Begin typing your search above and press return to search.

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

ఒకప్పుడు పరిమితంగా విడుదలైన డబ్బింగ్ సినిమాలకు ఇప్పుడు తెలుగులో మంచి ఆదరణ లభిస్తోంది. దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, అల్లు అరవింద్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి సంస్థలు ఇతర భాషల చిత్రాలను తెలుగులో విడుదల చేస్తున్నాయి. అయితే డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు కేటాయించడంతో తెలుగు చిన్న సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

By:  Ramesh Palla   |   18 Nov 2026 9:00 PM IST
డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!
X

ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలకు పెద్దగా క్రేజ్‌ ఉండేది కాదు. చాలా తక్కువ సినిమాలు మాత్రమే తెలుగులో భారీ విజయాలను సొంతం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. డైరెక్ట్‌ సినిమాలు వచ్చిన సమయంలో డబ్బింగ్‌ సినిమాల విడుదల ఉండేది కాదు. కానీ ఇప్పుడు తెలుగు డైరెక్ట్‌ సినిమాలకు పోటీగా డబ్బింగ్ సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇంతకు ముందు డబ్బింగ్ సినిమాలను చిన్న నిర్మాతలు, చిన్న నిర్మాణ సంస్థలు మాత్రమే తీసుకు వచ్చేవి. కానీ ఇప్పుడు డబ్బింగ్‌ సినిమాలను బడా నిర్మాతలు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. మంచి కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో పెద్ద నిర్మాతలు చిన్న డబ్బింగ్‌ సినిమాలను తెలుగులో విడుదల చేయడం ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయింది. ఆ నిర్మాత, ఈ నిర్మాత అని కాకుండా దాదాపు అందరు టాలీవుడ్‌ బడా నిర్మాతలు డబ్బింగ్‌ సినిమాలు విడుదల చేశారు.

రామాయణ, సీన్‌ సినిమాలతో దిల్‌ రాజు..

ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు రామాయణ సినిమాతో పాటు సూర్య హీరోగా నటించిన సీన్ సినిమాను డబ్‌ చేసి విడుదల చేయడం జరిగింది. ఈ రెండు సినిమాలతో దిల్‌ రాజుకు భారీ మొత్తంలో లాభం దక్కినట్లు తెలుస్తోంది. స్వయంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తనకు ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని తెచ్చి పెట్టాయని, తెలుగులో ఈ రెండు సినిమాలను విడుదల చేసినందుకు గర్వంగా ఉందని కూడా అన్నాడు. ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆ రెండు సినిమాల గురించి మాట్లాడటం ద్వారా దిల్‌ రాజు ఏ స్థాయిలో సినిమాలతో సక్సెస్‌ను దక్కించుకున్నాడో, ఏ స్థాయిలో సినిమాలకు వసూళ్లు నమోదు అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. దిల్‌ రాజు మాత్రమే కాకుండా టాలీవుడ్‌లో బడా నిర్మాణ సంస్థలుగా పేరున్న మైత్రి మూవీ మేకర్స్ వారు సైతం వరుసగా డబ్బింగ్‌ సినిమాలను తీసుకు వస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో...

మైత్రి మూవీ మేకర్స్ వారు ఒకవైపు పెద్ద పెద్ద సినిమాలను, వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తూ వందల కోట్ల వసూళ్లు రాబడుతూ ఉన్నారు. అయినా తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాలను ఇవ్వాలనే ఉద్దేశంతో తమిళ్‌, హిందీ, మలయాళ సినిమాలను తెలుగులో డబ్‌ చేసేందుకు ఎప్పుడూ రెడీగా ఉన్నారు. పోటీ ఎక్కువ ఉన్న సినిమాలను ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి అయినా క్వాలిటీగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలనే ఉద్దేశంతో మైత్రి మూవీ మేకర్స్ వారు డబ్బింగ్‌ సినిమాలపై ఆసక్తి కనబర్చడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక టాలీవుడ్‌ లెజెండ్రీ నిర్మాతగా పేరున్న అల్లు అరవింద్‌ సైతం కాంతార వంటి సూపర్‌ హిట్‌, డిఫరెంట్‌ కంటెంట్‌ మూవీస్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. మంచి సినిమాలు ఇతర భాషల్లో ఉంటే డబ్‌ చేసి తెలుగులో విడుదల చేయాలని ప్రస్తుతం పెద్ద నిర్మాతలు అనుకోవడం వల్ల కచ్చితంగా మంచి సినిమాలు టాలీవుడ్‌లో విడుదల అవుతున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లోనూ నాగవంశీ డబ్బింగ్‌ సినిమాలను రిలీజ్ చేయడంకు ఆసక్తి చూపిస్తున్నాడు.

టాలీవుడ్‌లో ఇతర భాషల సినిమాలు..

కన్నడ, మలయాళ, తమిళ సినిమాలు మాత్రమే కాకుండా హిందీ సినిమాలను సైతం టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్స్‌ డబ్‌ చేసి రిలీజ్ చేసేందుకు పోటీ పడుతున్నారు. టాలీవుడ్‌లో ఇప్పటికే భారీ బడ్జెట్‌ సినిమాలు ప్రతి ఏడాది వస్తూనే ఉన్నాయి. ఇతర భాషలతో పోల్చితే సక్సెస్‌ రేటు, వసూళ్లు టాలీవుడ్‌ సినిమాలకు ఎక్కువగా వస్తున్నాయి. అయినా కూడా డబ్బింగ్‌ సినిమాలకు టాలీవుడ్‌లో మంచి ఆధరణ ఉంది. తెలుగు ప్రేక్షకుల్లో డబ్బింగ్‌ సినిమాలకు ఉన్న ఆధరణ నేపథ్యంలో ప్రముఖ నిర్మాతలు ఇతర భాషల్లో వచ్చిన మంచి సినిమాలను డబ్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

మంచి సినిమా విడుదల చేశామన్న పేరుతో పాటు, ఈజీగా డబ్బులు ఎక్కువ రావడం డబ్బింగ్‌ సినిమాల వల్ల జరుగుతుంది. అందుకే బడా నిర్మాతలు డబ్బింగ్‌ సినిమాల విడుదలకు పోటీ పడుతున్నారు. ఇది మంచి పరిణామమే.. అయితే తెలుగు సినిమాలకు థియేటర్లు లేకుండా డబ్బింగ్‌ సినిమాలే విడుదల చేయడం మాత్రం న్యాయం కాదని కొందరు చిన్న నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత డబ్బింగ్‌ సినిమాలకు థియేటర్లను కేటాయించాలని కొందరు అంటున్నారు.