ఒక్కసారిగా సైలెంట్ అయిన ఆ నలుగురు!
టాలీవుడ్‌లో తమకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకుని.. ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయాలను అందించిన నలుగురు సీనియర్ దర్శకులు ఒక్కసారిగా సైలెంట్ అవ్వడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.
By: Srikanth Kontham | 29 Aug 2026 3:00 PM ISTటాలీవుడ్‌లో తమకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకుని.. ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయాలను అందించిన నలుగురు సీనియర్ దర్శకులు ఒక్కసారిగా సైలెంట్ అవ్వడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. శేఖర్ కమ్ముల, హరీష్ శంకర్, క్రిష్ జాగర్లమూడి , బోయపాటి శ్రీను.. నలుగురు దర్శకుల నుంచి తదుపరి చిత్రాలకు సంబంధించిన ప్రకటనలు రాకపోవడంతో అభిమానుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు వీరి సినిమా అనౌన్స్‌మెంట్ వస్తేనే ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున బజ్ ఏర్పడేది. కానీ ఇప్పుడు సైలెంట్‌గా ఉండటం గమనార్హం.
ఆ నలుగురు నుంచి గతంలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించకపోవడమే ఈ వ్యవధికి ఓ కారణం అన్నది కాదనలేని నిజం. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన `కుబేర` మేకింగ్ క్లాస్‌గా ఉన్నా? కమర్షియల్ రేంజ్ విస్తరించలేకపోయింది. హరీష్ శంకర్, బోయపాటి శ్రీను, క్రిష్ చిత్రాలు బాక్సాఫీస్ లెక్కల వద్ద నిరాశపరిచాయి. వరుస విజయాలతో దూసుకుపోయిన దర్శకులకు గతం లో ఎదురైన ఫలితాలు పెద్ద బ్రేక్ వేసాయి. దీంతో తదుపరి ప్రాజెక్ట్‌ల విషయంలో ఏమాత్రం తొందరపడకుండా కథల ఎంపికలో అత్యంత జాగ్రత్త వహిస్తున్నారు.
కొత్త కథలను సిద్ధం చేసుకోవడానికి సమయం కేటాయించడమే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల కాల్ షీట్ల కొరత కూడా వీరి ఆలస్యానికి మరొక కారణం. ప్రస్తుతం ఉన్న టైర్-1 స్టార్ హీరోలందరూ ఇప్పటికే తమ కమిట్‌మెంట్లతో వచ్చే రెండు మూడేళ్ల వరకు లాక్ అయిపోయారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు, భారీ బడ్జెట్ సినిమాలతో అగ్ర కథానాయకులందరూ బిజీగా ఉండటంతో ఈ దర్శకులు కాంబినేషన్లను సెట్ చేసుకోవడం సవాలుగా మారింది.
టైర్-2 .. టైర్-3 హీరోలతో సినిమాలు ప్లాన్ చేద్దామన్నా? అక్కడ కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. యంగ్ హీరోలు కూడా ఇప్పటికే వరుస ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బిజీగా ఉన్నారు. దీనికితోడు మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా వైవిధ్యమైన కథలతో వస్తేనే హీరోలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో సరైన స్క్రిప్ట్ వర్క్ పూర్తికాకుండా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించడం సాధ్యపడటం లేదు. అయితే ఈ సుదీర్ఘ విరామం .. సైలెన్స్ అనేది తాత్కాలికమే. ఒక విఫలం తర్వాత మరింత కసితో, బలంగా బౌన్స్ బ్యాక్ అవ్వడం టాలీవుడ్ దర్శకులకు కొత్తేమీ కాదు. రీ-ఎంట్రీలో బాక్సాఫీస్‌ను షేక్ చేసే బలమైన కంటెంట్‌తో రావడం కోసమే నలుగురు దర్శకులు వెనకడుగు వేసి లోతైన కథా రచనలో మునిగిపోయారని తెలుస్తోంది.
