టాలీవుడ్ బాక్సాఫీస్ గేమ్‌ను మార్చేసిన సరికొత్త రూల్!
ఒకప్పుడు కనీసం 50 నుండి 100 రోజులు ఉన్న ఈ విండో వ్యవధి, ఇప్పుడు కొన్ని వారాలకే పరిమితం కావడం టాలీవుడ్ సాంప్రదాయ బిజినెస్ మోడల్‌ను పూర్తిగా మార్చేస్తోంది.
By: Srikanth Kontham | 26 Jun 2026 11:25 AM ISTకొన్నేళ్లుగా టాలీవుడ్ పరిశ్రమలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అన్నింటికంటే ట్రేడ్ వర్గాలను - నిర్మాతలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న ప్రధాన అంశం `థియేట్రికల్ విండో` వ్యవధిలో వస్తున్న మార్పులు. ఒక సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత అది ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోకి రావడానికి మధ్య ఉండే సమయాన్నే థియేట్రికల్ విండో అంటారు. ఒకప్పుడు కనీసం 50 నుండి 100 రోజులు ఉన్న ఈ విండో వ్యవధి, ఇప్పుడు కొన్ని వారాలకే పరిమితం కావడం టాలీవుడ్ సాంప్రదాయ బిజినెస్ మోడల్‌ను పూర్తిగా మార్చేస్తోంది.
ఈ విండో కాలపరిమితి తగ్గడం వల్ల థియేట్రికల్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. సినిమా విడుదలైన మూడు-నాలుగు వారాల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అయిపోతుందనే అంచనా ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయింది. దీనివల్ల సాధారణ మధ్యతరహా చిత్రాలను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కేవలం వీకెండ్ కలెక్షన్లపైనే సినిమా భవితవ్యం ఆధారపడుతోంది. పాత రోజుల్లా లాంగ్ రన్ అనే పదాలకు ఇండస్ట్రీలో చోటు లేకుండా పోతోంది. ఫలితంగా మొదటి వారంలోనే గరిష్ట వసూళ్లు సాధించడం డిస్ట్రిబ్యూటర్లకు అత్యంత కీలకంగా మారుతొంది.
అయితే ఈ మార్పు టాలీవుడ్ నిర్మాతలకు ఒక రకంగా ఊరటనిస్తోంది. థియేట్రికల్ విండోను తగ్గించడానికి అంగీకరించినందుకు ఓటీటీ సంస్థలు భారీ మొత్తాన్ని ఫ్యాన్సీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. బడ్జెట్‌లో ఎక్కువ శాతం నాన్-థియేట్రికల్ రైట్స్ (డిజిటల్, శాటిలైట్) ద్వారానే రికవరీ అవుతుండటంతో నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్తున్నారు. డిజిటల్ విండో ఒప్పందాల వల్లే మేకర్స్ బడ్జెట్ పరిమితులను పెంచుతున్నారు. విజువల్స్ విఎఫ్ఎక్స్ పై భారీగా ఖర్చు పెట్టగలుగుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఓటీటీ సంస్థల పోటీ టాలీవుడ్ ప్రొడక్షన్ వాల్యూస్‌ను పెంచేందుకు ఇంధనంగా పని చేస్తోందనొచ్చు.
కానీ ఈ బిజినెస్ మోడల్ వల్ల ఎగ్జిబిటర్లు (థియేటర్ల యజమానులు) తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. భారీ బడ్జెట్, పాన్-ఇండియా రేంజ్ చిత్రాలకు మాత్రమే థియేటర్లలో ఆడియన్స్ ఫుట్‌ఫాల్స్ (రాక) బాగుంటున్నాయి. మిగిలిన రోజుల్లో థియేటర్లను రన్ చేయడం, మెయింటెనెన్స్ ఖర్చులు భరించడం ఎగ్జిబిటర్లకు పెద్ద భారంగా మారుతోంది. ఈ క్రమంలోనే సినిమా బాగున్నా కూడా ఓటీటీ రిలీజ్ డేట్ దగ్గర పడగానే థియేటర్ల నుంచి సినిమాలను తొలగించాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు క్రమబద్ధమైన విండో రూల్స్ అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా? మారుతున్న మార్కెట్ శైలిని ఆపడం సవాలుగా మారింది.
మరోవైపు ఈ ట్రెండ్ టాలీవుడ్ కంటెంట్ మేకింగ్‌ను కూడా ప్రభావితం చేస్తోంది. ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే సాధారణ కథలు సరిపోవని, లార్జర్-దెన్-లైఫ్ ఎక్స్‌పీరియన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండాలని దర్శకులు గ్రహించారు. కేవలం ఓటీటీలోనే చూసే వీలున్న కంటెంట్‌కు, థియేటర్లలోనే చూడాల్సిన థియేట్రికల్ కంటెంట్ మధ్య స్పష్టమైన విభజన రేఖ ఏర్పడింది. దీంతో కమర్షియల్ హంగులు, సౌండ్ ఎఫెక్ట్స్ ,విజువల్ గ్రాండియర్ ఉన్న సినిమాల వైపే టాలీవుడ్ మేకర్స్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
థియేట్రికల్ విండోస్ మార్పులు టాలీవుడ్ బిజినెస్ మోడల్‌ను మరింత గ్లోబల్ స్టాండర్డ్స్ వైపు నడిపిస్తున్నప్పటికీ.. థియేటర్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తుచేస్తున్నాయి. సినిమా నిర్మాణం లాభసాటిగా మారినప్పటికీ సినిమాకు అసలైన అందాన్ని ఇచ్చే థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులు దూరం చేసుకోకుండా చూడాలి. రాబోయే రోజుల్లో ఓటీటీ రెవెన్యూను ..థియేట్రికల్ రన్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ సాగే సరికొత్త హైబ్రిడ్ బిజినెస్ మోడల్ టాలీవుడ్‌లో మరింత స్థిరపడే అవకాశం ఉంది.
