వారు రంగంలోకి దిగి దీనిపై ప్రత్యేకంగా నియమించిన కమిటీ జూన్ 30 నాటికి పరిశోధించి ఇచ్చే నివేదిక - సూచనలను పాటించాలని థియేటర్ల యాజమాన్యాలకు సూచించారు. ఇటు నిర్మాతల వైపు నుండి కూడా ఈ ప్రతిపాదనకు ప్రాథమిక అంగీకారం లభించడంతో రేపటి (జూన్ 30) కమిటీ నిర్ణయంపై అందరి దృష్టి నెలకొంది.
అయితే ఈ పర్సంటేజీ వివాదం నడుస్తుండగానే, ఇప్పుడు థియేటర్ల రంగంపై మరో సరికొత్త నిరసన జ్వాల మొదలైంది. వర్చువల్ ప్రింట్ ఫీజు (VPF) రూపంలో డిజిటల్ కంటెంట్ సర్వీస్ ప్రొవైడర్లు వసూలు చేస్తున్న భారీ చార్జీలను తక్షణమే తగ్గించాలంటూ చిన్న, స్వతంత్ర చిత్రాల నిర్మాతలు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ వేదికగా తిరుగుబాటు ఎగరేశారు. నిరంతరం పెరుగుతున్న ఈ వీపీఎఫ్ ఖర్చులు, థియేటర్లు దొరకని దారుణమైన పరిస్థితులు చిన్న బడ్జెట్ సినిమాలను - స్వతంత్ర సినిమా రంగాన్ని కోలుకోలేని విధంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయని చిన్న నిర్మాతలు ఆరోపిస్తున్నారు.
ఈ నిరసన సందర్భంగా చిన్న నిర్మాతలు గతంలో జరిగిన ఒప్పందాలను గుర్తు చేస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిజికల్ ఫిల్మ్ ప్రింట్ల స్థానంలో సరికొత్తగా `డిజిటల్ ప్రొజెక్షన్ టెక్నాలజీ` అందుబాటులోకి వచ్చిన కొత్తలో.. డిజిటల్ కన్వర్షన్ కోసం పెట్టే ఈ చార్జీలు తాత్కాలికమేనని, భవిష్యత్తులో వీటిని పూర్తిగా రద్దు చేస్తామని నిర్మాతలకి గట్టి హామీ ఇచ్చారని వారు గుర్తుచేశారు. కానీ ఆ సాంకేతికత వచ్చి దశాబ్దం దాటిపోయినా, డిజిటల్ కంటెంట్ సర్వీస్ ప్రొవైడర్లు మాత్రం నేటికీ అగ్రిమెంట్ల సాకుతో భారీ మొత్తంలో వీపీఎఫ్ చార్జీలను వసూలు చేస్తూనే ఉన్నారని... ఇది ముమ్మాటికీ చిన్న నిర్మాతలను శ్రమదోపిడీ చేయడమేనని మండిపడ్డారు.
పొరుగున ఉన్న ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ దోపిడీ మరీ ఎక్కువగా ఉందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాల్లో కేవలం నామమాత్రపు చార్జీలు మాత్రమే వసూలు చేస్తుంటే.. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌లలో మాత్రం ఒక్కో థియేటర్‌కు వారానికి ఏకంగా 10,000 నుండి 15,000 వరకు బలవంతంగా వసూలు చేస్తున్నారని చిన్న నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ బడ్జెట్ సినిమాలకు ఈ మొత్తం పెద్ద భారం కాకపోయినా... పరిమిత వనరులతో సినిమా తీసే చిన్న నిర్మాతలకు ఇది ఇండస్ట్రీలోనే అతిపెద్ద ఆర్థిక శాపంగా మారిందని వారు ధ్వజమెత్తారు.
దీనికి తోడు డిజిటల్ ప్రొవైడర్ల నియంతృత్వ పోకడల వల్ల చిన్న నిర్మాతలు రెట్టింపు నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోందని ఆరోపించారు. థియేటర్లలో సినిమా విడుదలైన కొన్ని రోజులకే.. ఆయా స్క్రీన్ల నుండి సినిమాను తొలగించినా తాము ముందుగా చెల్లించిన వీపీఎఫ్ చార్జీలను మాత్రం సర్వీస్ ప్రొవైడర్లు ఎంతమాత్రం రీఫండ్ చేయడం లేదని వారు వాపోయారు. థియేటర్ల గుత్తాధిపత్యం, రీఫండ్ లేని వీపీఎఫ్ చార్జీల వల్ల చిన్న సినిమాలు విడుదలైన మొదటి రోజే చచ్చిపోతున్నాయని, ప్రభుత్వం - ఫిలిం చాంబర్ వెంటనే జోక్యం చేసుకుని ఈ వీపీఎఫ్ చార్జీలను నియంత్రించకపోతే టాలీవుడ్‌లో చిన్న సినిమా అనేదే కనిపించకుండా పోతుందని చిన్న నిర్మాతలు హెచ్చరిస్తున్నారు. నిర్మాతలు ప్రసన్నకుమార్, ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు ఛాంబర్ ఎదుట నిరసనలో పాల్గొన్నారు.
