Begin typing your search above and press return to search.

2025 టాలీవుడ్‌కు మిక్స్డ్ ఇయ‌రే!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి 2025 మిక్స్డ్ ఇయ‌ర్ అని చెప్పొచ్చు. ఈ ఏడాది హిట్‌లు ఉన్నాయి. అదే స్థాయిలో ఫ్లాప్‌లు, డిజాస్ట‌ర్లు కూడా ఉన్నాయి.

By:  Tupaki Entertainment Desk   |   31 Dec 2025 5:01 PM IST
2025 టాలీవుడ్‌కు మిక్స్డ్ ఇయ‌రే!
X

టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి 2025 మిక్స్డ్ ఇయ‌ర్ అని చెప్పొచ్చు. ఈ ఏడాది హిట్‌లు ఉన్నాయి. అదే స్థాయిలో ఫ్లాప్‌లు, డిజాస్ట‌ర్లు కూడా ఉన్నాయి. ఎలాంటి అంచ‌నాలు లేకుండా థియేట‌ర్ల‌లో విడుద‌లై ఊహించ‌ని విధంగా చిన్న సినిమాలు సంద‌డి చేస్తే భారీ బ‌డ్జెట్‌, క్రేజీ వీఎఫ్ ఎక్స్ వంటి హంగుల‌తో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్లుగా నిలిచి షాక్ ఇచ్చాయి. కొన్ని సినిమాలైతే ఓవ‌ర్ డోస్ యాక్ష‌న్‌తో, వీక్ స్టోరీల‌తో ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షించాయి. రొటీన్ కాన్సెప్ట్‌ల‌తో నెట్టింట ట్రోల్ ఫెస్టివెల్‌కు తెర లేపాయి.

ఈ విష‌యంలో ముందు వ‌రుస‌లో నిలిచిన మూవీ `గేమ్ ఛేంజ‌ర్‌`. జ‌క్క‌న్న తెర‌కెక్కించిన `ఆర్ఆర్ఆర్‌` త‌రువాత‌ గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న సినిమా కావ‌డం, తొలి సారి చ‌ర‌ణ్‌తో శంక‌ర్‌, ఏ.ఆర్‌. రెహ‌మాన్ క‌లిసి చేసిన సినిమా కావ‌డంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచ‌నాలు భారీ స్థాయిలో ఏర్ప‌డ్డాయి. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై హైప్ తారా స్థాయికి చేరింది. అయితే వీక్ కంటెంట్ ఉండ‌టం, ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షించే సీన్‌లే అధికంగా ఉండ‌టంతో బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అనిపించుకుని నిర్మాత దిల్ రాజుకు షాక్ ఇచ్చింది.

ఇక మాస్‌కా దాస్ విశ్వ‌క్‌సేన్ తొలిసారి లేడీ గెట‌ప్ ధ‌రించి చేసిన మూవీ `లైలా`దీ ఇదే ప‌రిస్థితి. కంటెంట్‌లో క్లారిటీ లేక‌పోవ‌డం, క‌న్ఫ్యూజ‌న్ కామెడీతో ప్రేక్ష‌కుల్ని ప‌రీక్షించింది. ఫ‌స్ట్ టైమ్ లేడీ గెట‌ప్ ఓ రేంజ్‌లో ఆడేస్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్న విశ్వ‌క్‌సేన్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఇక ఏళ్ల త‌ర‌బ‌డి చేసిన `రాబిన్‌హుడ్‌` పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న‌ట్టుగా మారింది. నితిన్‌, వెంకీ కుడుముల క‌ల‌యిక‌లో మైత్రీ వారు చేసిన ఈ సినిమా హైప్ త‌ప్ప ఏమీలేద‌నే టాక్‌ని సొంతం చేసుకుని భారీ న‌ష్టాల‌ని తెచ్చి పెట్టింది.

స్టార్‌బాయ్ సిద్దూకు ఈ ఇయ‌ర్ ఓ గుణ‌పాఠం నేర్పింది అనొచ్చు. `టిల్లు` మేనియాలో ఉన్న సిద్దూ అదే డైలాగ్ డెలివ‌రీ, అదే క్యారెక్ట‌రైజేష‌న్‌ని గుర్తు చేస్తూ `జాక్‌` మూవీని చేశాడు. స్పై, యాక్ష‌న్ డ్రామాగా తీయాల‌నుకున్న ఈ మూవీ కాస్తా సిద్దూ ఓవ‌ర్ ఇంట‌ర్‌ఫియ‌ర్‌తో కంగాలీగా మారి మిస్‌ఫైర్ గా మారింది. ఫ‌లితం ఫ్లాప్‌. మ్యాడ్ సిరీస్ మూవీస్‌తో మంచి పేరు తెచ్చుకున్న సంగీత్ శోభ‌న్ సోలో హీరోగా `గ్యాంబ్ల‌ర్‌`లో న‌టించాడు. హాలీవుడ్ ఫేమ‌స్ వెబ్ సిరీస్ `స్క్విడ్‌గేమ్‌` త‌ర‌హాలో గేమ్‌ని కాపీ చేయ‌డం, పూర్ క్వాలిటీ కార‌ణంగా ఆక‌ట్టుకోలేక‌పోయింది.

ఈ ఏడాది ట్రోల్‌కు గురైన మూవీ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`. ప‌వ‌న్ సినిమాల్లో ట్రోల్‌కు గురైన ఫ‌స్ట్ మూవీ ఇదే. పీరియాడిక్ స్టోరీ కావ‌డం, ఇందులో గ్రాఫిక్స్ అత్యంత నాసిర‌కంగా ఉండ‌టంతో ప‌వ‌న్ రేంజ్ సినిమాకు గ్రాఫిక్స్ ఈ స్థాయిలో ఉంటాయా? అని ఫ్యాన్స్‌తో పాటు స‌గ‌టు సినీ ల‌వ‌ర్ ఫైర్ అయ్యాడు. నెట్టింట ట్రోల్ చేశారు. అంతే కాకుండా సినిమా మేకింగ్ కూడా చాలా వ‌ర‌కు నాసిర‌కంగా ఉండ‌టంతో సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద చేతులెత్తేసింది. ప్రియ‌ద‌ర్శి, సెన్సేష‌న‌ల్ యూట్యూబ‌ర్ నిహారిక ఎన్ ఎం జంట‌గా న‌టించిన `మిత్ర‌మండ‌లి` కామెడీ ప్ర‌ధానంగా సాగుతుంద‌ని అంతా ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఇందులో అదే మిస్ కావ‌డంతో ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

చిన్న సినిమాల‌కు ఆద‌ర‌ణ ల‌భిస్తున్న నేప‌థ్యంలో `ప్రేమిస్తున్నా` పేరుతో ఓ చిన్న మూవీ విడుద‌లైంది. అయితే విజువ‌ల్స్ ప‌రంగా బాగున్నా కానీ వీర్డ్ సీన్స్‌తో విసిగించింది. ఇక ఇయ‌ర్ ఎండింగ్‌లో విడుద‌లై `అఖండ 2` హైప్‌కు మించి ఓవ‌ర్ డోస్ యాక్ష‌న్‌, ఓవ‌ర్ డోస్ సెంటిమెంట్ కార‌ణంగా ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షించింద‌నే కామెంట్‌లు వినిపించాయి. ఈ ఏడాది హిట్‌లు, సూప‌ర్ హిట్‌లు ఉన్నా కానీ అదే స్థాయిలో ఫ్లాప్‌లు, డిజాస్టర్‌లు కూడా ప‌ల‌క‌రించి షాక్ ఇచ్చాయి.