టైర్ 2 హీరోల్లో కన్సిస్టెన్సీ లేదా?
నాని దగ్గర ఈ నిలకడ ఎక్కువగా కనిపించింది. 'దసరా', 'హాయ్ నాన్న', 'సరిపోదా శనివారం', 'హిట్ 3'తో వరుసగా మంచి ఫలితాలు అందుకున్నారు.
By: M Prashanth | 1 Nov 2026 12:00 AM ISTకొంతమంది హీరోల గత నాలుగైదు సినిమాల లిస్ట్ చూస్తే హిట్ ఎక్కడుందో వెతుక్కోవాల్సి వస్తోంది. అదే సమయంలో మరికొందరు ఒకదాని తర్వాత ఒకటి మంచి ఫలితాలు అందుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే వీళ్లందరినీ ఒకే టైర్ 2 జాబితాలో పెడుతున్నారు. సినిమాల బడ్జెట్లు, హీరోల క్రేజ్ దగ్గర పోలికలు ఉన్నా ఫలితాల్లో మాత్రం పెద్ద తేడా ఉంది.
నాని దగ్గర ఈ నిలకడ ఎక్కువగా కనిపించింది. 'దసరా', 'హాయ్ నాన్న', 'సరిపోదా శనివారం', 'హిట్ 3'తో వరుసగా మంచి ఫలితాలు అందుకున్నారు. ఒకే తరహా కథకు పరిమితం కాకుండా వేర్వేరు దర్శకులతో పనిచేశారు. అయితే 'ది ప్యారడైజ్'కు మిక్స్డ్ టాక్ వచ్చింది. భారీ ఓపెనింగ్ సాధించినా సెకండ్ హాఫ్‌పై విమర్శలు ఎదురయ్యాయి. నాని తీసిన ప్రతి సినిమా హిట్ అనడం కాదు. మిగతా వాళ్లతో పోలిస్తే ఆయన విజయాల మధ్య గ్యాప్ తక్కువ.
విజయ్ దేవరకొండ దగ్గర మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగానే ఉంది. 'లైగర్', 'ఖుషి', 'ఫ్యామిలీ స్టార్', 'కింగ్డమ్' ఆశించిన విజయాలు ఇవ్వలేదు. ఇటీవల వచ్చిన 'రణబాలి' కూడా మంచి ఓపెనింగ్ తర్వాత వసూళ్లలో నెమ్మదించింది. ఒక్కో సినిమాలో పాత్ర, నేపథ్యం మారుతున్నా ప్రేక్షకుల నుంచి ఒకే స్థాయిలో స్పందన రావడం లేదు. ఆయనకు క్రేజ్ లేదని కాదు. ఆ క్రేజ్‌ను వరుస విజయాలుగా మార్చుకోవడమే ఇబ్బందిగా మారింది.
రామ్‌కు 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత అదే స్థాయి విజయం దక్కలేదు. 'స్కంద', 'డబుల్ ఇస్మార్ట్' నిరాశపరిచాయి. మాస్ కథల నుంచి బయటకొచ్చి చేసిన 'ఆంధ్ర కింగ్ తాలూకా'కు మంచి అభిప్రాయాలే వచ్చాయి. కానీ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవని నిర్మాత స్వయంగా చెప్పారు. అంటే రామ్ విషయంలో కంటెంట్‌పై మంచి టాక్ వచ్చినా అది టికెట్ అమ్మకాలకు సరిపోవడం లేదు. ఆయన పరిస్థితి విజయ్ దేవరకొండతో పోలిస్తే కాస్త డిఫరెంట్.
నాగచైతన్య విషయానికి వస్తే.. మంచి కంటెంట్ ఉన్న హీరో. మామకు తరహాలోనే పాజిటివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. 'థాంక్యూ', 'కస్టడీ'తో నిరాశపరిచిన తర్వాత 'తండేల్'తో మంచి విజయం అందుకున్నారు. కానీ ఆ సినిమా తర్వాత చైతూకి మళ్ళీ గ్యాప్ కాస్త ఎక్కువే వచ్చింది. ఈసారి వృషకర్మతో రానున్నాడు. ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కాబట్టి ఈసారి హిట్ కొడితే ప్రేక్షకుల్లో నమ్మకం మరింత పెరగవచ్చు.
ఇప్పుడు కొందరు హీరోల కొత్త సినిమా అనౌన్స్ అయితే కథ ఏంటనే ఆసక్తికంటే, 'ఈసారైనా హిట్ వస్తుందా' అనే మాటే ముందుగా వినిపిస్తోంది. గత సినిమాల ఫలితాలు కొత్త ప్రాజెక్టులపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. నాని మాత్రం కొన్నేళ్లుగా జాగ్రత్తగా మార్కెట్ ను పెంచుకుంటూ ఆ కాన్సిస్టెన్సీ అయితే మెయింటేన్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ, రామ్‌లకు ఒక్క హిట్‌తో ఆ ప్రశ్నలు ఆగిపోవు. దాని తర్వాతి సినిమా కూడా నిలబడాలి. నాగచైతన్యకు మాత్రం గత విజయాన్ని కొనసాగించే అవకాశం ఇంకా ఉంది. చూడాలి మరి మన టైర్ 2 స్టార్స్ నెక్స్ట్ ఫలితాలు ఎలా ఉంటాయో.
