Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్‌కు బ్రేక్ వేసిన సమ్మర్.. కారణ‌మిదే!

ఏప్రిల్- మే సమ్మర్ సీజన్ అంటే సాధారణంగా టాలీవుడ్‌కు గోల్డెన్ పీరియడ్‌గా భావిస్తారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   13 April 2026 4:00 PM IST
బాక్సాఫీస్‌కు బ్రేక్ వేసిన సమ్మర్.. కారణ‌మిదే!
X

ఏప్రిల్- మే సమ్మర్ సీజన్ అంటే సాధారణంగా టాలీవుడ్‌కు గోల్డెన్ పీరియడ్‌గా భావిస్తారు. భారీ సినిమాలు, స్టార్ హీరోల ఎంట్రీలు, రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్.. ఇవ‌న్నీ ఈ సీజన్‌కు సహజ లక్షణాలు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. భారీ అంచనాలతో ప్రారంభమైన ఈ సమ్మర్, వాస్తవానికి మాత్రం బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా సాగుతోంది. ముఖ్యంగా రావాల్సిన పెద్ద సినిమాలేమీ రాక‌పోవ‌డంతో థియేటర్లపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతోంది.

ఊర‌ట‌నిచ్చిన డెకాయిట్

గత వారం రిలీజైన శ‌ర్వా బైకర్ ఓ మోస్తరు ఫలితాన్ని అందుకోగా, డెకాయిట్ నిర్మాతలకు కొంతవరకు ఊరటనిచ్చింది. అయితే ఇవి బాక్సాఫీస్‌ను షేక్ చేసే హిట్స్ మాత్రం కావు. ఇక డబ్బింగ్ సినిమాలు కూడా పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఫలితంగా, థియేటర్లకు ఆశించిన రద్దీ కనిపించడం లేదు. పెద్ద సినిమాలు లేకపోతే మొత్తం వ్యవస్థ స్లో డౌన్ అవుతుంది అన్న దానికి ఇది డైరెక్ట్ ఎగ్జాంపుల్.

ఈ వారమంతా చిన్న సినిమాలదే హ‌వా!

ఈ వారం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ వీక్ కూడా చెప్పుకోద‌గ్గ పెద్ద రిలీజులేమీ లేవు. పాపం ప్రతాప్, తిమ్మరాజు పల్లి టీవీ, బ్యాడ్ బాయ్ కార్తీక్ లాంటి చిన్న సినిమాలు మాత్రమే ఈ వారం విడుదలకు సిద్ధమయ్యాయి. వీటిలో పాపం ప్రతాప్ కు ఓటీటీ బ్రాండ్ బ్యాకింగ్ ఉండటం, తిమ్మరాజు పల్లి టీవీకి నిర్మాతగా కిరణ్ అబ్బవరం ప్రమోషన్లు చేయడం కొంత ప్లస్‌గా మారుతున్నాయి. కానీ బ్యాడ్ బాయ్ కార్తీక్ పరిస్థితి మాత్రం భిన్నం. ఈ సినిమా చాలా కాలంగా సెట్స్ మీద ఉండిపోవడం, సరైన ప్రచారం లేకపోవడం, అలాగే హీరో నాగశౌర్యకు ఇటీవల హిట్లు లేకపోవడంతో ఈ ప్రాజెక్టుపై పెద్ద‌గా బ‌జ్ లేదు.

కంటెంట్ కు ప్రాధాన్య‌మిస్తున్న ఆడియ‌న్స్

ఇక ప్రేక్షకుల మైండ్‌సెట్ కూడా గణనీయంగా మారింది. ఒకప్పుడు స్టార్ పవర్ మీదే థియేటర్లు నిండిపోయేవి. ఇప్పుడు మాత్రం కంటెంట్‌కు ప్రాధాన్యం పెరిగింది. చిన్న సినిమాలు కూడా మంచి కథతో వస్తే అంచనాలు లేకుండానే భారీ విజయాలు సాధించిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. అదే ఆశ ఈ వారం సినిమాలపై కూడా ఉంది. డార్క్ హార్స్ లాగా ఏదైనా సినిమా సర్ప్రైజ్ హిట్ అవుతుందేమో అన్న ఆసక్తి మాత్రం ట్రేడ్ వర్గాల్లో కనిపిస్తోంది.

అయితే వాస్తవ పరిస్థితి ఏమిటంటే.. సమ్మర్ సీజన్‌లోనూ ఈసారి స్లో డౌన్ రావడం థియేటర్ బిజినెస్‌కు ఆందోళన కలిగించే అంశం. పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల ఓపెనింగ్స్ బలహీనంగా మారాయి. చిన్న సినిమాలు డీసెంట్ ఓపెనింగ్స్ సాధించినా, అవి పెద్ద స్థాయి వసూళ్లను అందించలేకపోతున్నాయి. దీంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తంగా చూస్తే, ఈ సమ్మర్ సీజన్ టాలీవుడ్‌కు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. ప్లానింగ్ లోపాలు, రిలీజ్ డేట్స్ అస‌మతుల్య‌త‌, కంటెంట్ లో నాణ్యత.. ఇవ‌న్నీ క‌లిపి కలిపి బాక్సాఫీస్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఇక ముందైనా పెద్ద సినిమాలు చెప్పిన టైమ్ కు రిలీజ‌వుతాయా లేక చిన్న సినిమాలే ఈ గ్యాప్‌ను ఫిల్ చేస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మాత్రం, టాలీవుడ్ ఒక బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది.