Begin typing your search above and press return to search.

ఫ‌స్ట్ పార్ట్‌ని మించి సీక్వెల్స్ మెప్పిస్తాయా?

బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌లుగా నిలిచిన సినిమాలకు ఈ ఏడాది సీక్వెల్స్ రానున్నాయి. ఇప్పుడు అంద‌రి దృష్టి వాటిపై ప‌డింది.

By:  Sivaji Kontham   |   3 Feb 2026 12:07 PM IST
ఫ‌స్ట్ పార్ట్‌ని మించి సీక్వెల్స్ మెప్పిస్తాయా?
X

ఎప్పుడూ తెలుగు ప్రేక్ష‌కుడు విన‌ని పేరు ఇప్పుడు అత్య‌ధికంగా వినిపిస్తోంది అదే సీక్వెల్‌. అప్ప‌ట్లో ఒక పార్ట్‌తో ఎండ్ కార్డ్ వేసే ద‌ర్శ‌కులు ఇప్పుడు మాత్రం దానికి రెండు మూడైనా స‌రే తీసేస్తామంటూ సీక్వెల్స్‌పై అధికాస‌క్తి చూపిస్తున్నారు. ప్రేక్ష‌కుల్లో క్యూరియాసిటీని పెంచేస్తున్నారు. ప్రేక్ష‌కులు కూడా ఒక్క పార్ట్‌తో సంతృప్తి చెంద‌కుండా మ‌రిన్ని సీక్వెల్స్ వ‌స్తే బాగుంటుంద‌నే ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తుండ‌టంతో మేక‌ర్స్‌లోనూ ఇప్పుడిది ఓ ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు ఏ డైరెక్ట‌ర్‌, హీరో,ప్రొడ్యూస‌ర్‌ని క‌దిలించినా సీక్వెల్స్ జ‌ప‌మే చేస్తున్నారు.

బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌లుగా నిలిచిన సినిమాలకు ఈ ఏడాది సీక్వెల్స్ రానున్నాయి. ఇప్పుడు అంద‌రి దృష్టి వాటిపై ప‌డింది. ఇందులో దృష్యం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలి. ఇదొక క్రైమ్ థ్రిల్ల‌ర్‌..కానీ ఎక్క‌డా ఆడియ‌న్‌కి ఇబ్బందిక‌రంగా అనిపించ‌దు..కార‌ణం ఇదొక ఫ్యామిలీ ఎమోష‌న్స్ నేప‌థ్యంలో సాగే థ్రిల్ల‌ర్ కాబ‌ట్టి. దృశ్యంతో ఆక‌ట్టుకున్న వెంక‌టేష్ ఆ త‌రువాత `దృశ్యం 2`తోనూ అంతే ఫీల్‌ని క‌లిగించారు. ఇప్పుడు అదే మ్యాజిక్‌ని `దృశ్యం 3`తోనూ రిపీట్ చేయాల‌ని భావిస్తున్నారు.

ఇప్ప‌టికే మ‌ల‌యాళ వెర్ష‌న్ పూర్త‌యి రిలీజ్‌కు రెడీ అవుతుండ‌గా, హిందీ వెర్ష‌న్ షూటింగ్ ద‌శ‌లో ఉంది. పార్ట్ 2ని ఎక్క‌డా ముగించారో అక్క‌డి నుంచే పార్ట్ 3ని స్టార్ట్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో హిందీ వెర్ష‌న్ రిలీజ్ టైమ్ కైనా రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు జీతూ జోసెఫ్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇదే ఏడాది ప్ర‌భాస్ రెండు సీక్వెల్స్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అవి స‌లార్ 2, క‌ల్కి 2. ప్ర‌స్తుతం ఫౌజీ, స్పిరిట్ షూటింగ్‌లో ఉన్న ప్ర‌భాస్ త్వ‌ర‌లో `క‌ల్కి 2`ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడ‌ని తెలిసింది. దీని త‌రువాతే `స‌లార్ 2` కోసం రంగంలోకి దిగుతాడ‌ట‌.

