Begin typing your search above and press return to search.

10 రోజులే కౌంట్ డౌన్.. థియేట‌ర్ల ప‌ర్సంటేజీ సంగ‌తి ఏం తేల్చారు?

టాలీవుడ్‌లో గత కొన్ని వారాలుగా హాట్ టాపిక్‌గా మారిన `థియేటర్ల రెంటల్ విధానం వర్సెస్ పర్సంటేజీ విధానం` వివాదం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది.

By:  Sivaji Kontham   |   20 Jun 2026 4:53 PM IST
10 రోజులే కౌంట్ డౌన్.. థియేట‌ర్ల ప‌ర్సంటేజీ సంగ‌తి ఏం తేల్చారు?
X

టాలీవుడ్‌లో గత కొన్ని వారాలుగా హాట్ టాపిక్‌గా మారిన `థియేటర్ల రెంటల్ విధానం వర్సెస్ పర్సంటేజీ విధానం` వివాదం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. అటు నిర్మాతలకు, ఇటు ఎగ్జిబిటర్లకు (థియేటర్ యాజమాన్యాలు) మధ్య నెలకొన్న ఈ విభేదాలను పరిష్కరించేందుకు సినీ పెద్దలు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. జూన్ నెలాఖరుకల్లా ఈ సమస్యపై తుది నిర్ణయం తీసుకుంటామని గతంలో ప్రకటించారు. ప్రస్తుత క్యాలెండర్ ప్రకారం జూన్ 30 రావడానికి కేవలం 10 రోజులు మాత్రమే కౌంట్ డౌన్ మిగిలి ఉండటంతో... అసలు థియేటర్ల పర్సంటేజీ సంగతి ఏం తేల్చారు? కమిటీ నివేదిక సిద్ధమైందా.. లేదా? అనే ఉత్కంఠ పరిశ్రమలో నెలకొంది.

ఈ వివాదం తీవ్రరూపం దాల్చిన సమయంలో అటు నిర్మాతల మండలి ప్రతినిధులు, ఇటు ఎగ్జిబిటర్లు కలిసి టాలీవుడ్ సినీ పెద్ద మెగాస్టార్ చిరంజీవిని పర్సనల్‌గా కలిసి తమ సమస్యలను వివరించారు. అందరి బాధలను విన్న మెగాస్టార్ ఇరు వర్గాలకు ఒక కీలకమైన హామీ ఇచ్చారు. ఈ సమస్యను వాస్త‌వాల‌తో లోతుగా పరిశీలించడానికి వేసిన ప్రత్యేక కమిటీ నివేదిక జూన్ నెలాఖరుకు వస్తుందని... ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్, సూచనలు- సలహాలను ఇరు వర్గాలు గౌరవించి పాటించాలని ఆయన సూచించారు. మెగాస్టార్ ఇచ్చిన హామీతో అప్పట్లో ఈ వివాదం కాస్త సద్ధుమణిగినా.. గడువు సమీపిస్తుండటంతో మళ్లీ చర్చలు మొదలయ్యాయి.

ఇంతకీ థియేటర్ల లీజు (రెంటల్) విధానమా? లేదా పర్సంటేజీ విధానమా? ఏది ఫైనల్ అవుతుందనే దానిపై ఇరు వర్గాల మనోగతం భిన్నంగా ఉంది. థియేటర్లకు భారీగా అద్దెలు కట్టడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని..సినిమా ఆడినా ఆడకపోయినా ఫిక్స్‌డ్ రెంట్ కట్టాల్సి వస్తోందని కొంద‌రు నిర్మాతలు వాదిస్తున్నారు. అందుకే సినిమా వసూళ్ల ఆధారంగా `పర్సంటేజీ విధానం` (లాభాల్లో వాటా) తీసుకురావాలని శిరీష్ రెడ్డి- దిల్ రాజు వ‌ర్గం తెలంగాణ ఎగ్జిబిట‌ర్ల త‌ర‌పున‌ పట్టుబడుతున్నారు.. అయితే థియేటర్ల నిర్వహణ ఖర్చులు, కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతాలు పెరిగిపోయిన తరుణంలో తాము థియేటర్లను మూసివేయాల్సిన ప‌రిస్థితి రాకుండా కాపాడాల‌ని తెలంగాణ ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువ‌నిర్మాత‌లు నాగ‌వంశీ, ర‌విశంక‌ర్ రెంట‌ల్ విధానానికి మ‌ద్ధ‌తు ప‌లుకుతుంటే, దానిని శిరీష్ రెడ్డి వ‌ర్గం వ్య‌తిరేకిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎగ్జిబిట‌ర్ల‌లోను పూర్తిగా డైల‌మా తొల‌గిపోలేద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప‌ర్సంటేజీ విధానం తెస్తే ఏమ‌వుతుందో.. రెంట‌ల్ -లీజు విధాన‌మే కొన‌సాగితే ఎలా ఉంటుందో కూడా కొంత అస్ప‌ష్ఠత ఉంద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి.

అందుకే అన్ని డైల‌మాల‌కు చెక్ పెడుతూ... ఇరు వర్గాల మధ్య వార్‌కి తెరదించేందుకు వేసిన ప్రత్యేక కమిటీ ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్ పరిశీలన ముగించి తుది నివేదికను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. నైజాం (తెలంగాణ), ఆంధ్ర ప్రాంతాల్లోని బి, సి సెంటర్ల థియేటర్ల పరిస్థితిని కూడా కమిటీ అంచనా వేసింది. ఇరు పక్షాలకు నష్టం జరగకుండా ఉండేలా ఒక `మధ్యే మార్గాన్ని`' కమిటీ అన్వేషిస్తున్నట్లు సమాచారం. కేవలం ఒకే విధానానికి పరిమితం కాకుండా... సినిమా బడ్జెట్ - వసూళ్ల శాతాన్ని బట్టి మొదటి వారం ఒకలా... ఆ తర్వాత వారాల్లో మరోలా ఉండేలా కొత్త నిబంధనలను రూపకల్పన చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

కౌంట్ డౌన్ ప్రారంభమైన ఈ 10 రోజుల్లో కమిటీ తన రిపోర్ట్‌ను అధికారికంగా సినీ పెద్దలకు సమర్పించనుంది. ఈ రిపోర్ట్ ఆధారంగానే టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించబోతోంది. అటు తెలంగాణ ఎగ్జిబిటర్ల ప్రయోజనాలను కాపాడుతూనే.... ఇటు నిర్మాతల భారాన్ని తగ్గించేలా కొత్త రూల్స్ ఉంటాయా? లేదా ఈ 10 రోజుల్లో మళ్లీ చర్చలు మొదటికి వస్తాయా? అనేది తేల్తుంది. ఏదేమైనా... టాలీవుడ్ భవిష్యత్తును, థియేటర్ల రన్నింగ్‌ను శాసించే ఈ కీలక నిర్ణయంపై ఈ నెలాఖరున పూర్తి స్పష్టత రానుంది.