మారుతోన్న సినిమా ఫార్మాట్!
గత పదేళ్ల కాలంలో టాలీవుడ్ సినిమా స్వరూపం అమాంతం మారిపోయింది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఒక పక్కా ఫార్ములా ఉండేది.
By: Srikanth Kontham | 1 April 2026 10:00 PM ISTగత పదేళ్ల కాలంలో టాలీవుడ్ సినిమా స్వరూపం అమాంతం మారిపోయింది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఒక పక్కా ఫార్ములా ఉండేది. కథ ఏదైనా సరే అందులో కచ్చితంగా ఆరు పాటలు, నాలుగు భారీ ఫైట్లు, కథతో సంబంధం లేని ఒక ప్రత్యేక కామెడీ ట్రాక్ ఉండాల్సిందేననే నిబంధన ఉండేది. వీటిని కమర్షియల్ ఎలిమెంట్స్ అని పిలిచేవారు. అప్పట్లో ఈ హంగులు లేకపోతే సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడటం కష్టమని దర్శక, నిర్మాతలు భావించేవారు. కానీ నేడు ఆ పాత టెంప్లేట్ కాలానుగుణంగా కనుమరుగవుతోంది.
ప్రస్తుత తరం దర్శకులు కథకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. కథా గమనానికి ఆటంకం కలుగుతుందనిపిస్తే స్టార్ హీరోల సినిమాల్లో కూడా పాటలను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. గతంలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్, ఐటమ్ సాంగ్ వంటివి తప్పనిసరిగా ఉండేవి. కానీ ఇప్పుడు కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తోనే సన్నివేశాలను పండిస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో మార్పు వచ్చింది. అనవసరమైన ఫైట్ల కంటే కథలో భాగంగా వచ్చే సహజ సిద్ధమైన పోరాటాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. మరో ఆసక్తికరమైన మార్పు సినిమా నిడివి విషయంలో కనిపిస్తోంది.
ఒకప్పుడు సినిమా అంటే రెండు గంటల నుంచి రెండున్నర గంటల లోపు ఉండాలని అంతకంటే ఎక్కువైతే ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారని ఒక నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఆ హద్దులు చెరిగిపోయాయి. కథలో దమ్ముంటే మూడు గంటలు కాదు. ఏకంగా నాలుగు గంటల నిడివి ఉన్నా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇటీవల వచ్చిన కొన్ని భారీ చిత్రాలే అందుకు నిదర్శనం. రీసెంట్ రిలీజ్ ధురంధర్ 2 దాదాపు నాలుగు గంటల నిడివితోనే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక్కడ నిడివి ముఖ్యం కాదు. ప్రేక్షకుడిని ఎంతవరకు ఎంగేజ్ చేశామన్నదే కీలకమని మేకర్స్ భావిస్తున్నారు.
ఈ మార్పుకు ప్రధాన కారణం ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పు. ఓటీటీల పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న దేశాల సినిమాలను, వెబ్ సిరీస్‌లను తెలుగు ప్రేక్షకులు వీక్షిస్తున్నారు. దీంతో వారి సినిమా పరిజ్ఞానం పెరిగిందని తెలుస్తోంది. రొటీన్ ఫార్ములా సినిమాల కంటే కొత్తదనం ఉన్న కథలనే వారు ఆదరిస్తున్నారు. లాజిక్ లేని ఫైట్లు, సందర్భం లేని పాటలు ఉంటే సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే దర్శకులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా మేకింగ్ స్టైల్‌లో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయి.
కథను కేవలం రెండు గంటల్లో ముగించేయకుండా దానికి తగిన స్పాన్ ఉంటే రెండు, మూడు భాగాలుగా విడగొట్టి చెప్పడానికి దర్శకులు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల కథలోని ప్రతి పాత్రకు న్యాయం చేసే అవకాశం లభిస్తోంది. అలాగే టెక్నికల్ పరంగా డీ-ఏజింగ్, విఎఫ్ఎక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతను వాడుతూ తెలుగు సినిమాను గ్లోబల్ స్టాండర్డ్స్‌కు తీసుకెళ్తున్నారు. టాలీవుడ్ కమర్షియల్ టెంప్లేట్ నుండి కంటెంట్ డ్రివెన్ సినిమాగా రూపాంతరం చెందింది. పాటలు, ఫైట్లు అనేవి ఇప్పుడు కేవలం అలంకారాలు మాత్రమే. కథే అసలైన ప్రాణం. ఈ కొత్త ఫార్మాట్ వల్ల దర్శకులకు తమ సృజనాత్మకతను చాటుకోవడానికి పూర్తి స్వేచ్ఛ లభిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ధోరణి మరింత పెరిగుతుంది. తెలుగు సినిమా ప్రపంచ సినిమా యవనికపై మరిన్ని రికార్డులను సృష్టించడం ఖాయం.