ఎన్టీఆర్‌తో `డ్రాగ‌న్‌` మూవీ చేస్తున్న ప్ర‌శాంత్ నీల్ అది పూర్త‌యిన త‌రువాతే `స‌లార్ 2`కు డేట్స్ కేటాయిస్తాడ‌ట‌. అప్పుడే ఈ సీక్వెల్ ప‌ట్టాలెక్కుతుంద‌ని, ఆలోగా ప్ర‌భాస్ ఫౌజీ, స్పిరిట్‌ల‌తో పాటు `క‌ల్కి 2`ని కూడా పూర్తి చేసి దీని కోసం సిద్ధ‌మ‌వుతాడ‌ని ఇన్ సైడ్ టాక్‌. చాలా కాలంగా ఎన్టీఆర్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న మూవీ `దేవ‌ర 2`. కొర‌టాల శివ కూడా దీని కోస‌మే మ‌రో సినిమా చేయ‌కుండా ఎదురు చూస్తున్నాడు. ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసే ప‌నిలో ఉన్న కొర‌టాల శివ ఈ సీక్వెల్‌ని మేలో సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ని తెలిసింది. యంగ్ హీరో తేజ స‌జ్జ కూడా క్రేజీ స్టార్ల‌తో పోటీప‌డుతూ మూడు సీక్వెల్స్ కోసం రంగంలోకి దిగుతున్నాడు.

`జాంబిరెడ్డి 2`తో పాటు `జై హ‌ను మాన్`, `మిరాయ్ 2` సీక్వెల్స్‌ని ఈ ఏడాదే పూర్తి చేయ‌బోతున్నాడు. ఇందులో `జాంబిరెడ్డి 2`, `మిరాయ్ 2`ల‌ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించ‌నుంది. `జై హ‌నుమాన్‌`లో తేజ స‌జ్జ‌తో పాటు కీల‌క‌మైన టైటిల్ పాత్ర‌లో క‌న్న‌డ స్టార్ రిష‌బ్ షెట్టి న‌టించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ మొద‌లు పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మూడు సీక్వెల్స్‌ల‌లో ఏది ఈ ఏడాది ప్రేక్ష‌కుల ముందుకొస్తుంద‌న్న‌ది తెలియాల్సి ఉంది. విశ్వ‌క్‌సేన్‌, త‌రుణ్ భాస్క‌ర్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన `ఈ న‌గ‌రానికి ఏమైంది`కి త్వ‌ర‌లో సీక్వెల్ రానున్న విష‌యం తెలిసిందే.

`ఈఎన్ఈ రిపీట్‌` పేరుతో దీన్ని రూపొందిస్తున్నారు. ఫ‌స్ట్ పార్ట్‌ని మించిన వినోదంతో, అంత‌కు మించిన భారీ స్కేల్‌, సెట‌ప్‌తో ఈ సీక్వెల్ ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాష్క‌ర్ వెల్ల‌డించ‌డంతో ఈ సీక్వెల్‌పై అంద‌రిలోనూ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇదే రేసులో మ‌రో సీక్వెల్ కోసం కూడా ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు అదే `మ్యాడ్‌`. సితార నుంచి చాలా సైలెంట్‌గా వ‌చ్చిన మ్యాడ్ ఎంత హిట్ట‌యిందో అంద‌రికి తెలిసిందే. దానికి సీక్వెల్‌గా వ‌చ్చిన `మ్యాడ్ 2` అంత‌కు మించి స‌క్సెస్‌ని సాధించిన నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా `మ్యాడ్ జూనియ‌ర్స్‌` ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ప్ర‌స్తుతం ఇది షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇక ఇదే కోవ‌లో మరో సీక్వెల్ కూడా ప‌ట్టాలెక్క‌బోతోంది అదే `పొలిమేర 3`. రెండు భాగాలు స‌క్సెస్ కావ‌డంతో పార్ట్ 3ని పాన్ ఇండియా స్థాయిలో తెర‌పైకి తీసుకొచ్చే స‌న్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటు `పుష్ప 3`, కార్తికేయ 3, టిల్లు క్యూబ్, కేజీఎఫ్ 3 కూడా ప‌ట్టాలెక్కనున్నాయి. అయితే వీటికి ఇంకా స‌మ‌యం ఉండ‌టంతో మిగ‌తా వాటి కోసం అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పార్ట్ 1, 2ల త‌రహాలో సీక్వెల్స్ ఆక‌ట్టుకుంటాయా? అన్న చ‌ర్చ ఇప్పుడు అంద‌రిలో మొద‌లైంది. సీక్వెల్స్ అనుకున్న‌ట్టుగా ఆక‌ట్టుకోగ‌లిగితే మ‌రిన్ని సీక్వెల్స్ ప‌ట్టాలెక్క‌డం ఖాయం అని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.