ఇండస్ట్రీ పెద్దలు టికెట్ ధరలు ఎక్కువేనని అంగీకరించినట్టేనా?
ఏదైనా పెద్ద సినిమా విడుదలవుతోంది అంటే మొదటి వారంలో టికెట్ ధరల్ని పెంచుకునేందుకు ప్రభుత్వాలే అధికారికంగా అనుమతులు మంజూరు చేస్తున్నాయి.
By: Sivaji Kontham | 5 Dec 2025 10:25 PM ISTఏదైనా పెద్ద సినిమా విడుదలవుతోంది అంటే మొదటి వారంలో టికెట్ ధరల్ని పెంచుకునేందుకు ప్రభుత్వాలే అధికారికంగా అనుమతులు మంజూరు చేస్తున్నాయి. ఈ వెసులుబాటుతో బెనిఫిట్ షోలు, పెయిడ్ ప్రివ్యూలు, మిడ్ నైట్ షోలు అంటూ రిలీజ్ ముందు భారీ మొత్తంలో ఆర్జించేందుకు దారి దొరుకుతోంది. ఆ తర్వాత కూడా మొదటి వారంలో పెద్ద మొత్తంలో టికెట్ ధరను నిర్ణయించి ప్రజల నుంచి ఎగ్జిబిటర్లు వసూలు చేస్తున్నారు. అయితే దీనిని కొందరు దోపిడీ అని అంటుంటే, మరికొందరు అధికారికంగా చేసేది తప్పు కాదని అంటుంటారు. సీపీఐ నారాయణ లాంటి నాయకులు కనీసం ఇప్పటికైనా పైరసీకి కారణమేమిటో, చేస్తున్న తప్పు ఏమిటో గ్రహించి సినిమా వాళ్లు మారాలని కూడా సూచించారు. వందమంది ఐబొమ్మ రవిలు పుట్టుకొస్తారని వార్నింగ్ ఇచ్చారు.
ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత సినిమా పైరసీపై ఎన్నడూ లేనంత విస్త్రతంగా చర్చ సాగుతోంది. అయితే రవి చేసినది తప్పు అని తెలిసినా కూడా మెజారిటీ ప్రజలు అతడికే మద్ధతుగా నిలిచారు. టికెట్ ధరలు అదుపు తప్పడం వల్లనే పైరసీలో సినిమాలు చూస్తున్నామని ప్రజలు బహిరంగంగా మీడియా ముందు చెబుతున్నారు.
తాజా ఇంటర్వ్యూలో పైరసీకి మద్ధతుగా నిలవడం సరికాదంటూ టాలీవుడ్ అగ్ర నిర్మాత, పంపిణీదారుడు డి.సురేష్ బాబు తన వాదనను వినిపించారు. ``జనానికి కోపం... టికెట్ రేట్లు ఎక్కువయ్యాయి కాబట్టే జనం పైరసీ చూస్తున్నారని అతడు సపోర్ట్ చేసాడు`` అంటూ ఒక వ్యక్తి గురించి మాట్లాడారు. మనం ఎవరు ఏం చేయొద్దంటే అదే చేస్తాము అని కూడా ఆయన వ్యంగ్యంగా అన్నారు. పైరసీ చూడొద్దంటే అదే చూస్తామని, సిగరెట్ తాగొద్దన్నా ఆ పని చేస్తామని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
డి.సురేష్ బాబు మాట్లాడుతూ.. ``ఈ రోజుల్లో సమాజం సిగ్మెంటెడ్.. మీరు ఓటీటీలో చూస్తున్నా అక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. మన స్వభావం ఏది చేయొద్దని అంటే అదే చేస్తాము. ఇంతకుముందు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. ప్రజలు కూడా పైరసీ చేసిన వ్యక్తులకు సపోర్టుగా మాట్లాడుతున్నారు.. జనానికి కోపం .. టికెట్ రేట్లు ఎక్కువయ్యాయి కాబట్టే పైరసీలో చూస్తున్నారని ఆ వ్యక్తి సపోర్ట్ చేసాడు. అదంతా అటుంచితే, మీ డేటాను దొంగిలించడం మీకు ఓకేనా? దాంతో మీరు వర్రీ అవ్వడం లేదా? అని ప్రశ్నించారు.
సిగరెట్లు తాగొద్దని ప్రతి సినిమాకి టైటిల్స్ ముందు రాస్తారు. ఒక శాతం మాత్రం అయినా మారతారనే ప్రయత్నం. కానీ ఎవరూ దానిని అనుసరించరు. ఒక మనిషిగా మనకు తెలుసు.. ఏది కరెక్ట్ ఏది కాదు? అనేది.. కానీ ఆచరణలో పెట్టము.. అని అన్నారు. అయితే డి.సురేష్ బాబు వెర్షన్ విన్న తర్వాత పైరసీకి కారణం అదుపు తప్పిన టికెట్ ధరలేనని సినీపరిశ్రమ పెద్దన్నలు అంగీకరించినట్టేనా? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు!
